Revanth Reddy About SC Classification: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. రెండు వర్గాల్లో ఉన్న జనాభా దామాషా ప్రకారం విభజన చేస్తామన్నారు. కేసీఆర్‌కు (CM KCR) ఎస్సీ వర్గీకరణపై కేంద్రంతో కొట్లాడే ధైర్యం లేదని మండిపడ్డారు. ఎప్పటికైనా ఎస్సీ వర్గీకరణ చేసేది కాంగ్రెస్ ప్రభుత్వమే (Congress Govt) అన్నారు. ఏ ఒక్కరి కోసమో వర్గీకరణ చేయడం లేదన్న ఆయన.. రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ప్రజల కోసం చేస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ పట్ల కాంగ్రెస్ చిత్త శుద్ధితో ఉందని, ఎవరూ చింతించాల్సిన అవసరంలేదన్న ఆయన.. ఒకరికి మద్దుతు ఇచ్చి ఇంకొకరిని ప్రశ్నించడం సరికాదన్నారు.గతంలోనే ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని రాహుల్ గాంధీ (Rahul Gandhi) చెప్పారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. , రిజర్వేషన్ సీట్లలో కాకుండా జనరల్ సీట్లలో దళిత గిరిజనులకు అవసరాన్ని బట్టి సీట్లు కూడా ఇస్తామని రేవంత్ రెడ్డి వివరించారు.
"ఎస్సీ వర్గీకరణ పంచుతాం.. పంచాయతీ తెంచుతాం" అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామన్నారు. మరోవైపు మందకృష్ణ మాదిగపై ఆగ్రహం వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి.. మందకృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణపై బీజేపీని ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. అంతే కాకుండా ఆయన బీజేపీకి మద్దతు తెలిపారని గుర్తు చేశారు. కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎస్సీ వర్గీకరణపై ఎందుకు స్పందించడం లేదన్నారు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మొదటి టర్మ్‌లోనే కేంద్ర మంత్రిగా ఉన్న వెంకయ్య నాయుడు ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామి ఇచ్చారన్న రేవంత్ రెడ్డి.. కేంద్ర ప్రభుత్వం వాటి గురించి ఎందుకు పట్టించుకోవడంలేదో అర్థం కావడం లేదన్నారు.
కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో వివిధ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సైతం కర్ణాటక వ్యూహాన్నే తెలంగాణలో అమలు చేస్తారని గతంలో చాలా మంది అన్నారని రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలిపారు. కానీ తాము కర్ణాటక ఫార్ములాను తెలంగాణలో అమలు చేయమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎక్కడి ఫార్ములా అక్కడే ఉంటుందని వెల్లడించారు. కాగా ఇటీవల వైఎస్ షర్మిల వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారనే చర్చ జరగ్గా.. దీని గురించి కాంగ్రెస్ పార్టీ సినీయర్ నేత ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఢిల్లీకి వెళ్లకుండా బెంగళూరుకు వెళ్లారు. అక్కడ డీకే శివకుమార్‌తో చర్చలు జరిపారు. అంతే కాకుండా బెంగళూరు వేదికగానే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాజకీయం అమలవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.
Also Read: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై షర్మిల ఫైర్!