/rtv/media/media_files/2026/02/07/fotojet-4-2026-02-07-15-50-11.jpg)
Miners' love tragedy
Miners' love tragedy : ఖమ్మం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పరస్పరం ప్రేమించుకున్న ఇరువురు మైనర్లు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. వివరాల ప్రకారం ఖమ్మం జిల్లాకు చెందిన పదిహేనేళ్ల బాలికతో సూర్యాపేట జిల్లాకు చెందిన పదిహేడేళ్ల బాలుడు ప్రేమాయణం సాగించాడు. ఖమ్మంలోని ఓ కళాశాలలో బాలుడు రెండో సంవత్సరం చదువుతున్నాడు. అదేకళాశాలలో బాలిక మొదటి సంవత్సరం ఇంటర్ చదువుతుంది. వారిద్దరూ గత కొంతకాలంగా ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఇటీవలే మేడారం జాతరకు వెళ్లిన వారిద్దరూ సమ్మక్క సాక్షిగా బాలిక మెడలో పసుపు కొమ్ము కట్టి బాలుడు వివాహం చేసుకున్నాడు. అనంతరం ఆ మైనర్ ప్రేమికులు తాము ఇరువురం వివాహం చేసుకున్నట్లు ఫోటోలు తీసుకుని స్నేహితులకు పంపారు. విషయం కాస్తా ఇరుకుటుంబాలకు తెలియడంతో బాల్యంలోనే వివాహం సరికాదని వారించి ఇరువురిని తల్లిదండ్రులు వారివారి ఇంటికి తీసుకెళ్లారు.
కాగా కలిసి బతికేందుకు పెద్దలు అంగీకరించకపోవడంతో మనస్తాపం చెందిన బాలుడు తమను వేరు చేశారనే మనస్తాపంతో ఇంట్లోనే ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. బలవన్మరణానికి పాల్పడే ముందు బాలికకు తాను చనిపోతున్నట్లు మెసేజ్ పంపించాడు. బాలుడు బలవన్మరణానికి పాల్పడిన కొద్దిసేపటికే బాలిక కూడా పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. బాలుడు, బాలిక బలవన్మరణంతో ఇరుకుటుంబాల్లో విషాదం నెలకొంది.
ఘటనను గోప్యంగా ఉంచిన ఇరుకుటుంబాలు వారి అంత్యక్రియలు పూర్తి చేసినట్లు తెలిసింది. అయితే విషయం కాస్తా బయటకు పొక్కడంతో పోలీసులు ఆరా తీసి వివరాలు సేకరించారు. ఆత్మహత్యలపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Follow Us