/rtv/media/media_files/2025/10/07/tdp-entry-in-telangana-2025-10-07-13-47-32.jpg)
TDP's entry in Telangana
Jubilee Hills By Poll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ నెలకొంది. తెలంగాణలోనూ తమ పార్టీ కార్యకలపాలు సాగిస్తామని తెలిపిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తాజాగా తెలంగాణ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా ఈ రోజు సాయంత్రం తెలంగాణ టీడీపీ నేతలతో కీలక సమీక్ష నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ బైపోల్, స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన క్రమంలో తెలంగాణ నేతలలో చంద్రబాబు భేటీ కానుండటం ఆసక్తి రేపుతోంది. తెలంగాణలో ప్రధాన పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొన్న సందర్భంలో తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు స్కెచ్ ఏంటీ అనేది ఉత్కంఠగా మారింది.
తెలంగాణలో టీడీపీకీ క్షేత్రస్థాయిలో క్యాడర్ ఉన్నప్పటికీ రాష్ర్ట స్థాయిలో బలమైన నాయకుడు లేకపోవడంతో పార్టీ కార్యక్రమాలు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. దీంతో గత ఎన్నికల్లోనూ ఆ పార్టీ పోటీకి దూరంగా ఉంది. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఆ పార్టీ పోటీ చేయలేదు. అయితే రాష్ర్టంలో పరిస్థితులు మారిన నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలపై ఆయన దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో జీహెచ్ఎంసీకి ఎన్నికలు జరగాల్సి ఉన్న తరుణంలో జూబ్లీహిల్స్, స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో తెలంగాణ గడ్డపై చంద్రబాబు లుక్కేయడం చర్చనీయంశంగా మారింది. రాష్ర్టంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటం, బీఆర్‌ఎస్ మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలు కావడం, బీఆర్‌ఎస్ అధినేత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండటంతో చంద్రబాబు మరోసారి తెలంగాణపై ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో గెలిచిన ఎమ్మెల్యేలంతా ఒకపుడు టీడీపీ నుంచి వచ్చినవారే కావడంతో చంద్రబాబు మరోసారి రాజకీయ చక్రం తిప్పనున్నారనే ప్రచారం సాగుతోంది.
ముఖ్యంగా జూబ్లీహిల్స్, స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తుందా? లేక ఏపీలో బీజేపీ, జనసేనతో కూటమిగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ బీజేపీ పోటీ చేస్తున్నందున వారికి మద్దతు ఇస్తుందా? అనేది తేలాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఆయన సమావేశం నిర్వహించడం తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో సంచలనానికి కారణం అవుతుంది. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం అధినేత ముందు తెలంగాణ నేతలు ఎలాంటి ప్రతిపాదనలు ఉంచబోతున్నారు? వాటిపై చంద్రబాబు ఏ రకమైన నిర్ణయం తీసుకోనున్నారు అనేది తెలియాల్సి ఉంది. మొన్నటి వరకు జూబ్లీహిల్స్‌లో టీడీపీ పోటీ చేస్తుందని, సుహసిని అభ్యర్థిగా రంగంలోకి దిగుతారని ప్రచారం సాగింది. కానీ ఆ తర్వాత ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే ప్రస్తుత చంద్రబాబు నిర్ణయం జూబ్లీహిల్స్ లో పోటీ చేయడమా? లేక బీజేపీకి మద్దతు ఇవ్వడమా అనేది తేల్చనుంది. మరోవైపు మాగంటి గోపినాథ్ కూడా గతంతో టీడీపీనే కావడంతో ఇటీవల ఆయన మరణించిన సమయంలో చంద్రబాబు కుమారుడు లోకేష్ ఆయన భార్య బ్రాహ్మణి గోపినాథ్‌కు నివాళులు అర్పించడంతో పాటు వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. మాగంటికి చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు ఉన్న నేపథ్యంలో టీడీపీ ప్రస్తుత ఎన్నికల సందర్భంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది సస్పెన్స్‌గా మారింది.
మరో వైపు ఈ రోజు తెలంగాణలో టీటీడీపీ సమావేశంలో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రాష్ట్ర అధ్యక్ష పదవిపై నిర్ణయం తీసుకోబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఆ పోస్టు ఖాళీగానే ఉంది. ఆ తర్వాత 2024 ఆగస్టులో టీటీడీపీ కమిటీలన్నీ రద్దు చేసినట్లు ప్రకటించారు. త్వరలో టీటీడీపీ అధ్యక్షుడి ఎంపికతోపాటు నూతన కమిటీలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆ తర్వాత ఆన్ లైన్ లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా ప్రారంభించారు. అయితే కమిటీల నియామకం మాత్రం సాగలేదు. ఇంతలో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి టీడీపీలో చేరుతున్నట్లు ప్రచారం సాగింది. అన్నట్లే ఆయన చంద్రబాబుతో భేటీ కూడా అయ్యారు. ఆ తర్వాత మాజీ మంత్రి బాబుమోహన్ టీడీపీ సభ్యత్వాన్ని కూడా తీసుకున్నారు. మరోవైపు మాజీ మంత్రి మల్లారెడ్డి సైతం టీటీడీపీలో చేరబోతున్నట్లు ప్రచారం సాగింది. అయితే ఇప్పటికిపుడు పార్టీ కమిటీ వేస్తే తీగలకు అధ్యక్షపదవి ఇస్తారని ప్రచారం సాగుతోంది. వీరితో పాటు మరికొంతమంది టీడీపీలో చేరుతున్నారనే ప్రచారం సాగుతోంది. తాజా పరిణామాల నేపథ్యంలో టీటీడీపీలో కీలకంగా ఉన్న అరవింద్ కుమార్ గౌడ్, తీగల కృష్ణారెడ్డి వంటి సీనియర్ నేతల్లో ఒకరిని అధ్యక్షుడిగా ఖరారు చేస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం బీఆర్‌ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓడిపోతే ఆ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్, టీడీపీ వైపు చూస్తారని ప్రచారం సాగుతోంది. జూబ్లీహిల్స్, స్థానిక సంస్థల తర్వాత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ సెటిలర్ ఓటర్లు భారీ సంఖ్యలో ఉన్నారు. రాబోయే జీహెచ్ ఎంసీ ఎన్నికల సమయంలో టీడీపీ రంగంలోకి దిగే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా టీడీపీ తెలంగాణ ఎంట్రీని వ్యతిరేకిస్తున్న బీఆర్‌ఎస్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
ఇది కూడా చదవండి: తెలంగాణలో మరో దారుణం.. అలా చేస్తోందని అత్తను కొట్టి చంపిన కోడలు!