ఫస్ట్ నుంచి చాలా బాగా ఆడుతుంది. కానీ టోర్నీ చివరలో బొక్క బోర్లో పడుతుంది. ఇదీ సౌత్ ఆఫ్రికా బ్యాడ్ లక్ చరిత్ర. ఓ సెమీస్‌లో లాన్స్ క్లుసెనర్ చివరి బంతికి రనౌట్ కావడం... మరో సెమీస్‌లో ఏబీ డివిలియర్స్ పరాజయంతో కంటతడి పెట్టుకున్న క్షణాలను ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. వీటిని మరిపించే అవకాశం ఆ టీమ్ ముందుకు మరోసారి వచ్చింది. ఈరోజు ఆస్ట్రేలియాతో జరిగే సెమీస్ లో దక్షిణాఫ్రికా తనను తాను నిరూపించుకునేందుకు సిద్ధమైంది. అయితే అవతల ఉన్నది ఆస్ట్రేలియా...మొదట్లో కాస్త తడబడినా..ప్రస్తుతం చాలా స్ట్రాంగ్ గా ఉంది. కాబట్టి ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు హోరాహోరీగా తలపడడం ఖాయమని అభిమానులు అంటున్నారు.
Also Read:ఏడు నెలల చిన్నారికి లివర్ ఆపరేషన్..హైదరాబాద్ వైద్యుల ఘనత
ఇప్పటివరకు వన్డే ప్రపంచకప్ 12 సార్లు జరగగా అందులో అయిదు సార్లు ఆస్ట్రేలియా కప్ పట్టుకెళ్ళిపోయింది. ఇప్పుడు ఆరోసారి ఈ అవకాశాన్ని ఆస్ట్రేలియా టీమ్ వదులుకోరు. రికార్డ్ లను వద్దని ఎవరు అనుకుంటారు. పైగా గత ఆరు ప్రపంచకప్‌లలోనే నాలుగుసార్లు గెలిచిన చరిత్ర వాళ్ళది. మరోవైపు గత తొమ్మిది ప్రపంచకప్‌లలో నాలుగు సార్లు సెమీస్ చేరినా నాలుగుసార్లు పరాజయం పాలైన చరిత్ర దక్షిణాఫ్రికాది. ఇప్పుడు రెండూ తలపడుతున్నాయి. ఎవరు గెలుస్తారు అనేది చెప్పడం కూడా కష్టమే.
గత చరిత్రను ఈ ప్రపంచకప్‌లో అధిగమిస్తామని దక్షిణాఫ్రికా కెప్టెన్ బావుమా ధీమాగా చెప్పాడు. ఈసారి సెమీఫైనల్ అడ్డంకిని అధిగమించేందుకు సిద్ధంగా ఉన్నామని బవూమా తెలిపాడు. దక్షిణాఫ్రికా బ్యాటింగ్ విభాగం బలంగా ఉంది. డికాక్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. డికాక్ 591 పరుగులతో ఈ టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. అంతేకాదు ఈ వరల్డ్కప్ లో టాప్ సిక్స్ బ్యాటర్లలో నలుగురు సెంచరీలు సాధించారు. డస్సెన్, హెన్రిచ్ క్లాసెన్, మార్‌క్రమ్, అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శిస్తున్నారు. డేవిడ్ మిల్లర్ కూడా రాణిస్తే ఆస్ట్రేలియాపై విజయం సాధించడం అంత కష్టమేమీ కాదు.
ఇటు ఆస్ట్రేలియా కూడా ఫైనల్ చేరాలని గట్టి పట్టుదలతో ఉంది. ఆఫ్ఘనిస్తాన్‌పై 91/7 నుంచి కోలుకుని గ్లెన్ మాక్స్‌వెల్ 201 పరుగులతో చేసిన విధ్వంసంతో ఘన విజయం సాధించిన ఆసిస్ పూర్తి ఆత్మ విశ్వాసంతో ఉంది. పాకిస్తాన్, నెదర్లాండ్స్‌పై వరుసగా సెంచరీలు కొట్టి డేవిడ్ వార్నర్ ఫామ్‌లో ఉన్నాడు. ట్రావిస్ హెడ్... న్యూజిలాండ్‌పై 109 పరుగులు చేసి మంచి టచ్‌లో ఉన్నాడు. మిచెల్ మార్ష్, మాక్స్‌వెల్ విధ్వంసకరంగా బ్యాటింగ్ చేయగలరు.
దక్షిణాఫ్రికా జట్టు:
క్వింటన్ డికాక్(వికెట్‌కీపర్), టెంబా బవుమా(కెప్టెన్), రాస్సీ వాన్ డర్ డస్సెన్, ఎయిడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జన్సెన్, కేశవ్ మహరాజ్, గెరాల్డ్ కొయెట్జీ, కగిసో రబడ, తబ్రేజ్ షంషి
ఆస్ట్రేలియా జట్టు..
ట్రవిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లబూషేన్, గ్లెన్ మాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్(వికెట్‌కీపర్), పాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్