/rtv/media/media_files/2025/02/19/nSIg7gqU4HW8lC1xHiE5.webp)
murder
Crime News : భర్తల హత్యల పరంపరలో మరో హత్య చోటు చేసుకుంది. హైదరాబాద్ కోకాపేట్‌లో దారుణం వెలుగు చూసింది . కట్టుకున్న భర్తపై కత్తితో దాడి చేసి హతమార్చిందో భార్య. స్థానికుల కథనం ప్రకారం.. అస్సాంకు చెందిన భార్య భర్తలు కోకాపేటలో నివాసం ఉంటున్నారు. అయితే గురువారం రాత్రి దంపతుల మధ్య విపరీతమైన గొడవ జరిగింది. ఈ గొడవలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో ఆవేశంతో భార్య కత్తితో భర్తపై దాడి చేసింది. దీంతో భర్త తీవ్రంగా గాయపడ్డాడు. అతని కేకలు విని స్థానికులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. కాగా తీవ్రంగా గాయపడ్డ బాధితుడు అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అస్సాంకు చెందిన భార్యభర్తలు కృష్ణ జ్యోతి బోరా, భరత్ బోరా బతకుతెరువు కోసం అస్సాం నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. కొకాపేట్‌లో ఉంటూ స్థానికంగా కార్మికులుగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే కొంతకాలంగా భార్య కృష్ణ జ్యోతిని భర్త కృష్ణ వేధింపులకు గురిచేస్తున్నాడు. ఇదే క్రమంలో గత అర్ధరాత్రి కూడా చిన్న విషయానికి భార్యాభర్తలు తీవ్రంగా గొడవ పడ్డారు. చివరకు భర్త వేధింపులు తట్టుకోలేక విచక్షణ కోల్పోయిన భార్య.. అతడిపై కూరగాయల కత్తితో దాడి చేసింది. దీంతో తీవ్రంగా గాయపడిన అతడు అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. భరత్ కేకలు విన్న స్థానికులు ఇంటిలోపలికి వచ్చి చూడగా భర్త రక్తపుమడుగులో పడి ఉన్నాడు. వెంటనే భరత్‌ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా... చికిత్స పొందుతూ మృతిచెందాడు. విషయం తెలిసిన వెంటనే నార్సింగ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితురాలిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తాగద్దన్న భర్త...ట్యాంక్‌బండ్‌లో దూకిన భార్య
హైదరాబాద్‌లో మరో ఘోరం జరిగింది. సాధారణంగా భర్తలు మద్యం సేవిస్తే వద్దు అనే భార్యలున్నారు. కానీ, ఇక్కడ రివర్స్ అయింది. భార్య మద్యానికి బానిసైంది. భర్త వద్దు మొర్రో మానేయమంటే వినలేదు. దీంతో పెద్ద గొడవ జరిగింది. దీంతో భార్య ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల ప్రకారం..గోల్నాకకు చెందిన భవాని అనే మహిళా, భర్తతో గొడవపడి సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్‌లో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. విషయం తెలిసిన వెంటనే స్పందించిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సంయుక్తంగా మినీ ట్యాంక్‌బండ్‌లో గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే, అర్థరాత్రి వరకు కూడా ఆమె ఆచూకీ లభించలేదు. భవానికి చంపాపేట్‌కు చెందిన సాయికుమార్‌తో కొన్నేండ్ల క్రితం వివాహమైంది.ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. భవానికి చాలా కాలంగా మద్యం సేవించే అలవాటు ఉంది. ఈ అలవాటు మూలంగా భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవల కారణంగా మూడు నెలల క్రితం భవాని పుట్టింటికి వెళ్లిపోయింది.
అయితే కుటుంబ పెద్దల సమక్షంలో జరిగిన సంప్రదింపుల తర్వాత ఆమె తిరిగి ఇటీవలె భర్త దగ్గరకు వచ్చింది. అయినప్పటికీ, ఆమె తన మద్యం తాగే అలవాటును మానుకోలేదు. రాత్రి మరోసారి భవాని మద్యం సేవించి ఇంటికి వచ్చింది. దీంతో భర్త సాయికుమార్ ఆమెను తీవ్రంగా మందలించాడు. భర్త తిట్టడంతో మనస్తాపం చెందిన భవాని ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. నేరుగా సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్‌కు చేరుకుని అందులో దూకినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ట్యాంక్ బండ్ లో అర్థరాత్రి వరకు వెతికినా కూడా భవానీ ఆచూకీ లభించకపోవడంతో ఆమె మృతి చెంది ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.