/rtv/media/media_files/2025/05/24/YaEmvFPFB70gEUAeNXub.jpg)
kcr family Photograph: (kcr family)
MLC Kavitha: కవిత లేఖతో బీఆర్ఎస్, కేసీఆర్ ఫ్యామిలీలో విభేదాలు భగ్గుమంటున్నాయి. కేసీఆర్ దేవుడు, కానీ ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయనడం సంచలనం రేపుతోంది. దీంతో కేసీఆర్ చుట్టూ కీలకంగావున్న కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావులో దయ్యాలు, కోవర్టులు ఎవరనేది చర్చనీయాంశమైంది.
ఈ మేరకు గత రెండు నెలల కింద రాసిన లేఖ బయటకు రావడం దారుణమని కవిత అన్నారు. తనపై కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయని, కోవర్టులను తప్పించి ముందుకెళ్తే భవిష్యత్ పార్టీదే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే బీఆర్ఎస్‌లో కేసీఆర్ కుటుంబం నుంచి నలుగురు వ్యక్తులు కేటీఆర్, హరీష్ రావు, కవిత, సంతోష్ రావు కీలకంగా ఉండగా.. ఇప్పుడు కవిత తాను ఒంటరిని అయ్యానంటూ ఆవేదన చెందడంపై కేసీఆర్ ఫ్యామిలీలో విబేధాలున్నట్లు బయటపడింది.
కేటీఆర్‌తో విభేదాలు..
తొలుత అన్నా చెల్లెళ్ల మధ్య మంచి సంబంధాలున్నాయి. అయితే కేటీఆర్‌కు ప్రమోషన్ ఇచ్చి పార్టీలో కీలకంగా మార్చిన కేసీఆర్.. కవితను మాత్రం ఎంపీ, ఎమ్మెల్సీ సీట్లకే పరిమితం చేశారు. దీంతో అంతర్గతంగా చిన్నబోయిన కవిత తన అసంతృప్తిని ఎన్నడూ బయటకు కనిపించనివ్వలేదు. కానీ లిక్కర్ స్కామ్ అరెస్ట్, బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. ఈ క్రమంలోనే కొన్ని రోజుల నుంచి కవిత, కేటీఆర్ మధ్య విభేదాలు మొదలైనట్లు వార్తలు వెలువడ్డాయి. తనకు కూడా కేటీఆర్ స్థాయి హోదా కల్పించాలని కేసీఆర్ ను కవిత ఒత్తిడి తెస్తున్నట్లు ప్రచారం జరిగింది. వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలని కూడా అడిగినట్లు టాక్ వినిపించింది. కానీ ఇందుకు కేసీఆర్ ఒప్పుకోకపోవడంతోనే కవిత మనస్తాపానికి గురైనట్లు ప్రచారం జరిగింది. అంతేకాదు జైలు నుంచి వచ్చిన కొన్నాళ్లకు బయటకెళ్లిన కవిత.. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నపుడు కేటీఆర్ ఒత్తిడితోనే ఇతర ముఖ్య నేతలు తనను కలవడానికి కూడా భయపడుతున్నట్లు ఆవేదన చెందినట్లు బయటపడింది.
సంతోష్ రావు పర్మిషన్ తప్పనిసరి?
రాజ్యసభ సభ్యుడు, కే సీఆర్ బంధువు సంతోష్ రావు చాలాకాలంగా కేసీఆర్ వ్యక్తిగత సహాయకుడిగా ఉంటున్నారు. ఇప్పటికీ కేసీఆర్ మంచి, చెడు అన్ని సంతోష్ చూసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే కేసీఆర్ కన్న కూతురైన కవిత.. తండ్రిని కలవాలంటే సంతోష్ పర్మిషన్ తీసుకోవాలట. దీనిపై పార్టీ నేతల వద్ద కవిత చాలాసార్లు వాపోయినట్లు ప్రచారం జరిగింది. గతంలో కవితకు కూడా ప్రగతిభవన్‌లో ఎంట్రీ దొరకలేదని కథనాలు వెలువడ్డాయి. అయితే దీనికి కారణం సంతోష్ అని, అతనివల్లే తండ్రితో గ్యాప్ ఏర్పడిందని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారట. అయితే ఇప్పుడు కవిత రాసిన లేఖ లీక్ చేసింది కూడా సంతోషేనా? సంతోష్ కు తెలియకుండా లేఖ ఎలా లీకైంది? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇద్దరి మధ్య హరీష్ రావు..
తొలుత హరీష్ రావు.. కేటీఆర్‌పై ఆగ్రహంగా ఉన్నట్లు పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపించాయి. హరీష్ రావు గత కొద్ది రోజులుగా అసంతృప్తిగా ఉన్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వచ్చాయి. ఆయన పార్టీ వీడుతారని, సొంత పార్టీ పెడతారంటూ కూడా ఊహాగానాలు వినిపించాయి. అయితే బీఆర్ఎస్ పార్టీలో తాను క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను అని ఇటీవల హరీష్ రావు స్పష్టం చేయడంతో పుకార్లకు చెక్ పడింది. కేటీఆర్ కు నాయకత్వం అప్పగిస్తే సహకరిస్తానంటూ ప్రకటించగానే.. కేటీర్ హరీష్ రావు ఇంటికెళ్లి రెండు గంటలపాటు చర్చలు జరిపారు. అయితే కవితతో విభేదాల నేపథ్యంలోనే కేటీఆర్.. హరీష్ రావు సపోర్ట్ కోరాడని చర్చ నడుస్తోంది. కేటీఆర్ తో చేతులు కలపడంతోనే హరీష్ పై కవిత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా తెలంగాణ రాజకీయాలు, కేసీఆర్ కుటుంబంలో భూకంపం రాబోతుందనే ఉహగానాలు వినిపిస్తున్నాయి.
kcr | ktr | family | telugu-news | today telugu news