Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరో 10 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలను ఆకట్టుకునేందుకు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లు అగ్రనేతలను తెలంగాణలో దించనున్నాయి. బీజేపీ నుంచి ప్రధాని మోదీ (PM Modi), కాంగ్రెస్ నుంచి రాహుల్ (Rahul Gandhi), ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) మరోసారి తెలంగాణాలో పర్యటించనున్నారు.
ALSO READ: ఒకే విడతలో రూ.10లక్షలు.. సీఎం కేసీఆర్ సంచలన హామీ
ప్రధాని మోదీ టీ-టూర్:
ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ మరోసారి తెలంగాణలో పర్యటించనున్నారు. మూడు రోజులపాటు తెలంగాణలో ఉండనున్నారు మోదీ. ఈ నెల 25, 26, 27 తేదీల్లో బీజేపీ నేతలు ఏర్పాటు చేసిన ఆరు బహిరంగ సభల్లో మోదీ పాల్గొననున్నారు. 26న అమిత్ షా తో కలిసి జనసేన అభ్యర్థికి మద్దతుగా హైదరాబాద్ సభలో పాల్గొంటారు మోదీ. అలాగే ఈ నెల 22న జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ వరంగల్ బహిరంగ సభలో పాల్గొననున్నారు.
రాహుల్, ప్రియాంక గాంధీ పర్యటన:
తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. తాజాగా కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మరోసారి తెలంగాణకు రానున్నారు. నవంబర్ 24, 25న రాహుల్, ప్రియాంక రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేయనున్నారు. పాలకుర్తి, హుస్నాబాద్, నిజామాబాద్ రూరల్‌లో ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. మెదక్, తాండూరు, జుక్కల్, ఖైరతాబాద్‌లో రాహుల్ గాంధీ ప్రచారం చేస్తారు.