/rtv/media/media_files/2025/08/12/telangana-heavy-rains-2025-08-12-16-15-42.jpeg)
Hyderabad Heavy Rains
Hyderabad Heavy Rains :హైదరాబాద్‌లో మరోసారి భారీ వర్షం కురుస్తోంది. గడచిన వారం రోజులుగా కుండపోతగా కురుస్తున్న వర్షంతో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బుధవారం కూడా మరోసారి వర్షం కురవడంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగర వ్యాప్తంగా వర్షం జోరుగా కురుస్తోంది. మియాపూర్, చందానగర్, లింగంపల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపుర్, రాయదుర్గం, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సనత్‌నగర్, ఎస్సార్ నగర్, ఎర్రగడ్డ, అమీర్‌పేట్, పంజాగుట్ట, బోరబండ, యూసఫ్ గూడా ప్రాంతాల్లో వర్షం పడుతోంది.
మరో రెండు గంటల్లో భారీ వర్షం
ఎప్పటిలాగే సాయంత్రం సమయానికి అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్‌మ్యాన్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. కాబట్టి నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. వీలైనంత వరకు ఇండ్లకే పరిమితం కావాలని, అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలని సూచించారు. ఇక ప్రయివేటు ఉద్యోగులు సాధ్యమైనంత వరకు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు ప్రిపరేన్స్ ఇవ్వాలని సూచించారు.
ఇదిలా ఉండగా దుండిగల్, గండిమైసమ్మ, మల్లంపేట, బహదూర్‌పల్లి, సూరారం, కొంపల్లి, సుచిత్ర, జీడిమెట్ల, జగద్గిరిగుట్ట, బాలానగర్, సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్, జవహర్ నగర్, బొల్లారం, ప్యాట్నీ, పారడైజ్, చిలకలగూడ, మారేడుపల్లి, కోఠి, సుల్తాన్ బజార్, బేగంబజార్, నాంపల్లి, బషీర్ బాగ్, హిమాయత్ నగర్, నారాయణ గూడ, ట్యాంక్ బండ్, సైదాబాద్ లలో భారీగా వర్షం కురుస్తోంది. వాహన దారులు ఇబ్బందులకు గురవుతున్నారు.
అలాగే చంపాపేట్, సరూర్ నగర్, సంతోష్ నగర్, లంగర్ హౌస్, గుడిమల్కాపూర్, గోల్కొండ, జియాగూడ, మెహదీపట్నం, ఆసిఫ్ నగర్, పాతబస్తీ, చార్మినార్, బహదూర్‌పురా, ఫలక్‌నుమా, చాంద్రాయణగుట్ట, బార్కస్, ఉప్పుగూడ, ఛత్రినాక ప్రాంతాల్లో వర్షం పడుతోంది. దీంతో నగరవాసులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ పరిధిలో బుధ, గురువారాల్లో ఒంటిపూట బడులు నడపాలని ప్రభుత్వం ఆదేశించింది. పిల్లల్ని మధ్యాహ్నం ఇంటికి పంపించేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఐటీ ఉద్యోగులు, ఇతర సిబ్బందికి బుధ,గురువారాలు వర్క్ ఫ్రం హోం అవకాశం ఇవ్వాలని ఆదేశిస్తూ ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్‌కుమార్ ఆయా సంస్థలకు ఉత్తర్వులు జారీ చేశారు.
ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆయా శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం మరోసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా జిల్లాల్లో క్లౌడ్ బరెస్ట్ అయ్యే అవకాశాలు ఉండటంతో ఆ సందర్భంలో అనుసరించాల్సిన కార్యచరణ, తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
రానున్న మూడు రోజులు అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి సెలవులు రద్దు చేసినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ క్రమంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అధికార యంత్రాంగానికి ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. ముంపు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. వర్షాలవల్ల ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యుత్ శాఖ అధికారులు ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలని, మొబైల్ ట్రాన్స్‌ఫ్రార్మర్‌లు, జనరేటర్లు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. డ్రైనేజ్ వ్యవస్థను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, అత్యధిక వర్షాలు పడే ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రజలను అప్రమత్తం చేయాలని నిర్దేశించారు సీఎం రేవంత్‌రెడ్డి.
నీటిపారుదల శాఖలో సెలవులు రద్దు: మంత్రి ఉత్తమ్
భారీ వర్షాల నేపథ్యంలో నీటిపారుదల శాఖలో సెలవులు రద్దు చేస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. నీటిపారుదల శాఖలో అన్ని విభాగాలకు సెలవులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రాజెక్టులు, అనకట్టలు, కాల్వలతో పాటు చెరువులపై నిఘా పెంచాలని దిశానిర్దేశం చేశారు. విపత్తు సూచనలు కనిపిస్తే అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మార్గ నిర్దేశం చేశారు.
Also read : మొన్న బెదిరింపులు.. ఈరోజు కాళ్ల బేరం.. ఇండియాని నీళ్లు అడుక్కుంటున్న పాకిస్తాన్