/rtv/media/media_files/2025/11/10/hyderabad-crime-news-2025-11-10-10-23-41.jpg)
Hyderabad Crime News
గ్రేటర్ హైదరాబాద్, మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌లోని శాస్త్రీపురం ప్రాంతంలో గుండెలు పిండే విషాదం చోటుచేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న 8 సంవత్సరాల బాలుడిని వేగంగా దూసుకొచ్చిన లారీ ఢీకొట్టడంతో.. ఆ బాలుడు లారీ చక్రాల కింద నలిగిపోయి ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణ ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మృతుడిని సయ్యద్ రియాన్ ఉద్దీన్‌గా గుర్తించారు. రియాన్ ఉద్దీన్ తన స్నేహితులతో కలిసి శాస్త్రీపురంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
బాలుడు మృతి.. పరారీలో డ్రైవర్..
యూటర్న్ తీసుకునే క్రమంలో లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ ఘోరం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. లారీ బాలుడిపైకి దూసుకెళ్లడంతో.. రియాన్ ఉద్దీన్ చక్రాల కింద పడి అక్కడికక్కడే మరణించాడు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ వాహనాన్ని వదిలిపెట్టి పారిపోయాడు. రియాన్ ఉద్దీన్‌తోపాటు ఉన్న స్నేహితులు భయంతో పరుగులు తీసి అక్కడి నుండి పారిపోయారు. ప్రమాదాన్ని చూసిన స్థానికులు వెంటనే 100 నంబర్‌కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు.
ఇది కూడా చదవండి: హైదరాబాద్లో దారుణం.. భార్యకు అక్రమసంబంధం ఉందని
సమాచారం అందుకున్న మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న లారీ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. చిన్నారి రియాన్ ఉద్దీన్ మృతితో అతడి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు మరింత కఠిన చర్యలు తీసుకోవాలని.. ముఖ్యంగా రద్దీ ప్రాంతాల్లో భారీ వాహనాల వేగాన్ని నియంత్రించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.
ఇది కూడా చదవండి: ఘోర విషాదం: ఇంటి పైకప్పు కూలి.. కుటుంబం మొత్తం మృతి
Follow Us