Telangana Elections 2023: తెలంగాణలో ఎన్నికల టైం దగ్గర పడుతోంది. వరుస సభలతో గులాబీ బాస్ సీఎం కేసీఆర్ (CM KCR) ప్రచారంలో కారు గేర్ మార్చి స్పీడ్ పెంచారు. ఈ నేపథ్యంలో ఇవాళ సీఎం కేసీఆర్ కరీంనగర్ నియోజకవర్గంలో పర్యటించారు. బీఆర్ఎస్ ప్రజాశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సభలో కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) పార్టీలపై కేసీఆర్ విమర్శలు చేశారు. ఉన్న తెలంగాణను ఊడగొట్టి జబర్దస్తీగా కాంగ్రెస్ ఆంధ్రాలో కలిపిందని అన్నారు. 1969లో తెలంగాణ ఉద్యమం వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను పిట్టల లెక్క కాల్చి చంపింది. లక్షల మందిని జైల్లో పెట్టిందని మండిపడ్డారు.
ALSO READ: లక్ష సెల్ ఫోన్లు, ఓటుకు రూ.10 వేలు..
58 ఏళ్లు తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ఇబ్బంది పెట్టిందని సీఎం కేసీఆర్ అన్నారు. కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అన్నట్లు పోరాటం చేశానని పేర్కొన్నారు. తలసరి ఆదాయంలో దేశంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని అన్నారు. అలాగే తలసరి విద్యుత్ వినియోగంలో కూడా తెలంగాణ అగ్రస్థానంలో ఉందని హర్షం వ్యక్తం చేశారు.
ALSO READ: నన్ను సీఎం అనకండి ప్లీజ్.. బండి సంజయ్ రిక్వెస్ట్!
కంటి వెలుగు కార్యక్రమం వస్తుందని ఎవరైనా ఊహించారా? అని ప్రజలను సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా కంటి పరీక్షలు చేసి 80 లక్షల మందికి అద్దాలు పంపిణీ చేశామని పేర్కొన్నారు. సాగునీటిపై గతంలో పన్ను ఉండేది.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక రద్దు చేశామని వెల్లడించారు. ధరణి పోర్టల్ ద్వారా అద్భుత ఫలితాలు వచ్చాయి తెలిపారు. ధరణి ద్వారా దళారులు లేకుండా పోయారని కేసీఆర్ తెలిపారు. ధరణి ఉండటం వల్ల రైతులు గడపదాటకుండా ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని పేర్కొన్నారు. పంజాబ్‌ను అధిగమించి ధాన్యం ఉత్పత్తిలో తెంగాణ అగ్రస్థానంలో నిలిచిందని కేసీఆర్ తెలిపారు. ధరణి తీసేసి దందాలు చేయాలని కాంగ్రెస్ చూస్తోందని ఆరోపించారు. లోయర్ మానేరు డ్యామ్ గతంలో ఎలా ఉండేది?.. ఇప్పుడు ఎలా ఉందని కేసీఆర్ ప్రశ్నించారు. కరీంనగర్ లో బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ ను భారీ మెజారితో గెలిపించాలని సీఎం కేసీఆర్ కోరారు.