/rtv/media/media_files/2025/12/15/fotojet-12-2025-12-15-08-54-29.jpg)
A single vote made the winners in the Sarpanch elections..
తెలంగాణ పల్లెలన్నీ సర్పంచ్ ఎన్నికలతో సందడిగా ఉన్నాయి. చాలా కాలం తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయ వాతావరణం కనిపిస్తోంది. గ్రామపంచాయతీ(Gram sarpanch Elections) సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికకోసం నిర్వహిస్తున్న పోలింగ్‌లో గ్రామీణ ప్రాంత ఓటర్లు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మూడు దశల్లో నిర్వహిస్తున్న పంచాయతీ ఎన్నికల్లో ఇప్పటికే రెండు దశలు ముగిశాయి. ఈ నెల 17న మూడవ దశతో సర్పంచ్ ఎన్నికలు ముగిసి గ్రామాలకు కొత్త పాలకవర్గాలు రానున్నాయి. అయితే ఆదివారం జరిగిన రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈసారి సర్పంచ్‌గా పోటీ చేయడానికి, ఓటు వేయడానికి యువకులు ఆసక్తి కనపర్చడంతో ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి. ఇదిలా ఉండగా రెండదశలోనూ పలువురు ఒక్క ఓటుతో గట్టెక్కిన వారుండగా, మరికొందరు సమాన ఓట్లు వచ్చి లక్కీడ్రాతో విజయం సాధించడం గమనార్హం..వారెవ్వరో ఒకసారి లెక్కేద్దామా? - panchayat elections 2025
Also Read : మళ్ళీ అదే జోరు... సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయభేరి
ఒక్క ఓటుతో దక్కిన పదవి..
నిజామాబాద్ జిల్లా సిరికొండ గ్రామంలో ఒక్క ఓటుతో ఓ అభ్యర్థి సర్పంచి పదవిని దక్కించుకున్నారు. భారత రాష్ట్ర సమితి మద్దతుతో మల్లెల సాయిచరణ్, కాంగ్రెస్ మద్దతుతో చిట్యాల రవిశంకర్ పోటీ చేశారు. వీరిలో సాయిచరణ్‌కు 736 ఓట్లు, రవిశంకర్‌కు 735 ఓట్లు లభించడంతో సాయిజచరణ్ విజయం సాధించాడు.
కోడలును గెలిపించిన మామ
నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం బాగాపూర్ గ్రామ సర్పంచ్‌గా ముత్యాల శ్రీవేద పోటీ చేశారు. దీంతో ఆమె మామ ముత్యాల ఇంద్రకరణ్‌రెడ్డి అమెరికా నుంచి వచ్చి మరీ ఓటు వేశారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ ఒక్క ఓటుతోనే ఆమె గెలవడం విశేషం. ఈ ఎన్నికల్లో మొత్తం 426 ఓట్లకు 378 పోలయ్యాయి. ఇందులో ముత్యాల శ్రీవేదకు 189, మరో అభ్యర్థి హర్షస్వాతికి 188 ఓట్లు వచ్చాయి. ఒక ఓటు చెల్లలేదు. దీంతో శ్రీవేద ఒక్క ఓటు తేడాతో గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. ఇంద్రకరణ్‌రెడ్డి రెండు నెలల కిందట అమెరికాలోని తన కుమార్తె వద్దకు వెళ్లారు. పంచాయతీ ఎన్నికల్లో తన కోడలు పోటీ చేస్తుందని, పోటీ తీవ్రంగా ఉందని తెలుసుకున్న ఆయన పోలింగ్‌కు 4 రోజుల ముందు హుటాహుటిన అమెరికా నుంచి తిరిగి వచ్చారు. ఆయన రావడం కోడలు ఒక్క ఓటుతో గెలవడంతో కోడలును గెలిపించిన మామ అంటూ అందరూ ప్రశంసిస్తున్నారు.
Also Read : ఆ గ్రామంలో టై అయిన పోలింగ్.. లక్కి డ్రాలో సర్పంచి పదవి
ఒక్క ఓటే సర్పంచ్‌ను చేసింది
వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం రాంపూర్‌లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి గొల్ల రమాదేవి ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. భారత రాష్ట్ర సమితి మద్దతిచ్చిన అభ్యర్థి దుర్గనోల్ల మౌనికకు 116 ఓట్లు వచ్చాయి. గొల్ల రమాదేవికి 117 రావడంతో ఒక్క ఓటు తేడాతో సర్పంచిగా విజయం సాధించారు.
ఇద్దరూ ఒక ఓటే
కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో ఒక్క ఓటు తేడాతో ఇద్దరు అభ్యర్థులు సర్పంచిగా విజయం సాధించారు. పోతంగల్ కుర్ధు గ్రామపంచాయతీలో కాంగ్రెస్ మద్దతుదారు సంతోష్‌కు 280 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి శ్రీనివాస్‌కు 279 ఓట్లు వచ్చాయి. కరక్‌వాడి గ్రామపంచాయతీలో సుధాకర్‌రావుకు ఒక్క ఓటుతో తన సమీప ప్రత్యర్థి మాజీ సర్పంచి చందర్‌రావుపై గెలుపొందారు. కాంగ్రెస్ బలపర్చిన సుధాకర్‌రావుకు 114 ఓట్లు, భారత రాష్ట్ర సమితి మద్దతుదారు చందర్‌రావుకు 113 ఓట్లు లభించాయి.
గెలిపించిన ఒక ఓటు
కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ముంజంపల్లి సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థిని నందగిరి కనకలక్ష్మి ఒక ఓటు తేడాతో విజయం సాధించారు. తన ప్రత్యర్థి భారత రాష్ట్ర సమితి మద్దతుదారు యేల్పుగొండ కొమురమ్మ(భారత రాష్ట్ర సమితి మద్దతుదారు)పై గెలుపొందారు. గ్రామంలో మొత్తం 1,838 ఓట్లు పోలయ్యాయి. కనకలక్ష్మికి 898 ఓట్లు రాగా ప్రత్యర్థి కొమురమ్మకు 897 ఓట్లొచ్చాయి.
బుచ్చిరెడ్డిదే విజయం
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం గుండాలలో 2,049 ఓట్లు ఉండగా 1,834 పోలయ్యాయి. నోటా, చెల్లని ఓట్లు పోగా.. కాంగ్రెస్ బలపర్చిన బుచ్చిరెడ్డికి 909 ఓట్లు, భారత రాష్ట్ర సమితి మద్దతుదారు కాంతారెడ్డికి 908 ఓట్లు వచ్చాయి.
మల్లమ్మను వరించిన విజయం
వరంగల్ జిల్లా సంగెం మండలం ఆశాలపల్లి పంచాయతీ సర్పంచి అభ్యర్థులుగా కొంగర మల్లమ్మ, రాయపురం నవ్యశ్రీలు పోటీ పడ్డారు. 1,647 ఓట్లు ఉండగా 1,451 పోలయ్యాయి. ఇందులో కాంగ్రెస్ బలపర్చిన మల్లమ్మకు 705 ఓట్లు రాగా.. భారత రాష్ట్ర సమితి మద్దతుదారు నవ్యశ్రీకి 704 ఓట్లు వచ్చాయి. అధికారులు రెండు పర్యాయాలు లెక్కించినా అదే ఫలితం వచ్చింది. మల్లమ్మ తన ప్రత్యర్థిపై ఒక్క ఓటు ఆధిక్యంతో గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు.
డిగ్రీ విద్యార్థి సర్పంచ్
కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం పెద్దూరుపల్లి గ్రామ సర్పంచిగా డిగ్రీ చదువుతున్న 21 ఏళ్ల రామడుగు హరీశ్(కాంగ్రెస్ మద్దతుదారు) కేవలం ఒక ఓటుతో గెలుపొందారు. ఆ ఊరిలో 256 ఓట్లు పోలవగా మూడు చెల్లలేదు. ప్రత్యర్థి భారత రాష్ట్ర సమితి బలపర్చిన గంగినేని హరీశ్‌కు 126 ఓట్లు రాగా రామడుగు హరీశ్‌కు 127 ఓట్లు వచ్చాయి.
గట్టి పోటీ ఇచ్చిన రెబల్
-కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం అంబాల్‌పూర్‌లో ఒక్క ఓటుతో కాంగ్రెస్ మద్దతుదారు వడ్లకొండ వెంకటేశ్(వినోద్) సమీప ప్రత్యర్థి వేగుర్ల ఎల్లయ్య(కాంగ్రెస్ రెబల్)పై గెలుపొందారు. సర్పంచి అభ్యర్థులుగా వడ్లకొండ వెంకటేశ్, వేగుర్ల ఎల్లయ్య, మహ్మద్ మొయినోద్ధీన్ బరిలో నిలిచారు. 1033 ఓట్లు పోలవ్వగా చెల్లనివి, నోటాకు వచ్చినవి 10. వెంకటేశ్‌కు 449, ఎల్లయ్యకు 448, మొయినోద్ధీన్‌కు 126 ఓట్లు వచ్చాయి. అధికారులు నాలుగు సార్లు లెక్కించారు. మొదట ఎల్లయ్యకు రెండు ఓట్లు ఎక్కువ రాగా.. మరో అభ్యర్థి మొయినోద్ధీన్‌కు సంబంధించిన ఓట్లు లెక్కింపు చేయగా అందులో నుంచి మూడు ఓట్లు వెంకటేశ్‌కు వచ్చాయి. దీంతో ఒక్కఓటు తేడాతో ఎల్లయ్యపై వెంకటేశ్ గెలుపొందారు.
భళా భీమన్న..భళా
చిన్నచింతకుంట మండలం గూడూరులో కాంగ్రెస్ మద్దతుదారు శేఖర్ స్వతంత్ర అభ్యర్థి భీమన్నగౌడ్ పోటీపడ్డారు. మొదటి సారి లెక్కింపులో 2 ఓట్లతో భీమన్నగౌడ్ గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. దీన్ని సవాలు చేస్తూ ప్రత్యర్థి రీకౌంటింగ్ కోరారు. మూడు సార్లు రీకౌంటింగ్ చేసినా.. ఒక్క ఓటుతో భీమన్నగౌడ్ గెలిచారు.
Follow Us