/rtv/media/media_files/2025/10/20/ex-mlc-jeevan-reddy-makes-sensational-allegations-2025-10-20-18-09-22.jpg)
Ex-MLC Jeevan Reddy makes sensational allegations
Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఈ రోజు తెలంగాణమంత్రులను ఉద్దేశించి సంచలన ఆరోపణలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను మానసిక హింసకు గురికావడానికి మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌లే కారణం అంటూ తన మనసులోని ఆవేదనంతా బయట పెట్టారు. ఆ మంత్రుల వల్ల తాను రోజు ఎంతో క్షోభను అనుభవిస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ర్టంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏదో జరుగుతుందనుకుంటే తనను మేకలా బలిచ్చారని తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తనకు తనకు ఏ పదవులు అక్కర లేదని.. ఇకనుంచి కార్యకర్తలను కాపాడుకోవడమే తన పని అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఇతర పార్టీ నుంచి ఫిరాయించి వచ్చినోడికి ప్రాధాన్యత ఇస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి నుంచి ఉన్న వారిని పట్టించుకోరా? అంటూ ఆయన తీవ్రంగా ప్రశ్నించారు. పార్టీ ఫిరాయించినోడికి నేటికీ సభ్యత్వం లేదంటూ పరోక్షంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ని ఉద్దేశించి జీవన్ రెడ్డి కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏంటో అర్థం కావడం లేదు.. పార్టీ ఫిరాయించినోడు చెప్తేనే పనులు చేస్తున్నారని జీవన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.
అంతేకాదు, జగిత్యాల కాంగ్రెస్ పార్టీకి తాము పట్టాదారులమని, కౌలుదారులం కాదని స్పష్టం చేశారు. సోమవారం ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను కలిసిన ఆయన పలు అంశాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బీర్పూర్ మండలంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం కొత్త కమిటీ నియామకాలను ఆయన వ్యతిరేకించారు. ఈ సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఉద్దేశిస్తూ పరోక్షంగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగిత్యాలను వలసదారులకు రాసిచ్చారా అంటూ మంత్రి ఎదుట ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
తాము ఎట్టి పరిస్థితుల్లో వలసదారుల ముందు తలవంచబోమని తేల్చి చెప్పారు. నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ జెండా కింద పోరాడుతున్న, పార్టీలో నిజమైన కార్యకర్తలను పక్కనపెట్టి బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకులకు దేవస్థానం కమిటీల్లో పదవులు ఎలా ఇస్తారని ఆయన తీవ్రంగా ప్రశ్నించారు. పెంబట్ల దేవాలయం తప్ప, మిగతా అన్ని కమిటీలు బీఆర్ఎస్ నేతల చేతుల్లోకి వెళ్లాయన్నారు. పొలాస పౌలస్తేశ్వర స్వామి ఆలయ కమిటీలో కూడా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అనుచరులకు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే మనుషులకు స్థానం కల్పించారని జీవన్ రెడ్డి ఆరోపించారు. వలసదారులకు ప్రాధాన్యత ఇస్తూ పోతే ఇక మేము పార్టీలో ఉండి ఎందుకన్నారు. మీకు ఇష్టం లేకపోతే మమ్మల్ని బయటకు వెళ్ళగొట్టండని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ తీసుకునే నిర్ణయాల కారణంగా తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నామని ఒక్కోసారి రాత్రులు నిద్ర పట్టడం లేదని జీవన్ రెడ్డి వాపోయారు. తమను కొద్దికొద్దిగా చంపకుండా జట్కా లాగా ఒకేసారి నరికేసినట్లు నిర్ణయం తీసుకోండని ఆయన సూచించారు. వలసదారుల్లా దోచుకునే వారిమి కాదని పదవులు ఉన్న లేకపోయినా పార్టీ కోసం ప్రజల కోసం పని చేశానని జీవన్ రెడ్డి తెలిపారు.
Also Read : తెలంగాణ, ఏపీలో కొత్త వైరస్ కలకలం.. ఒల్లంతా బొబ్బలు.. భయం భయం!
Follow Us