2023లో ప్రతిపక్షాలకు సినిమా చూపిస్తామని మంత్రి కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వం ఇటీవల నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్‌ను మంత్రి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. 450 కోట్ల వ్యయంతో 2.65 కిలోమీటర్ల పొడవైన స్టీల్ బ్రిడ్జిని నిర్మించామన్నారు. ఈ ఉక్కు వంతెనకు మాజీ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి పేరు పెట్టినట్లు తెలిపారు. ప్రభుత్వం నగరంలో సిగ్నల్ రహిత ప్రయాణమే లక్ష్యంగా చేపట్టిన 45 ప్రాజెక్టుల్లో ఇది ఒకటన్నారు. హైదరాబాద్‌లో తొలిసారి భూసేకరణ చేపట్టకుండా నిర్మించిన బ్రిడ్జి ఇదే కావడం గమనార్హం. ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో రూ.5112.36 కోట్ల అంచనా వ్యయంతో 48 ప్రాజెక్టులను చేపట్టింది. ఇందులో ఇప్పటి వరకు 35 ప్రాజెక్టులను పూర్తిచేసి నగరవాసులకు అందుబాటులోకి తీసుకు వచ్చింది. వీటిలో 19 ఫ్లై ఓవర్లు, 5 అండర్ పాస్‌లు, 7 ఆర్వోబీ/ఆర్‌యూబీలు, కేబుల్ బ్రిడ్జి, మరో 3 ఇతర పనులను ప్రభుత్వం పూర్తిచేసింది.
కాగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి హోంశాఖ మంత్రిగా పనిచేసిన కీర్తిశేషులు నాయిని నరసింహారెడ్డి పేరును (Naini Narasimha Reddy Flyover) ఈ స్టీల్ బ్రిడ్జి ఫ్లైఓవర్‌కి పెట్టారు. సీఎం కేసీఆర్ (CM Kcr) ఆదేశాల మేరకు ఈ స్టీల్ బ్రిడ్జ్‌కి నాయినిపేరు పెడుతున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ముషీరాబాద్‌లో సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో, జీఎస్టీ కార్మిక సంఘం నాయకుడిగా నాయిని చేసిన సేవలకు గుర్తుగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని కేటీఆర్ (KTR) వెల్లడించారు.
సుదీర్ఘ కాలం పాటు ముషీరాబాద్ కేంద్రంగా రాజకీయాల్లో పాల్గొని తెలంగాణ ఉద్యమానికి అనేక సేవలందించిన నాయిని నర్సింహారెడ్డి, అక్కడే ఉన్న వీఎస్టీ ఫ్యాక్టరీ కార్మికుల యూనియన్ నాయకుడిగా దశాబ్దాల పాటు పనిచేశారు. ఈ నేపథ్యంలో ఈ రెండు ప్రాంతాల్లో నాయిని సేవలను దృష్టిలో ఉంచుకొని నాయిని నరసింహారెడ్డి పేరును ఈ స్టీల్ బ్రిడ్జికి పేరు పెట్టేందుకు ప్రభుత్వ నిర్ణయం తీసుకుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. మరోవైపు ఈ బ్రిడ్జి అందుబాటులోకి రావడం ద్వారా దశాబ్దాల తరబడి ఆర్టీసీ ఎక్స్‌రోడ్డు, అశోక్‌నగర్, వీఎస్టీ జంక్షన్లలో ఉన్న ట్రాఫిక్ రద్దీ సమస్యకు చెక్ పడినట్లైంది.
నగరంలో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి విపక్షనేతలకు కన్పించడంలేదా అని కేటీఆర్ ప్రశ్నించారు. అభివృద్ధి గురించి మాట్లాడని కాంగ్రెస్, బీజేపీ నేతలు.. ప్రభుత్వంపై బురద చల్లాలని చూస్తున్నారని మండిపడ్డారు. నోటికొచ్చిన మాటలు మాట్లాడితే వారి తోకలు కత్తిరిస్తామని కేటీఆర్ హెచ్చరించారు. 2014వ సంవత్సరానికి ముందున్న హైదరాబాద్‌ను ..ప్రస్తుతమున్న హైదరాబాద్‌ను చూడాలని మంత్రి సూచించారు.