తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి మీనాక్షి నటరాజన్ తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. పనితీరే ఆధారంగానే పదవులు ఉంటాయని ఆమె స్పష్టం చేస్తున్నారు. తాజాగా ఆమె మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇన్‌ఛార్జ్ మంత్రులను తప్పించాలని ఆమె డిసైడ్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వారి పనితీరుపై మీనాక్షి అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయా మంత్రుల పనితీరుపై పలువురు ఎమ్మెల్యేలు ఇప్పటికే మీనాక్షికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: BRS Leaders: MLAపై సస్పెన్షన్ ఎత్తివేయాలని స్పీకర్‌ను కోరిన బీఆర్ఎస్ నాయకులు
ఎమ్మెల్యేలకు ఛాన్స్..
దీంతో ఆమె కూడా క్షేత్ర స్థాయి నుంచి వివరాలు తెప్పించుకున్నట్లు గాంధీ భవన్ లో చర్చ జరుగుతోంది. స్థానిక నేతలతో ఇన్‌ఛార్జ్ మంత్రులకు సమన్వయమే లేదని ఆమె వ్యాఖ్యానించినట్లు వార్తలు వస్తున్నాయి. అధికారిక కార్యక్రమాల్లో మాత్రమే ఇంఛార్జ్ మంత్రులు కనబడుతున్నారంటూ మీనాక్షి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రులను తప్పించి తమకు అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యేలు కోరుతున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Delimitation: డీలిమిటేషన్ వల్ల సీట్లు తగ్గుతాయా ? కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
ఈ నేపథ్యంలో ఇన్‌ఛార్జ్ మంత్రులను తప్పించాలని సీఎంకు మీనాక్షి ఆదేశాలు ఇచ్చినట్లు చర్చ సాగుతోంది. కొత్త జిల్లాల వారీగా ఇన్‌ఛార్జ్ మంత్రులను నియమించాలని సూచించినట్లు సమాచారం. సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆయా జిల్లాలకు ఇన్‌ఛార్జ్‌లుగా నియమించాలని స్పష్టం చేసినట్లు సమాచారం. దీనిపై రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.