తెలంగాణలో కుప్పకూలిన కలెక్టరేట్‌ బిల్డింగ్.. అందులోనే మంత్రి, అధికారులు

ఆదిలాబాద్ కలెక్టరేట్ భవనం పైఅంతస్తు కుప్పకూలింది. గురువారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. సాయంత్రం వేళ ఈ సంఘటన జరగడంతో కలెక్టరేట్ సిబ్బంది త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. స్లాబ్ నెమ్మదిగా కూలడం గమనించిన ఉద్యోగులు వెంటనే బయటకు పరుగులు తీశారు.

New Update
Adilabad Collectorate building

ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ భవనం పైఅంతస్తు కుప్పకూలింది. గురువారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. సాయంత్రం వేళ ఈ సంఘటన జరగడంతో కలెక్టరేట్ సిబ్బంది త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. పైఅంతస్తులోని స్లాబ్ నెమ్మదిగా కూలడం గమనించిన ఉద్యోగులు వెంటనే బయటకు పరుగులు తీశారు. దీంతో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. అధికారులు, సిబ్బంది సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గత కొన్ని రోజులుగా ఆదిలాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈక్రమంలోనే రెండు అంతస్థుల భవనం కూలిపోయింది. బిల్డింగ్ పాతది కావడంతో అందులోకి అడుగు పెట్టాలంటేనే అధికారులు భయంతో వణుకుతున్నారు. 

ఈ ఘటన జరిగిన సమయంలో రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష సమావేశం ఉండడంతో ఉద్యోగులందరూ అక్కడే అందుబాటులో ఉన్నారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ భవనం నిజాం కాలం నాటి పాతది కావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

గత కొంతకాలంగా పాత కలెక్టరేట్‌ను ఆధునికీకరించి కొత్తగా నిర్మించాలని కోరికలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనతో అది మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. భవనం కూలిపోయిన ఘటనపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలను తెలుసుకుని, తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం కలెక్టరేట్ కార్యకలాపాలను తాత్కాలికంగా వేరే భవనంలోకి మార్చే అవకాశం ఉంది.

Advertisment
తాజా కథనాలు