Telangana: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ సాధ్యమేనా ?

తెలంగాణలో  జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇది నిజంగా సాధ్యమవుతుందా లేదా అనేదానిపై సందేహాలు నెలకొన్నాయి. జనాభా గణనే దీనికి అడ్డంకిగా మారొచ్చని పలువురు నిపుణులు చెబుతున్నారు.

New Update
District Reorganization Sparks Intense Debate in Telangana

District Reorganization Sparks Intense Debate in Telangana

తెలంగాణలో  జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీనికోసం రిటైర్డ్‌ జడ్జితో కమిషన్ ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం కూడా ఆమోదం తెలిపింది. గతంలో జిల్లాల విభజన అశాస్త్రీయంగా జరిగిందని  సీఎం రేవంత్‌రెడ్డి చాలాసార్లు ప్రకటించారు. పలు మండలాలు రెండు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉండటం, మరికొన్ని అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాలు రెండు మూడు జిల్లాల పరిధిలో ఉండటం వల్ల పథకాల అమల్లో చిక్కులు ఎదురవుతున్నాయని. నిధుల కేటాయింపు విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందుకే  ఏదైనా ఒకే జిల్లా పరిధిలో లేదా ఒకే పార్లమెంట్ పరిధిలో ఉండేలా మార్పులు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 

Also Read: కోర్టు ధిక్కరణ..స్పీకర్ గడ్డం ప్రసాద్ కు సుప్రీం కోర్టు నోటీసులు

అయితే జిల్లాల  పునర్‌వ్యవస్థీకరణ నిజంగా సాధ్యమవుతుందా లేదా అనేదానిపై సందేహాలు నెలకొన్నాయి. జనాభా గణనే దీనికి అడ్డంకిగా మారొచ్చని పలువురు నిపుణులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల జనాభా గణనకు నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం 2026 ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్‌ 26 వరకు మొదటి దశ, అక్టోబర్ నుంచి 2027 ఫిబ్రవరి 28 వరకు రెండోదశ జనభా గణన జరగనుంది. ఇక జనాభా మదింపు, మార్పులు, నివేదిక వెల్లడి లాంటి ప్రక్రియ 2027 డిసెంబర్‌ దాకా కొనసాగతుంది.  

దీంతో జనాభా గణన పూర్తయ్యేదాకా రెవెన్యూపరంగా జిల్లాలు, మండలాలు, గ్రామాల్లో మార్పులకు చోటు లేదని నిపుణులు చెబుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక  రాష్ట్రంలోని 33 జిల్లాలను 25 జిల్లాలకు తగ్గిస్తారనే ప్రచారం నడిచింది. కానీ ఈ ప్రక్రియ ముందుకు సాగలేదు. రాష్ట్రంలో 17 పార్లమెంటు స్థానాలు ఉన్న సంగతి తెలిసిందే. దీంతో జిల్లాలను 17 జిల్లాలుగా లేదా అంతకన్నా కాస్త ఎక్కువ జిల్లాలుగా చేసే ఛాన్స్ ఉందని మరికొందరు భావిస్తున్నారు. 

గతంలో తెలంగాణలో 10 జిల్లాలు 48 రెవెన్యూ డివిజన్లు, 466 మండలాలు ఉండేవి. 2016 అక్టోబరులో తొలిసారిగా జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ చేపట్టారు. ఈ క్రమంలోనే 31 కొత్త జిల్లాలు, 74 రెవెన్యూ డివిజన్లు, 584 మండలాలు వచ్చాయి. ఆ తర్వాత  2020, 21లలో నారాయణపేట, ములుగు జిల్లాలను, మరికొన్ని మండలాలు ఏర్పాటు చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాలు ఏర్పడ్డాయి. అయితే తాజాగా కాంగ్రెస్‌ ప్రభుత్వం మరోసారి జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ చేపడతామని ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

Also Read: ఒక వ్యక్తి ఎన్ని బీర్లు తాగొచ్చు.. డాక్టర్లు ఏం చెబుతున్నారంటే?

దీనిపై రాజకీయంగా కూడా తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. ప్రజల దృష్టిని మరల్చేందుకే రేవంత్ సర్కార్ కావాలనే ఈ ప్రకటన చేసినట్లు కొందరు ఆరోపిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రయోజనం కోసం ఇలా హడావుడి చేస్తున్నట్లు చెబుతున్నారు. మరి జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ త్వరలోనే జరగుతుందా లేదా ఆలస్యమవుతుందా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే. 

Advertisment
తాజా కథనాలు