ఖమ్మంలో దారుణం..బిడ్డకు విడాకులిచ్చాడని అల్లుడిపై హత్యాయత్నం..అడ్డువచ్చిన అల్లుడి తల్లిపై....

ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ముత్తగూడెంలో దారుణం చోటు చేసుకుంది. తెల్లవారుజామునే గ్రామంలో హత్య చోటుచేసుకోవడంతో  గ్రామం ఉలిక్కిపడింది. పిల్లనిచ్చిన మామ అల్లుడు,ఆయన తల్లిపై దాడి చేయడంతో ఆమె మరణించింది.

New Update
FotoJet - 2025-11-04T103859.767

Attempted murder on son-in-law for divorcing his child

BIG BREAKING: ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ముత్తగూడెంలో దారుణం చోటు చేసుకుంది. తెల్లవారుజామునే గ్రామంలో హత్య చోటుచేసుకోవడంతో  గ్రామం ఉలిక్కిపడింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మూడు సంవత్సరాల క్రితం ముత్తగూడెం గ్రామానికి చెందిన మొటపోతుల వెంకన్న కుమార్తె అఖిలను అదే గ్రామానికి చెందిన గునిగంటి మహేష్ కు ఇచ్చి పెద్దల సమక్షంలో ఘనంగా పెళ్లి చేశారు. గత సంవత్సరం నుంచి మహేష్–అఖిల మధ్య మనస్పర్థాల వల్ల తరుచు గొడవలు జరుగుతున్నాయి. అనేక సార్లు పెద్దమనుషులు పంచాయతీ చేసిన ఫలితం లేకుండా పోయింది. దీంతో మహేష్‌ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించాడు. ఈ మధ్యే విడాకులు కూడా మంజూరు అయినట్లు తెలిసింది. అయితే ఈ రోజు ఉదయం మహేష్‌ మామ వెంకన్న తన కుమార్తె అఖిల, కొడుకు మనోజ్, బావమరిది మహుబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం దేవునిసంకీస గ్రామానికి చెందిన యల్ది వెంకన్నలను తీసుకుని మహేష్ ఇంటికి వచ్చారు. 


ఈ క్రమంలో తన కూతురును తిరిగి భార్యగా అంగీకరించాలని వెంకన్న డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటమాట పెరిగి స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం అక్కడి నుంచి వెనుదిరిగిన వెంకన్న ఇంటికి వెళ్లి  మనోజ్‌, యల్ది వెంకన్నలను తీసుకుని రెండు ద్విచక్రవాహనాల మీద కర్రలు, కల్లు గీసే కత్తులతో వచ్చి మహేష్ పై దాడి చేశారు.ఈ క్రమంలో  మహేష్ కడుపులో, వెనుక నుంచి కత్తితో పొడిచారు. రక్తపుమడుగులో కొట్టుకుంటున్న కుమారున్ని చూసి తల్లి నాగమణి(50) అడ్డుపోగా ఆమె పై కూడా కత్తులతో దాడి చేయడంతో అక్కడిక్కడే మరణించింది. స్థానికులు సహాయంలో మహేష్ ను చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న రూరల్ ఎస్ హెచ్ వో సీఐ ఎం. రాజు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి విచారణ చేపడుతున్నారు. హత్య చేసిన నిందితులైన మొటపోతుల వెంకన్న, మనోజ్, యల్ది వెంకన్నలు రూరల్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు తెలిసింది. కావాలనే పక్కా ప్లాన్ తో హత్య చేసి పోలీసులకు లొంగిపోయారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
 

Advertisment
తాజా కథనాలు