/rtv/media/media_files/2025/04/27/shZIIWPVr7I4QDncMU69.jpg)
BRS Silver Jubilee
BRS Silver Jubilee : ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, పునర్నిర్మాణం ధ్యేయంగా 25ఏళ్ల క్రితం ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ (బీఆర్‌ఎస్) ప్రస్థానంలో.. ఎన్నో అటుపోట్లు, తిరుగులేని విజయాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో పురుడుపోసుకుని భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందిన బీఆర్‌ఎస్ 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలోకి అడుగు పెట్టింది. ఒక రాష్ట్ర చరిత్రలో 25 ఏండ్లు అంటే తక్కువేం కాదు. తెలంగాణ సాధన కోసం ఆవిర్భవించిన పార్టీగా, ఉద్యమ పంథాలో కొనసాగి, రాష్ట్రం ఆవిర్భావం తర్వాత పదేండ్లు అధికారంలో కూడా ఉండటం బీఆర్‌ఎస్ ప్రత్యేకత.
తెలంగాణ అస్తిత్వ పతాక
2001, ఏప్రిల్ 27న తెలంగాణ అస్తిత్వ పతాకగా పురుడుపోసుకున్న పార్టీ.. ఏప్రిల్ 27, 2025 నాటికి ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని 25వ సంవత్సరంలోకి ప్రవేశించింది. ఈ నేపథ్యంలో పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను నిర్వహించుకుంటోంది. వరంగల్ జిల్లా ఎల్కతుర్తి ప్రాంతంలో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. పదిలక్షల మందితో భారీ ఎత్తున సభను నిర్వహిస్తామని పార్టీ వర్గాలు ఇప్పటికే ప్రకటించాయి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టీఆర్‌ఎస్ 14 ఏండ్లు అవిరామంగా పోరాటం చేసి, అనేక ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించిన పార్టీగా బీఆర్‌ఎస్ కు రాష్ట్రంలో గుర్తింపు ఉంది.
ఇది కూడా చూడండి: Pahalgam Terror Attack : పహల్గాం దాడిపై ఉగ్రవాద సంస్థ సంచలన ప్రకటన.. టీఆర్‌ఎఫ్ యూ టర్న్
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారతదేశ రాజకీయాల్లో సరికొత్త చరిత్రను లిఖించిన రాజకీయ పార్టీ. ఓ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని, దోపిడీని ప్రశ్నిస్తూ స్వయంపాలనే లక్ష్యంగా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ముందుండి నడిపించి విజయ తీరాలకు చేర్చింది. అంతకుముందున్న అనుభవాలను దృష్టిలో ఉంచుకొని.. రాజకీయ ప్రక్రియ ద్వారానే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సాధ్యమని బలంగా నమ్మి ముందుకెళ్లి గమ్యాన్ని ముద్దాడిన నాయకుడు టీఆర్ఎస్ అధినేత, గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.
బలపడుతూ..బలగాన్ని పెంచుకుంటూ
2001 ఏప్రిల్ 27న జలదృశ్యం వేదికగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించిన కేసీఆర్.. గులాబీ జెండాను ఎగరవేశారు. నాటి నుంచి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ముందుకు సాగింది టీఆర్ఎస్. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని కేంద్ర, రాష్ట్రాల్లో అధికారాన్ని పంచుకొన్నాక.. కొన్నాళ్ల తర్వాత బయటకు వచ్చింది. ఆ తర్వాత టీఆర్ఎస్ రాజకీయం పలు మలుపులు తిరుగుతూ వచ్చింది. కేసీఆర్‌తోపాటు పార్టీ తరఫున ఎన్నికైన ప్రజాప్రతినిధులు పదవులను లెక్కచేయక రాజీనామాలు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆ తర్వాత 2010లో జరిగిన ఉపఎన్నికలు మొదలు క్రమంగా బలపడుతూ, బలగాన్ని పెంచుకుంటూ వచ్చింది. 2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షతో తెలంగాణ సాధనకు మార్గం సుగమమైంది. అదే ఏడాది డిసెంబర్ తొమ్మిదో తేదీన కేంద్ర ప్రకటన..ఆ తర్వాత జరిగిన పరిణామాలను తనకు అనుకూలంగా మలుచుకుంటూ వచ్చారు కేసీఆర్.
కేసీఆర్ చచ్చుడో...తెలంగాణ వచ్చుడో
ఇక తెలంగాణ రాష్ట్రంలోనే కాలు పెడతానంటూ.. కేసీఆర్ చచ్చుడో...తెలంగాణ వచ్చుడో అని హస్తిన వెళ్లిన కేసీఆర్ స్వప్నం.. 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు పార్లమెంట్ ఉభయసభల ఆమోదం పొందడంతో నెరవేరింది. 2014 జూన్ రెండో తేదీన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావమైంది. 2014 సాధారణ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ఘనవిజయాన్ని సాధించి రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టింది. ఉద్యమాన్ని ముందుండి నడిపిన కేసీఆర్.. కొత్త రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా నవతెలంగాణకు భవితకు బాటలు వేసే బాధ్యతను భుజానికెత్తుకున్నారు. బంగారు తెలంగాణ లక్ష్య సాధన దిశగా ముందుకు సాగుతామని ప్రకటించారు. 2014 మొదలు ఏ ఎన్నిక వచ్చినా టీఆర్ఎస్ ఘనవిజయం సాధిస్తూ వచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు జరిగిన ఎన్నికల్లో ఏకంగా 99 స్థానాలను సాధించి రికార్డు సృష్టించింది. ఇదే సమయంలో తమది ఫక్తు రాజకీయ పార్టీగా మారిందని ప్రకటించిన గులాబీ నాయకత్వం.. కాంగ్రెస్, టీడీపీ సహా ఇతర పార్టీల నాయకులను ఆకర్షించింది.
పదేండ్ల కాలంలో ఎన్నో పథకాలు
పదవీకాలం మరో తొమ్మిది నెలలు ఉండగానే శాసనసభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లిన టీఆర్ఎస్.. 2018 ఎన్నికల్లో తిరుగులేని విజయంతో సత్తా చాటింది. దీంతో కేసీఆర్ రెండోమారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షునిగా కేసీఆర్ తనయుడు కేటీఆర్ బాధ్యతలు చేపట్టడంతో గులాబీ పార్టీలో కొత్త వాతావరణం ఏర్పడింది. ఫెడరల్ ఫ్రంట్ పేరిట జాతీయ రాజకీయాల వైపు కేసీఆర్ మధ్యలో దృష్టి సారించారు.కానీ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయంతో అది సాధ్యం కాలేదు. అటు రాష్ట్రంలోనూ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్కు అంత అనుకూలంగా రాలేదు. స్వపరిపాలనలో ఎన్నో పథకాలు, కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ సర్కార్.. పలు అంశాల్లో తనదైన ముద్ర వేసింది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు, రైతుబీమా, హరితహారం, రెండు పడకల గదుల ఇండ్లు, కులవృత్తులకు తోడ్పాటు, వివిధ వర్గాల సంక్షేమం కోసం పథకాలను చేపట్టింది.
వరుస అపజయాలు
ఆయితే 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన బీఆర్‌ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో మరింత డీలా పడింది. ఈ క్రమంలో పార్టీ అధినేత కేసీఆర్ ఫాంహైజ్ కే పరిమితమయ్యారు. గెలిచిన ఎమ్మెల్యేలలో పదిమంది పార్టీ మారటం. అధికారం కోల్పొయి పూర్తి నైరాశ్యంలో ఉన్న పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ఈ సిల్వర్ జూబ్లీ వేడుకలను వినియోగించుకోవాలని నాయకత్వం భావిస్తోంది. అందులో భాగంగా పాతికేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న వేళ రజతోత్సవ వేడుకల నిర్వహణతో పాటు పార్టీ నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు భారత రాష్ట్ర సమితి సిద్ధమైంది. ఈ మేరకు పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలను వరంగల్ కేంద్రంగా ఎల్కతుర్తిలో నిర్వహిస్తున్నది.
ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్
ఉద్యమపరంగానే కాకుండా రాజకీయ పరంగాను వరంగల్ జిల్లా బీఆర్ఎస్ కు కలిసివచ్చిన జిల్లాగా పేరుంది. 25 సంవత్సరాల ఉద్యమ, రాజకీయ చరిత్రలో వరంగల్ ది కీలక పాత్ర. ఈ తరుణంలో వరంగల్ సభ కొత్త రాజకీయ ప్రస్థానానికి నాంది కానుంది. గడచిన 15 నెలలుగా అటు పార్టీకార్యకర్తలకు, ఇటు ప్రతిపక పాత్రకు దూరంగా ఉంటూ ఫాం హౌజ్ కే పరిమితమైన చంద్రశేఖర్ రావు తొలిసారి ప్రజాక్షేత్రంలో పాల్గొని ప్రసంగించనుండడంతో ఈ సభకు ప్రాధాన్యత సంతరించుకున్నది.
కదలిన గులాబీ శ్రేణులు
బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే పలువురు ఔత్సాహిక కార్యకర్తలు కాలినడకన వరంగల్ కు పయనమయ్యారు. మరికొందరు ఎడ్లబండ్లు, కార్లు, సైకిళ్లు ఇలా ఎవరికీ వారు తమ బలం, బలగంతో వరంగల్ బాట పడుతున్నారు. ఇప్పటికే రాష్ట్రమంతా గులాబీమయం కాగా వేలాది మంది వరంగల్ బాట పట్టారు.
ఇది కూడా చూడండి: SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌కు మూడు నెలలు బ్రేక్!
‘రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, ప్రభుత్వ వైఫల్యాల మీద ప్రధానంగా చర్చిస్తాం. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు అనుగుణంగా బీఆర్ఎస్ శ్రేణులు చేపట్టాల్సిన కార్యాచరణపై సమగ్ర చర్చ ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చిన హామీల సాధన, హక్కులను కాపాడుకునే దిశగా రాష్ట్ర ప్రజలను చైతన్యం చేసేందుకు పార్టీ నాయకత్వం, కార్యకర్తలు, శ్రేణులు అనుసరించాల్సిన వ్యూహాలు, విధానాలపై సభలో చర్చిస్తాం’’అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.
కేసీఆర్ ప్రసంగమే కీలకం
14 ఏండ్లు ఉద్యమం, 10 ఏండ్లు అధికారం 1 సంవత్సరం ప్రతిపక్షంగా మొత్తం 25 ఏండ్ల రాజకీయ ప్రస్థానంలో ఈ రజతోత్సవ సభ బీఆర్ఎస్ కు ఒక రకంగా చాలా కీలక సభగా పేర్కొనవచ్చు. అధికారం కోల్పొయి నైరాశ్యంలో ఉన్న అధినేత తొలిసారి ప్రజల ముందుకు రావడం ఒక ఎత్తయితే ఆయన ఏం మాట్లాడుతారనే అంశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకోనుంది. ఉద్యమ సమయంలో యువతను ఉర్రూతలూగించిన కేసీఆర్ ప్రసంగాల్లో ఈ మధ్యకాలంలో కొంత పంచ్ లు, పవర్ తగ్గిందనే వాదన ఉంది. అయితే ఈ సభలో ఆయన ప్రసంగమే పార్టీ కార్యకర్తలకు, పార్టీ భవిష్యత్తుకు కీలకం కానుంది. ఆయన అధికార పార్టీ లోపాలను, ఒడిదుడుకులను తూర్పారబట్టి పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపగలిగితేనే మరో నాలుగేళ్లు మనుగడ సాధించే అవకాశం ఉంది. ఆ దిశగా ఆయన ప్రసంగం ఉంటుందనే ఆశతోనే పార్టీ కార్యకర్తలు వేలాదిగా సభకు తరలివస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ భవితవ్యాన్ని తేల్చనున్న ఈ రజతోత్సవ సభ పార్టీని విజయతీరాలకు చేర్చుతుందో...లేదో వేచి చూడడానికి మరికొన్ని గంటలే మిగిలి ఉన్నాయి.
ఇది కూడా చూడండి:Hyderabad: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం
ఇది కూడా చూడండి: BIG BREAKING: దాడిపై దర్యాప్తు సిద్ధమని కాళ్ల బేరానికి పాకిస్తాన్.. మాకు నీళ్లు కావాలి!
kcr | meeting | trs | 25-years | BRS Warangal meeting