హైదరాబాద్:
రేవంత్ సర్కార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వేలు సరే.. పథకాలేవి ? పాలనేది ? అంటూ ఎక్స్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు. '' ప్రజాపాలనా ? ప్రతీకార పాలనా ?. సర్వేలు సరే, పథకాలేవీ-పాలనేది? ఉన్నవి ఉంచుతారా, ఊడబీకుతారా ప్రజల ప్రశ్నలకు సమాధానమేది ?. అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా ఆరు గ్యారంటీలను ఎందుకు అమలుచేయడం లేదు ? కాంగ్రెస్ అధిష్టానం ఎందుకు పట్టించుకోవట్లేదు ?.
ధాన్యం కొనుగోలు కేంద్రాలకు కొనే నాధుడు లేక రైతన్నలు కన్నీళ్లు పెడుతున్నా కాంగ్రెస్ అధిష్టానం గుండె కరగదా ? హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇండ్లు కూలుస్తున్నా, వాళ్లు గుండెలవిసేలా రోదిస్తున్నా కాంగ్రెస్ అధిష్టానానికి చలనం రాదా ?. ఎకరాకు ఏడాదికి రూ.15000 , రైతుభరోసా అందక రైతన్నలు పెట్టుబడుల కోసం తిప్పలు పడుతున్నా కాంగ్రెస్ అధిష్టానం ఎందుకు స్పందించదు ?.
Also Read: రేవంత్‌పై కోపాన్ని రైతులు వాళ్లపై చూపిస్తున్నారు: హరీష్ రావు
అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.2 లక్షల రుణమాఫీ అని అరకొర రుణమాఫీతో రైతులను అరిగోస పెడుతున్నా కాంగ్రెస్ అధిష్టానం ఎందుకు పట్టించుకోదు ?. సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలలో ప్రతిరోజూ ఫుడ్ పాయిజన్ జరిగి విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతున్నా ఎందుకు కనీసం సమీక్షించరు ?.ఎన్నికలకు ముందు నిరుద్యోగులను వాడుకుని ఇప్పుడు గ్రూప్ 1,2,3,4 పరీక్షలపై వారు అడుగుతున్న డిమాండ్లను ఎందుకు నెరవేర్చరు ?
ఆడబిడ్డలకు మహాలక్ష్మి పథకం కింద నెలకు రూ.2500 ఏమయింది ?. అవ్వ, తాతలకు నెలకు రూ.4,000 పింఛన్ ఎప్పటి నుండి ఇస్తారు ?. రాష్ట్రంలో నడుస్తున్నది ఏసీబీ, జేసీబీ సర్కార్.. కూల్చడం తప్ప నిలబెట్టడం తెలియని కాంగ్రెస్ సర్కార్. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కాంగ్రెస్ అధిష్టానం ఎందుకు నోరు మెదపదు ? రాష్ట్రం నుండి మూటలు వస్తున్నందుకే రాహుల్ మాటలు మూగబోయాయా?'' అంటూ కేటీఆర్ ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు.
Also Read: ఎల్లుండే జార్ఖండ్‌లో ఎన్నికలు..కీలక అంశాలివే..
ఇదిలాఉండగా ప్రస్తుతం ఫార్ములా ఈ-రేసు అక్రమాలకు సంబంధించి కేటీఆర్‌పై ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై వస్తున్న ఆరోపణలు, కేసుల నుంచి తప్పించుకునేందుకే కేటీఆర్ ఢిల్లీకి వెళ్తున్నారని విమర్శలు చేశారు. కేటీఆర్ ఒక బాధ్యతగల ప్రజాప్రతినిధిగా పోలీసుల విచారణకు సహకరించాలని తెలిపారు.
Also Read: బాణసంచా కాల్చడంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు