Minster KTR: హుస్సేన్ సాగర్ లో వరద పరిస్థితిని పరిశీలించిన మంత్రి కేటీఆర్

Minster KTR: హుస్సేన్ సాగర్ లో వరద పరిస్థితిని పరిశీలించిన మంత్రి కేటీఆర్
New Update

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడికక్కడ వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రాష్ట్ర చరిత్రలోనే రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. వరదల కారణంగా పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యంగా భాగ్యనగరం భారీగా కురుస్తున్న వర్షాలకు తడిసిముద్దవుతుంది. హైదరాబాద్ లోని ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానలకు రోడ్లన్నీ జలమయం అయిపోయాయి. దీంతో హుస్సేన్ సాగర్ కు భారీగా వరద వచ్చి చేరుతుంది.

ఈ క్రమంలో గురువారం మంత్రి కేటీఆర్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ తో కలిసి హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ లో వరద పరిస్థితిని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు.

వర్షాకాలం ప్రారంభానికి ముందే నాలాల్లో పూడిక తీశామని తెలిపారు. నగరంలో ఎస్సార్డీపీ చేపట్టకముందు లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యేవని కేటీఆర్ చెప్పారు. చెరువుల్లోనూ తక్కువ నీటి మట్టం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని వెల్లడించారు. విపత్కర పరిస్థితుల్లో చేతనైతే ప్రతిపక్షాలు సహాయక చర్యల్లో పాల్గొనాలని సూచించారు.

వర్షాలను కూడా రాజకీయం చేయడం సరికాదన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో రిలీఫ్‌ క్యాంపులను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ప్రాణనష్టం జరుగకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. హైదరాబాద్‌లో 14 బ్రిడ్జిలు మంజూరు చేశామన్నారు. అనంతరం ముసారంబాగ్‌ వద్ద మూసీనదిపై ఉన్న బ్రిడ్జిని మంత్రి కేటీఆర్‌ పరిశీలించారు.

కాగా మరోవైపు వాయవ్య బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీరంలో తీవ్ర అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సముద్ర మట్టం నుంచి 7.6 కి.మీ ఎత్తు వరకు స్థిరంగా కొనసాగుతున్నది. దీని ప్రభావంతో తెలంగాణలో రెండ్రోజులపాటు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది.

ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, యాదాద్రి-భువనగిరి జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. నిర్మల్‌, వరంగల్‌, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిజామాబాద్‌, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.

#telangana #hyderabad #heavy-rains #minister-talasani-srinivas-yadav #minister-ktr #telangana-minister-ktr #hussain-sagar
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe