TG Politics: స్టూడెంట్స్ పార్టీల ఉచ్చులో పడొద్దు.. ఓయూలో రేవంత్ సంచలన స్పీచ్!

తెలంగాణ సాధనతోనే మన సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని నమ్మి ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు నడుం బిగించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మలి దశ తెలంగాణ ఉద్యమంలో ఈ గడ్డ ముందు భాగాన నిలిచిందని గుర్తు చేశారు.

New Update
CM revanth

CM revath-OU

తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షకు పురిటిగడ్డ.. అనేక చారిత్రక ఉద్యమాలకు కేంద్ర బిందువు అయిన ఉస్మానియా యూనివర్సిటీ (OU) వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగం సంచలనం సృష్టించింది. గుండెల నిండా అభిమానంతో వచ్చానని ప్రకటించిన ఆయన.. OU అభివృద్ధికి రూ. 1000 కోట్లు కేటాయించాలనే సంకల్పాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని, సామాజిక న్యాయ ఆకాంక్షను ప్రస్తావిస్తూనే.. గత పదేళ్ల పాలనపై పరోక్ష విమర్శనాస్త్రాలు సంధించారు. ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తున్నానని అంటే కొందరు ఎందుకంత ధైర్యం చేస్తున్నావు? అని అడిగారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అయితే OUకు రావాలంటే కావాల్సింది ధైర్యం కాదని.. అభిమానం అని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ గడ్డకు ఉన్న చైతన్యాన్ని, పౌరుషాన్ని గుర్తు చేశారు.

ఆధిపత్యం చెలాయించాలని చూసిన ప్రతీసారి తెలంగాణలో తిరుగుబాటు మొదలైంది. కొమురం భీమ్ నుంచి సాయుధ రైతాంగ పోరాటం, మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు ఆ పోరాటం కొనసాగింది. తెలంగాణ సాధనతోనే మన సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని నమ్మి ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు నడుం బిగించారని ఆయన అన్నారు. పీవీ నర్సింహా రావు, జైపాల్‌రెడ్డి, జార్జ్‌రెడ్డి, గద్దర్ వంటి గొప్ప వ్యక్తులను అందించిన ఘనత OUది అని కొనియాడారు. మలి దశ తెలంగాణ ఉద్యమంలో ఈ గడ్డ ముందు భాగాన నిలిచిందని గుర్తు చేసుకున్నారు.

స్వేచ్ఛ, సామాజిక న్యాయమే మా తమ్ముళ్ల ఆకాంక్ష:

తెలంగాణ సిద్ధించిన తర్వాత తమ తమ్ముళ్లు (విద్యార్థులు, యువత) ఎవరి ఆస్తులు, ఫామ్ హౌస్‌లు అడగలేదని, స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు మాత్రమే ఆశించారని సీఎం ఉద్ఘాటించారు. తమ ప్రజా ప్రభుత్వం అదే అందిస్తోందని స్పష్టం చేశారు. గత పదేళ్ల పాలనపై పరోక్ష విమర్శలు గుప్పించిన ఆయన.. ఆ కాలంలో ఉస్మానియా యూనివర్సిటీని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న తనను కొందరు విమర్శిస్తున్నారని.. అయితే తనకు విదేశీ భాష రాకపోయినా, పేదవాడి మనసు చదవడం వచ్చని, వారికి సంక్షేమం అందేలా పరిపాలన చేయడం వచ్చని ధీమా వ్యక్తం చేశారు. నాకేం ఫామ్ హౌసులు లేవు... నేనేం ప్రజల సొమ్ము దోచుకోలేదు అంటూ విమర్శకులకు ఘాటుగా సమాధానం ఇచ్చారు. బడుగు బలహీన వర్గాల ప్రజల ఆశీస్సులతోనే తాను ముఖ్యమంత్రిగా నిలబడ్డానని తెలిపారు.

సామాజిక న్యాయం వైపు ముందడుగు:

తాము అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవ్వకముందే ఏం చేశారని కొందరు అడుగుతున్నారని.. వారి కోసం తాను చేసిన పనులను వివరించారు. జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా గుర్తించడం, పదేళ్లుగా అధికారిక గుర్తింపు లేని తెలంగాణ తల్లిని (బహుజనుల తెలంగాణ తల్లి) ఆవిష్కరించి జాతికి అంకితం చేయడం, ఎస్సీ వర్గీకరణ చేసి, అమలు చేసి సామాజిక న్యాయం అందించడం, బీసీల లెక్క తేల్చేందుకు కులగణన చేపట్టడం. కేంద్ర ప్రభుత్వం జనగణనతోపాటు కులగణన చేపట్టే పరిస్థితులను కల్పించామని ఆయన తెలిపారు.

ఇది కూడా చదవండి: విశ్వనగరంగా హైదరాబాద్: ఇక అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో, సిటీ బస్సులు

భూమి, విద్యపై కీలక వ్యాఖ్యలు:

ప్రభుత్వం దగ్గర పంచడానికి భూములు లేవని.. ఉన్నది ఉన్నట్టు చెబితే విమర్శిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఫామ్ హౌస్‌లు కట్టుకున్నోళ్లు గత పదేళ్లలో దళితులకు మూడెకరాల భూమి ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. భూమి లేకపోవడం పేదరికం కావచ్చు... కానీ చదువు లేకపోవడం వెనుకబాటుతనం అన్నారు. విద్య ఒక్కటే వెనుకబాటుతనం లేకుండా చేయగలుగుతుందని. తలరాతలు మార్చి, జీవితాల్లో వెలుగులు నింపుతుందని నొక్కి చెప్పారు. అందుకే అందరికీ నాణ్యమైన విద్య అందించాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు.

నైపుణ్యాభివృద్ధికి సరికొత్త యూనివర్సిటీలు:

కులవివక్షను రూపుమాపి, కులం అడ్డుగోడలను తొలగించేందుకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. యువత నైపుణ్యాన్ని పెంపొందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని, ఆనంద్ మహీంద్రా చైర్ పర్సన్‌గా, గొప్ప వ్యక్తులను డైరెక్టర్లుగా నియమించామని వెల్లడించారు.  యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ 2036 ఒలింపిక్స్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని.. మట్టిలో మాణిక్యాలను వెలికితీసేందుకు ప్రణాళికలు వేస్తున్నామని తెలిపారు. పేదలకు ఏదైనా చేయాలనేది తన తపన అని చెబుతూ.. రూ. 1000 కోట్లతో ఉస్మానియా యూనివర్సిటీని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలని సంకల్పించామని పునరుద్ఘాటించారు.

టీచింగ్ స్టాఫ్ భర్తీకి కమిట్‌మెంట్:

యూనివర్సిటీలో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ భర్తీకి కమిటీ వేశామని.. ఇందులో ఎలాంటి రాజకీయ జోక్యం ఉండబోదని సీఎం హామీ ఇచ్చారు. పిల్లల భవిష్యత్తును చెడగొట్టే అధికారం ఎవరికీ లేదని స్పష్టం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణకు గుండెకాయ వంటిదని, పిల్లల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దే కమిట్‌మెంట్ ఉన్నవారిని మాత్రమే నియమించుకోవాలని సూచించారు. చివరగా విద్యార్థులు రాజకీయ పార్టీల ఉచ్చులో పడకుండా, నిబద్ధతతో నిరంతరం కష్టపడాలని, డాక్టర్లు, లాయర్లు, ఉన్నతాధికారులు కావాలని ఆకాంక్షించారు. యూనివర్సిటీ నుంచి నాయకులై రాష్ట్రాన్ని పరిపాలించాలని కోరుకుంటున్నానని సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని ముగించారు. 

ఇది కూడా చదవండి: కృష్ణారావుపై ఆరోపణలను డాక్యుమెంట్లతో సహా నిరూపిస్తా...జాగృతి కవిత సంచలన కామెంట్స్‌

Advertisment
తాజా కథనాలు