/rtv/media/media_files/2025/09/06/hyderabad-ganesh-nimajjanam-2025-09-06-07-33-14.jpg)
Hyderabad Ganesh Nimajjanam
హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌లో నేడు ఘనంగా గణపతి నిమజ్జనాలు జరగనున్నాయి. అయితే ఈ ఏడాది ఇప్పటి వరకు 2 లక్షల వరకు వినాయక విగ్రహాలు నిమజ్జనం అయినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే నేడు బడా గణేష్ మహా నిమజ్జనం జరగనుంది. ఈ క్రమంలో హుస్సేన్ సాగర్ వద్ద 40 క్రేన్లు ఉంచడంతో పాటు ఒక భారీ బాహుబలి క్రేన్‌ను కూడా సిద్ధం చేశారు. అయితే నేడు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా భారీగా నిమజ్జనాలు జరగనున్నాయి. నిమజ్జనం సుమారుగా 40 గంటల పాటు కొనసాగుతుందని అధికారులు అంటున్నారు.
ఇది కూడా చూడండి: Ganesh Nimajjanam 2025: వినాయక నిమజ్జనాల్లో అపశ్రుతి.. క్రేన్ తెగి పడి ఇద్దరు.. నీటిలో కొట్టుకుపోయి మరికొరు..!
ఒక్క రోజే 50 వేల విగ్రహాలు..
ఈరోజు ట్యాంక్ బండ్‌పై దాదాపుగా 50 వేల విగ్రహాలు నిమజ్జనం అవుతాయని అధికారులు అంటున్నారు. జీహెచ్‌ఎంసీ ఆరు జోన్లలో ఇప్పటి వరకు 2,07,257 విగ్రహాలు నిమజ్జనం అయినట్లు అధికారులు తెలిపారు. జోన్‌ల వారీగా చూస్తే అత్యధికంగా కూకట్‌పల్లిలో 55,572 విగ్రహాలు నిమజ్జనం అయినట్లు అధికారులు వెల్లడించారు. ఆ తర్వాత ఖైరతాబాద్‌లో 38,212, శేరిలింగంపల్లిలో 35,325, ఎల్‌బీనగర్‌లో 33,047, సికింద్రాబాద్‌లో 26,540, చార్మినార్‌లో 18,561 విగ్రహాలు నిమజ్జనమయ్యాయి. నేడు ఇంకా అత్యధికంగా వినాయక నిమజ్జనాలు జరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.
గణపతి శోభాయాత్రల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు పోలీసులు కట్టదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సీసీ కెమెరాలు, 30 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అల్లర్లు అరికట్టడానికి అదనంగా 250 సీసీ కెమెరాలు, ఆరు డ్రోన్లు వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం వరకు జనం భారీగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే మధ్యాహ్నం 1:30 గంటల్లోగా నిమజ్జనం పూర్తి చేయాలని భావిస్తున్నారు. రికార్డు స్థాయిలో నేడు గణపతి విగ్రహాలు నిమజ్జనాలు జరుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇది కూడా చూడండి: Balapur Ganesh Laddu: కోటి ఖర్చైనా పర్లేదు..బాలాపూర్ లడ్డూకు ఈ సారి భారీ పోటీ!