/rtv/media/media_files/2025/06/25/telangana-local-elections-2025-06-25-12-57-03.jpg)
Local Bodie Elections
TG Local Elections: రాష్ట్రంలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఎలాగైన విజయం సాధించాలని అడుగులు కదుపుతోంది.అందులో భాగంగా జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక కోసం ప్రత్యేక దృష్టి పెట్టింది. జడ్పీటీసీలుగా పోటీ చేసేందుకు పెద్ద సంఖ్యలో ఆశావహులు ముందుకు వస్తున్న నేపథ్యంలో... ఒక్కో స్థానానికి ముగ్గురితో ప్రాథమికంగా ఒక జాబితాను సిద్ధం చేయాలని నిర్ణయించింది. జిల్లా ఇన్‌చార్జి మంత్రులు తయారు చేసే జాబితాను టీపీసీసీకి పంపనున్నారు. అలా వచ్చిన జాబితాలను పరిశీలించి జడ్పీటీసీ అభ్యర్థిని టీపీసీసీ ఫైనల్ చేయనుంది.
ఒకవైపు స్థానిక ఎన్నికలు, మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, ఆయా జిల్లాల ఇన్‌చార్జి మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. జిల్లా పరిషత్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైనందున జడ్పీటీసీ స్థానాలకు పోటీ చేసే పార్టీ అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టాలని ఇన్‌చార్జి మంత్రులకు రేవంత్ రెడ్డి సూచించారు. జడ్పీటీసీ ఎంపిక విషయంలో జిల్లా మంత్రులు, నియోజకవర్గ ఇన్‌చార్జులు, డీసీసీ అధ్యక్షులు, ఎంపీలు, ముఖ్య నాయకుల అభిప్రాయాలు తీసుకోవాలని, ఈ నెల ఐదో తేదీ కల్లా ఆశావహుల జాబితాను సిద్ధం చేయాలని రేవంత్ రెడ్డి సంబంధిత మంత్రులకు సూచించారు. ఒక్కో స్థానానికి ముగ్గురు ఆశావహులతో కూడిన జాబితాను రూపొందించి టీపీసీసీ అధ్యక్షునికి పంపాలని కోరారు.
టీపీసీసీకి వచ్చిన జాబితాలపై చర్చించిన తర్వాత టీపీసీసీనే అభ్యర్థిని నిర్ణయిస్తుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. జడ్పీటీసీ అభ్యర్థుల ఎంపికలో వారి గుణగణాలు, అభ్యర్థులకు ప్రజల్లో ఉన్న పరపతి, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. మంచి అభ్యర్థిని ఎంపిక చేస్తే ఎన్నిక సాఫీగా జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అన్ని రకాలుగా అర్హులైన అభ్యర్థులనే పీసీసీ ఎంపిక చేస్తుందని, రాష్ట్రంలో ఎక్కువ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని మంత్రులకు దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. కాగా, ఎంపీటీసీ అభ్యర్థులను స్థానికంగా డీసీసీ స్థాయిలోనే ఎంపిక చేయాలని కాంగ్రెస్ నిర్ణయింది. ఒకవేళ ఏకగ్రీవం కాకపోతే అభ్యర్థుల జాబితాను పీసీసీకి పంపించాలని తద్వరా పీసీసీ ఫైనల్ చేస్తుందని తెలిపినట్లు సమాచారం
కాగా పలు గ్రామాలకు సంబంధించి రిజర్వేషన్ల ఖరారు సరిగా జరగలేదనే అంశాన్ని పలువురు మంత్రులు సీఎం రేవంత్ దృష్టికి తీసుకువచ్చారు. అయితే రిజర్వేషన్ల ఖరారు అంతా కంప్యూటర్ కంట్రోల్‌లోనే జరిగిందని, ఈ విషయంలో ఎవ్వరూ ఏమీ చేయలేమని సీఎం రేవంత్‌రెడ్డి తేల్చి చెప్పినట్లు తెలిసింది. కొడంగల్ నియోజకవర్గం నుంచీ కూడా తనకు ఇలాంటి ఫిర్యాదులే వచ్చాయని సీఎం వారితో అన్నట్లు తెలిసింది. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో జనాభా ప్రాతిపదికన కంప్యూటర్ కంట్రోల్‌లో రిజర్వేషన్ల ఖరారు జరిగినట్లు సీఎం వారికి చెప్పినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం రిజర్వేషన్లు మారే అవకాశం లేదని సీఎం తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: Rain alert for Telangana : తెలంగాణకు రెయిన్ అలర్ట్..మరో రెండు గంటల్లో ఆ జిల్లాల్లో భారీ వర్షం