Ind vs Aus: బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో అదరగొడుతున్న తెలుగు కుర్రాడు నితీశ్‌కుమార్ రెడ్డిపై మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మొదటి సిరీస్‌లోనే చక్కటి బ్యాటింగ్ శైలితో అందరి మనసులు గెలుచుకున్నాడని పొగిడేస్తున్నారు. ఆడిన నాలుగు టెస్టుల్లోనూ అనవసరంగా వికెట్ పారేసుకోలేదని, బౌలింగ్ లోనూ తన సత్తా చాటుతున్నాడంటూ ఆస్ట్రేలియా క్రికెటర్లు సైతం ఫిదా అవుతున్నారు. మెల్ బోర్న్ స్టేడియంలో సెంచరీ చేసి ఔరా అనిపించిన నితీష్ పేరు ఆ స్టేడియం బోర్డులో ఎక్కడంతో అతని సత్తా ఏంటో తెలిసిపోతుందంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆసీస్ మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్స్ సైతం నితీష్ ను ఆకాశానికెత్తేశాడు.
నిజంగా నితీశ్ జీనియస్..
ఈ మేరకు మైఖేల్ క్లార్క్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. యువ ఆటగాడు నితీష్ క్లిష్ట సమయాల్లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతూ జట్టుకు ఆపద్బాంధవుడిలా మారుతున్నాడని చెప్పారు. మెల్‌బోర్న్ లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 114 విలువైన పరుగులు చేశాడన్నారు. 'నిజంగా నితీశ్ జీనియస్. ఆస్ట్రేలియా బౌలర్లకు భయపడట్లేదు. ఒకరకంగా ఆసీస్ బౌలర్లే అతన్ని కాన్ఫిడెన్స్ చూసి ఎలాంటి బంతులేయాలో అర్థంకాక తలపట్టుకుంటున్నారు. అంచనాల్లేకుండా బరిలోకి దిగి అదరగొడుతున్నాడు. 21 ఏళ్లకే భారత మెయిన్ బ్యాటర్‌లా మారిపోయాడు. ఓపికగా ఓర్పును ప్రదర్శిస్తున్నాడు. టెయిలెండర్లతో కలిసి బ్యాటింగ్ చేస్తున్నాడు. బౌలింగ్‌తోపాటు ఫీల్డింగ్ చేస్తున్నాడు. ఆరో స్థానంలో వస్తే బాగుటుంది' అంటూ క్లార్క్ చెప్పుకొచ్చాడు. ఇక బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో ఆసీస్ 2-1తో ఆధిక్యంలో నిలిచింది. జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా చివరి 5వ టెస్టు మొదలుకానుంది.
ఇది కూడా చదవండి: BCCI: చివరి టెస్టు నుంచి రోహిత్ ఔట్.. కోహ్లీకే మళ్లీ కెప్టెన్సీ!
రోహిత్ శర్మ రిటైర్మెంట్..
మరోవైపు.. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఊహగానాలు ఊపందుకుంటున్నాయి. వరుసగా విఫలమవుతున్న హిట్ మ్యాన్‌కు ఆస్ట్రేలియాతో సిరీస్ లాస్ట్ అనే బలమైన వాదనలు వినిపిస్తున్నాయి. బోర్డర్-గావస్కర్ ట్రోఫీ ముగియగానే వీడ్కోలు పలకబోతున్నాడంటూ కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో అంశం తెరపైకొచ్చింది. మొదటి టెస్టుకు సారథ్య బాధ్యతలు వహించిన బుమ్రాకు కాకుండా మళ్లీ విరాట్ కోహ్లీకే టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చేందుకు బీసీసీఐ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: పడకగదిలో ఇలాంటి పనులు చేయకండి.. దగ్గరకి కూడా రానివ్వరు!