ఎవరి లైఫ్ వారిది.. ఒకరి పర్శనల్ లైఫ్ జోలికి మరొకరు వెళ్లకూడదు. ఇది బెసిక్ కామన్ సెన్స్! అయితే చాలా మంది పక్కనోళ్ల లైఫ్‌లో వేలు పెట్టడమే కాదు.. కొన్నిసార్లు కాలు.. మరికొన్నిసార్లు నోరు కూడా పెడతారు! ఇది ఎవరు చేసినా తప్పే.. కొండాసురేఖ లాంటి రాజకీయ నేతలు చేసినా తప్పే.. సీఎం చేసినా తప్పే.. సినిమావాళ్లూ చేసినా తప్పే.. అసలు ఎవరు చేసినా తప్పే..! సమంత కూడా అదే చెబుతున్నారు.. పర్శనల్ లైఫ్ జోలికి పోవద్దని కొండాసురేఖకు కాస్త ఘాటుగానే సమాధానం చెప్పారు. అయితే రాజకీయ నాయకులు ఇతరుల పర్శనల్ లైఫ్ గురించి అడ్డదిడ్డంగా కామెంట్స్ చేయడం కొత్త విషయమేమీ కాదు.. ఈ వికృత రాజకీయ క్రీడకు చంద్రబాబు లాంటోళ్లు కూడా బాధపడ్డ రోజులున్నాయి.. పవన్ కల్యాణ్ లాంటోళ్లు ఇప్పటకీ ఈ టార్చర్‌ను భరిస్తూనే ఉన్నారు..!
దుబ్బాకలో మొదలైన వివాదం..
తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కేటీఆర్‌కు మధ్య చాలా కాలంగా మాటల యుద్ధం నడుస్తోంది. ఇక ఇటీవల దుబ్బాకలో నిర్వహించిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి కొండా సురేఖ ముఖ్య అతిథిగా వచ్చారు. ఆమెను స్వాగతిస్తూ చేనేతలు తయారు చేసిన నూలు దండను రఘనందన్ రావు స్వయంగా మెడలో వేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. రఘునందన్‌తో కొండా సురేఖకు అపైర్ అంటగడుతూ కొంతమంది బీఆర్‌ఎస్ మద్దతుదారులు పైశాచిక ఆనందం పొందారు. ఈ విషయంపై సురేఖ భావోద్వేగానికి గురై కన్నీరు కూడా పెట్టుకున్నారు. మీ ఇంట్లో ఆడవాళ్లను ఇలానే అంటే ఊరుకుంటారా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఓవైపు ఈ విషయం గురించి రచ్చ అవుతుండగా.. కొండాసురేఖ చేసిన కామెంట్స్ మరో రచ్చకు దారి తీశాయి.
అగ్గి రాజేసిన సురేఖ కామెంట్స్..
ఈ వివాదంలో నాగార్జున ఫ్యామిలీతో పాటు సినీ సెలబ్రిటీలను కొండాసురేఖ లాగడం అగ్గికి రాజేసింది. నాగచైతన్య - సమంత విడాకులకు కారణం కేటీఆర్ అంటూ సురేఖ కామెంట్స్ చేశారు. నాగార్జున ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చివేయాలని ప్రస్తావన వచ్చినప్పుడు కేటీఆర్ సమంతను పంపించాలని కోరాడంటూ నిరాధారమైన కామెంట్స్ చేశారు సురేఖ. అంతటితో ఆగలేదు కేటీఆర్ దగ్గరకు వెళ్లాలని నాగార్జున సమంతను రిక్వెస్ట్ చేసినట్టుగా.. అందుకు ఆమె రిజెక్ట్ చేసినట్టుగా సురేఖ కామెంట్స్ చేశారు. ఈ విషయంలోనే గొడవ జరిగి సమంత- నాగచైతన్యకు విడాకులు తీసుకున్నారని ఆమె చేసిన వ్యాఖ్యలతో సినీ ఇండస్ట్రీ భగ్గుమన్నది.
భగ్గుమన్న సినీ లోకం..
కొండాసురేఖ కామెంట్స్‌పై యావత్ సినీ లోకం ఘాటుగా రియాక్ట్ అయ్యింది. సమంత, నాగార్జున, నాగచైతన్యతో పాటు చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, నాని లాంటి హీరోలు సైతం సురేఖ కామెంట్స్‌ను తీవ్రంగా విమర్శిస్తున్నారు. అయితే ఇలా ఇతరుల పర్శనల్ లైఫ్‌ను రాజకీయాల్లోకి తీసుకొచ్చి.. నీతిమాలిన పోకడలు ప్రదర్శించడం కొత్త విషయమేమీ కాదు. 2021లో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు టార్గెట్‌గా అసెంబ్లీ వేదికగా వైసీపీ ఎమ్మల్యేలు విచక్షణ మరిచి కామెంట్స్ చేశారు. చంద్రబాబు భార్యను సభలో అవమానపరిచేలా మాట్లాడారు. తన భార్యను అలా అనడాన్ని తట్టుకోలేకపోయిన చంద్రబాబు నాడు మీడియా ముందే బోరున ఏడ్చేసిన దృశ్యాలను ఇప్పటికీ తెలుగు ప్రజలు మర్చిపోలేదు.
వారికి వ్యక్తిగత జీవితం ఉండదా?
ఇక పవన్ కల్యాణ్ పర్సనల్ లైఫ్ గురించి ప్రత్యర్థి పార్టీలు అనవసర కామెంట్స్ చేయడం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. సీఎంగా ఉన్న సమయంలోనే సాక్ష్యాత్తు జగనే పవన్ వ్యక్తిగత జీవితం గురించి అదేపనిగా మాట్లాడుతుండేవారు. నిజానికి ఎవరికి నచ్చింది వారు మాట్లాడడానికి సెలెబ్రిటీలు ఏమీ పబ్లిక్ ప్రాపర్టీ కాదు.. వారికి కూడా వ్యక్తిగత జీవితం ఉంటుంది. దాన్ని అందరూ గౌరవించాల్సి ఉంటుంది. అయితే బాధ్యత కలిగిన పదువుల్లో ఉండే వారు సైతం ఈ విషయాన్ని పట్టించుకోకపోవడం అత్యంత బాధాకరమైన విషయం.