/rtv/media/media_files/2025/09/18/urea-2025-09-18-07-14-39.jpg)
తెలుగు రాష్ట్రాల్లో యూరియా కొరత మాములుగా లేదు. ఇది ఇప్పుడు తీవ్రమైన సమస్యగా మారింది, ముఖ్యంగా ఖరీఫ్ సీజన్‌లో ఇది పంటల సాగుకు కీలక సమయం కాబట్టి రైతులకు యూరియా దొరకక చాలా ఇబ్బందులు పడుతున్నారు. యూరియా కోసం గంటల తరబడి ఎరువుల దుకాణాలు, పీఏసీఎస్ కేంద్రాల ముందు క్యూలో నిలబడాల్సి వస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి చూసినా, అవసరమైనంత యూరియా దొరకడం లేదని వాపోతున్నారు. ఈ క్రమంలో యూరియా ఓ నిండు ప్రాణాన్ని తీసింది.
Also Read : Iran-Israel: ఇజ్రాయెల్‌కు గూఢచర్యం.. నిందితుడిని బహిరంగంగా ఉరితీసిన ఇరాన్
యూరియా పంపిణీ చేస్తున్నారని తెలిసి ఒక్క బస్తా అయినా దొరుకితే చాలు అనే ఎంతో ఆశగా వెళుతుండగా అనుకోని ప్రమాదంలో ఓ రైతు భార్య చనిపోయింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా తాండూరు మండలం గోపాల్‌రావ్‌పేటలో జరిగింది. తాండూరు ఎస్సై కిరణ్‌కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం పోగుల మల్లేశ్, నానక్క(39) దంపతులకు అన్షిత్(6) సంతానం ఉన్నారు. రేచినిలో యూరియా బస్తాలు పంపిణీ చేస్తున్నారనే సమాచారం మేరకు మల్లేశ్ తన తల్లితో కలిసి ఉదయమే అక్కడికి వెళ్లాడు. అయితే తన భార్య వస్తే మరో బస్తా దొరుకుతుందనే ఆశతో అక్కడికి రావాల్సిందిగా నానక్కకు ఫోన్ చేశాడు.
దీంతో ఆమె తన కుమారుడిని బడికి పంపించి గోపాల్‌రావుపేటకు చెందిన మారుతి అనే వ్యక్తితో కలిసి బైకుపై యూరియా కోసం బయలుదేరింది. గోపాల్‌నగర్ గ్రామ పంచాయతీ మూలమలుపు వద్దకు చేరుకోగానే రేచిని వైపుగా వస్తున్న స్కూల్ బస్సు వారి బైకును ఢీకొట్టింది. దీంతో నానక్క, మారుతిలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం నానక్కను కరీంనగర్ తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆమె మృతిచెందింది. తల్లి చనిపోయిందనే విషయం తెలియని కుమారుడు ఇంటి వద్ద ఎదురుచూస్తున్న తీరు అందరిని కలిచివేసింది. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.
Also Read : Yogi Adityanath : దటీజ్ యోగి.. దిశాపటానీ ఇంటిపై కాల్పులు జరిపిన ఇద్దరు ఖతం !
రైతు ఆత్మహత్య
ఇక మరో ఘటనలో పంట దెబ్బతిందని మనస్తాపం చెందిన ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది. మందపల్లి గ్రామానికి చెందిన బొమ్మెన పెద్దులు(51) అనే వ్యక్తి గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నారు. ఐదు నెలలుగా జీతాలు రాకపోవడం, తన రెండెకరాల్లో సాగు చేసిన పత్తి, పసుపు భారీ వర్షాల వలన దెబ్బతినడంతో ఆవేదనకు గురయ్యాడు. అప్పు చేసి మరి పంట వేస్తే ఇలా జరిగిందని ఈ నెల 16న పొలానికి వెళ్లి అక్కడే పురుగుల మందు తాగాడు. ఇంటికి తిరిగిరాకపోవడంతో కుటుంబ సభ్యులు వెళ్లి పొలం వద్ద చూడగా అక్కడ పడిపోయి ఉన్నాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లుగా డాక్టర్లు చెప్పేశారు.