Trainee Doctor Rape, Murder Case: ఆర్జీకర్ ఆసుపత్రి ప్రవర్తన, ట్రైనీ డాక్టర్ చనిపోయినప్పుడు అక్కడి వారి స్పందన మొదటి నుంచీ అనుమానంగానే ఉన్నాయి. ప్రిన్సిపాల్ నుంచి ఆసుపత్రి సిబ్బంది వరకు అందరూ కలిసి కట్టుగా రేప, హత్యను పక్క దోవ పట్టించడానికి చూశారనే తెలుస్తోంది. దానికి తోడు తాజాగా బయటపడిన కాల్ రికార్డ్‌ను వాటిని మరింత బలపరుస్తున్నాయి. ట్రైనీ డాక్టర్ చనిపోయిందని చెప్పడానికి ఫోన్ చేసిన సిబ్బంది మూడు సార్లు మూడు రకాలుగా మాట్లాడారు. వాస్తవాలను దాచేందుకు ప్రయత్నించారు. తమ కుమార్తెకు ఏమైందని అడిగిన ప్రశ్నకు.. జ్వరం వచ్చిందని ఓసారి, ఆత్మహత్య చేసుకుందని మరోసారి.. ఇలా చెప్పారు. తీరా తల్లిదండ్రులు ఆసుపత్రికి వచ్చి చూసేసరికి ఆమె చనిపోయి కనిపించింది.
అసలు ట్రైనీ డాక్టర్ చనిపోయింది తెల్లవారుఝామున 3 నుంచి 4 గంటల మధ్య సమయంలో. కానీ ఆసుపత్రి సిబ్బంది ఆ విషయం ఆమె తల్లిదండ్రులకు ఉదయం 10.53 వరకు చెప్పలేదు. అప్పుడు కూడా మొదటి సారి ఫోన్ చేసినప్పుడు…మీ కూతురికి అస్వస్థతగా ఉంది ఒకసారి ఆసుపత్రికి రాగలరా అని అడిగారు. ఏమైందని అడగితే..ఇక్కడకు వస్తే తెలుస్తుంది అంటూ ఫోన్ పెట్టేశారు. ఇక రెండో సారి మరి కొన్ని నిమిషాల్లోనే కాల్ వచ్చింది. డాక్టర్ పరిస్థితి విషమంగా ఉందని…వెంటనే రండి..సాధ్యమైనంత తొందరగా రండి అని చెప్పారు. ఎవరు ఫోన్ చేస్తున్నారని అడ్గగా…ఆసుపత్రి సూపరెండెంట్ అని చెప్పి వెంటనే ఫోన్ పెట్టేశారు. మరి కొద్ది సేపట్లో మూడో కాల్ వచ్చింది. ఈసారి డాక్టర్ ఆత్మహత్య చేసుకుందని..పోలీసులు వచ్చారని..అందరం ఇక్కడే ఉన్నామని చెప్పారు. ఇలా మూడుసార్లు మూడు రకాల కాల్స్ రావడం మీద తల్లిదండ్రులు మొదట నుంచి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కాల్ రికార్డ్స్ బయటపడడంతో అవి మరింత బలపడుతున్నాయి.
తల్లిదండ్రులు ఆసుపత్రికి వచ్చాక కూడా వారి కూతురు మృతదేహాన్ని చూపించడానికి మూడు గంటలు తీసుకున్నారని తెలుస్తోంది. చివరకు తండ్రి గట్టిగా కేకలు వేయడంతో అప్పుడు చూపించారు. అప్పుడూ ప్రిన్సిపాల్ కూడా వచ్చాడు. కానీ వారితో ఏమీ మాట్లాడకుండానే వెళ్ళిపోయారు. అప్పుడు కూడా డాక్టర్ తల్లిదండ్రులకు ఏం జరిగిందో చెప్పనే లేదు. మృతదేహానికి వెంటవెంటనే పోస్ట్ మార్టమ్ చేయడానికి, దహనం చేయించడానికి తొందర పెట్టారు. ఈ కేసులో మొదటి నుంచి ఇప్పటివరకు ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూనే వస్తున్నారు. సీబీఐ దర్యాప్తులోనూ వారు అలాగే ప్రవర్తించినట్లు తెలుస్తోంది.