హమాస్ ఉగ్రవాదుల స్థావరాలను అంతం చేయడమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ తమ పోరు కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటికీ ఈ దాడుల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ అంశంపై అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సంచనల వ్యాఖ్యలు చేశారు. గాజాపై ఇజ్రాయెల్ తీసుకుంటున్న చర్యలు.. చివరకి ఆ దేశానికి బెడిసి కొట్టే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. ప్రస్తుతం గాజాను దిగ్బంధించి.. అక్కడ ఆహారం, నీటి సరఫరా నిలిపివేత వంటి ఆంక్షలతో.. ఇజ్రాయెల్‌పై పాలస్తీనియన్లలో మరింత ఆగ్రహం పెరిగే అవకాశాలున్నాయని అన్నారు. అలాగే ఈ చర్యలు ఇజ్రాయెల్‌కు అంతర్జాతీయ మద్దతును కూడా బలహీనపరుస్తాయని చెప్పారు. ఓవైపు హమాస్ దాడులను ఖండిస్తూనే.. మరోవైపు యుద్ధంలో ప్రాణనష్టాన్ని పట్టించుకొకపోవడంతో.. చివరికి ఇజ్రాయెల్‌కే ఎదురుతగిలే ప్రమాదం ఉందంటూ ఒబామా పేర్కొన్నారు. హమాస్ దాడులను ఖండిస్తూనే తనను రక్షించుకునే విషయంలో ఇజ్రాయెల్‌కు తన మద్దతును పునరుద్ఘాటించారు ఒబామా.
ఇదిలా ఉండగా.. ఒబామా అమెరికా అధ్యక్షునిగా ఉన్నప్పుడు కూడా హమాస్- ఇజ్రాయెల్ మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఆ సమయంలో ఇజ్రాయెల్ ఆత్మరక్షణ హక్కుకు ఒబామా పూర్తిగా మద్దతు తెలిపారు. అయితే, వైమానిక దాడుల కారణంగా పాలస్తీనీయుల ప్రాణనష్టం పెరగడం వల్ల.. సంయమనం పాటించాలని ఇజ్రాయెల్‌కు సూచనలు చేశారు. ఇరు వర్గాల మధ్య శాంతి ఒప్పందాన్ని నెలకొల్పేందుకు మధ్యవర్తిత్వానికి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా.. ఒబామా యంత్రాంగం ఈ అంశంలో విఫలమైంది. మరో విషయం ఏంటంటే ఒబామా అధికారంలో ఉన్నప్పుడు ఇరాన్‌తో అణు ఒప్పందంపై చర్చలు జరపడం.. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో సంబంధాలపై ప్రతికూలంగా ప్రభావం పడింది. ఆ సమయంలో అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్న జో బైడెన్ ఇద్దరి మధ్య మధ్యవర్తిగా వ్యవహరించారు.