ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయిన అరవింద్ కేజ్రీవాల్ ఊచలు లెక్కపెట్టకతప్పడం లేదు. తన అరెస్ట్‌ను సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్లను ఢిల్లీ హైకోర్టుతో పాటూ సుప్రీంకోర్టు కూడా తిరస్కరించింది. ఈరోజు సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ తరుఫు న్యాయవాది అత్యవసర పిటిషిన్‌నే వేశారు. ఇందులో కేజ్రీవాల్ అరెస్ట్‌ను సవాల్ చేయడమే కాక ఆయనకు న్యాయసలహాలు తీసుకునే సమయం పెంచాలంటూ కోరారు. లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన తీహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్‌ను కలిసేందుకు ఆయన లాయర్‌కు వారానికి రెండు సార్లు ఛాన్స్ ఇస్తున్నారు. అయితే.. ముఖ్యమంత్రిగా విధులకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ఇది సరిపోవడం లేదని...అందుకే తనకు లాయర్ని కలిసేందుకు వారానికి ఐదుసార్లు ఛాన్స్ ఇవ్వాలని పిటిషన్లో కోరారు. కానీ దీన్ని సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. కోర్టు దానికి అనుమతి ఇవ్వలేదని తేల్చి చెప్పింది. ఇక అరెస్ట్‌ను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ గురించి తనకు మెయిల్ చేయాలని కేజ్రీవాల్ న్యాయవాదికి సీజేఐ చంద్రచూడ్ సూచించారు.
లిక్కర్ స్కాం కేసు(Liquor Scam Case) లో మార్చి 21వ తేదీన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసింది. మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్ అసలైన సూత్రధారని ఈడీ(ED) ఆరోపిస్తోంది. ఈడీ కస్టడీ తర్వాత కేజ్రీవాల్ కు రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 15వరకు ఆయన తీహార్ జైల్లో ఉండనున్నారు.
కేజ్రీవాల్ అరెస్టుకు ఈడీ వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్ పిటిషన్‌ను కొట్టేసింది. హవాలా ద్వారా డబ్బు తరలింపుపై ఈడీ ఆధారాలు చూపించిందని, గోవా ఎన్నికలకు డబ్బు ఇచ్చినట్లు అప్రూవర్ హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. కేజ్రీవాల్ అరెస్టు, రిమాండ్ చట్టవిరుద్ధం కాదని అభిప్రాయం వ్యక్తం చేసింది. సీఎం అయినా, సామాన్యుడు అయినా న్యాయవిచారణ ఒకేలా జరుగుతుందని…దాన్ని విచారించాలో కోర్టును అతనేమీ చెప్పనక్కర్లేదని కోర్టు వ్యాఖ్యలు చేసింది. నిందితుడి వీలును బట్టి విచారణ జరపడం సాధ్యం కాదు అని కోర్టు వ్యాఖ్యానించింది.