BCCI: నితీష్‌కు ఫ్రీ ఫుడ్, బట్టలు, వసతి కల్పించండి: తండ్రి విజ్ఞప్తి!

ఆస్ట్రేలియాలో అదరగొడుతున్న నితీష్ గురించి ఓ ఆసక్తికర విషయం బయటపెట్టారు మాజీ ఛీప్ సెలెక్టర్ MSK ప్రసాద్‌. అండర్-14 అకాడమీలో నితీష్‌కు ఫ్రీ ఫుడ్, బట్టలు, వసతి కల్పించాలని తన తండ్రి అడిగాడని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ కుర్రాడిని చూస్తుంటే గర్వంగా ఉందన్నారు. 

author-image
By srinivas
New Update
nitish kumar

nitish kumar Photograph: (nitish kumar)

BCCI: ఆస్ట్రేలియాపై బాక్సింగ్ డే టెస్టులో తన తొలి అంతర్జాతీయ సెంచరీని సాధించిన నితీష్ కుమార్ రెడ్డి ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. ఈ 21 ఏళ్ల తెలుగు కుర్రాడు కష్టా్ల్లో ఉన్న భారత్‌ను ఒంటిచేత్తో గట్టెక్కించి ఔరా అనిపించాడు. వరల్డ్ వైడ్ క్రికెట్ లవర్స్ నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ సందర్భంగా నితీష్ కుమార్ గురించి బీసీసీఐ మాజీ ఛీప్ సెలక్టర్ MSK ప్రసాద్‌ ఆసక్తికర విషయం బయటపెట్టారు. పదేళ్ల క్రితం నితీష్ ఆటతీరును చూసి ఫిదా అయ్యానని, ఇవాళ చేసిన సెంచరీ తన జీవితంలో మరిచిపోలేనంటూ ఆకాశానికెత్తేశాడు. అంతేకాదు తన తండ్రి నితీష్ కు ఉచిత భోజనం, బట్టలు, వసతి కల్పించాలంటూ తమను వేడుకున్న రోజులను గుర్తు చేస్తూ భావోద్వేగానికి లోనయ్యాడు. 

10 సంవత్సరాల క్రితం..

అయితే నితీష్ ప్రతిభ వెనక కన్నీటి కష్టాలున్నాయని చెప్పాడు ఎంఎస్ కే ప్రసాద్.. '10 సంవత్సరాల క్రితం నేను ఆంధ్రా క్రికెట్‌కు డైరెక్టర్‌గా ఉన్నప్పుడు 2013-14లో రెసిడెన్షియల్ అకాడమీలను ప్రారంభించాం. అందులో నితీష్ ఆటతీరు చూసి అండర్-14 అకాడమీకి ఎంపికచేశాం. ఆ సమయంలోనే నితీష్ తండ్రి ముత్యాల రెడ్డి నా దగ్గరకు వచ్చి.. తన జీవితంలో క్లిష్టమైన సమయాన్ని అనుభవిస్తున్నానని చెప్పాడు. తనకు ఖర్చుపెట్టే స్తోమత లేదన్నాడు. ఉచిత భోజనం, బట్టలు, వసతి కల్పించాలని రిక్వెస్ట్ చేశాడు. అంతేకాదు తన కొడుకు గొప్పగా ఆడగలడని నమ్మకంగా చెప్పాడు. అతనికి నేను కొన్ని బంతులు విసిరి చూశాను. బ్యాటింగ్ శైలినచ్చి ఆ పిల్లవాడిని అండర్-14 అకాడెమీలో కొనసాగించాం. 21 నాటికి అతను భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడమే కాదు ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీ సాధించడం మనం ఇప్పుడు చూస్తున్నాం. భవిష్యత్తులోనూ రాణించగలడు. నాకు చాలా గర్వంగా ఉంది' అంటూ చెప్పుకొచ్చాడు. 

నా దగ్గర మాటలు లేవు..

ఈ మేరకు 'నా ఆనందాన్ని వ్యక్తపరచడానికి నా దగ్గర మాటలు లేవు. నలుగురు నాణ్యమైన బౌలర్లపై టెస్టు సెంచరీ సాధించడం నమ్మశక్యం కాదు. అతను ఎలివేట్ చేసిన తీరు అద్భుతం. ఈ సిరీస్‌లోకి రాకముందు అతను కొన్ని ఫస్ట్-క్లాస్ మ్యాచ్ లు ఆడాడు. కానీ అతని గత గణాంకాలతో పోలిస్తే పనితీరును చాలా మెరుగుపరుచుకున్నాడు. అతను ఈ సందర్భానికి తగ్గట్టుగా అడుగులు వేశాడని నేను అనుకుంటున్నాను. చాలా మంది ఆటగాళ్ళు దేశవాళీ క్రికెట్‌లో చాలా బాగా రాణించారు. కానీ అంతర్జాతీయ స్థాయిలో రాణించలేకపోయారు. కానీ నితీష్‌ అదరగొడుతున్నాడు'అంటూ పొగిడేశాడు. 

Advertisment
తాజా కథనాలు