Revisiting How Donald Trump Helped ISCON Devotees : అమెరికా (America) మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) పై శనివారం కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో భాగంగా పెన్సీల్వేనియాలో నిర్వహించి ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదికపై ప్రసంగిస్తుండగా.. ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ట్రంప్ చెవికి గాయమైంది. అనంతరం ట్రంప్‌ను సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు. కాల్పులు జరిపిన నిందితుడిని భద్రతా సిబ్బంది హతమార్చారు. ర్యాలీకి హాజరైన ట్రంప్ మద్దతుదారుడు ఒకరు ఈ దాడిలో మృతి చెందాడు. ప్రస్తుతం ట్రంప్ క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఇది 48 ఏళ్ల క్రితం జరిగిన ఓ సంఘటనను గుర్తుచేస్తోంది. 1976 జులైలో.. న్యూయార్క్ నగరంలో మొదటిసారిగా పూరీ జగన్నాథుడి యాత్రను నిర్వహించేందుకు ఇంటర్నేషనల్ సోసైటీ ఫర్ కృష్ణ కాన్సియస్‌నెస్ (ISKCON) కు ట్రంప్ సాయం చేశారు. ఇప్పుడు ఇదే సమయంలో ట్రంప్ తనపై జరిగిన దాడుల నుంచి త్రుటిలో తప్పించుకోవడంతో ఆ జగన్నాథుడే కాపాడాడని ఇస్కాన్ వైస్ ప్రెసిడెంట్ రాధారామ్ దాస్ ఎక్స్ వేదికగా తెలియజేశారు.
Also read: భూమి కింద మహా సముద్రాన్ని కనుగొన్నశాస్త్రవేత్తలు!
ఇక వివరాల్లోకి వెళ్తే.. 1976లో జులైలో ఇస్కాన్ సంస్థ న్యూయర్క్ (New York) లో మొదటిసారిగా జగన్నాథుడి రథయాత్రను నిర్వహించాలని నిర్ణయించుకుంది. అయితే భారీ రథాన్ని తయారుచేసేందుకు.. ఈ యాత్రను నిర్వహించేందుకు సరైన ప్రదేశం కూడా దొరకడం కష్టంగా మారింది. ఇస్కాన్ భక్తులు ఈ సమస్యను పరిష్కరించేందుకు చాలామందిని సాయం కోరారు. కానీ ఎవరూ ముందుకు రాలేదు. చివరికి న్యూయార్క్‌లోని 5వ అవెన్యూలో రథయాత్ర నిర్వహించేందుకు ఇస్కాన్‌కు అనుమతి లభించింది. అయితే ఊరేగింపును ప్రారంభించే దారిలో రథచక్రాలను తయారు చేసేందుకు అక్కడ ఖాళీ స్థలం కావాల్సి వచ్చింది. కానీ ఇన్సూరెన్స్, లాజిస్టిక్ రిస్కుల వల్ల ఆ ప్రదేశానికి సంబంధించిన యజమానుల నుంచి వ్యతిరేకత వచ్చింది.
ఇలాంటి పరిస్థితుల్లో.. అప్పుడే రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోతున్న ట్రంప్.. ఓల్డ్ పెన్సిల్వేనియా రెయిల్ యార్డ్ కొన్నట్లు ఇస్కాన్ భక్తులకు తెలిసింది. ఇక్కడ రథయాత్ర చక్రాలు తయారుచేసేందుకు ట్రంప్‌ను పర్మిషన్ అడిగాలని అనుకున్నారు. దీంతో ఒక బుట్టలో మహాప్రసాదం తీసుకొని ఆయనను కలిసేందుకు వచ్చారు. ఓ లెటర్‌ను కూడా ఇచ్చారు. ట్రంప్ సెక్రటరీ ముందుగా వాళ్లకి వార్నింగ్ ఇచ్చారు. అయితే మూడు రోజుల తర్వాత ఆ భక్తులకు ట్రంప్ సెక్రటరీ నుంచి కాల్ వచ్చింది. ఆయన మాట్లాడుతూ.. ' అసలు ఏం జరిగిందో తెలియదు. కానీ ట్రంప్ మీ ఉత్తరాన్ని చదివారు, మీరిచ్చిన ప్రసాదం తీసుకున్నారు. ఆ తర్వాత మీరు చెప్పిన దానికి ఒప్పుకున్నారు' అని తెలిపారు.
ట్రంప్ పేపర్లపై సంతకం పెట్టి.. రథయాత్ర చక్రాలు తయారు చేసేందుకు రెయిల్ యార్డ్‌ను వాడుకునేందుకు పర్మిషన్ ఇచ్చారు. ఆ సమయంలో ట్రంప్ చూపిన ఉదార స్వభావాన్నే ఇప్పుడు ఇస్కాన్ భక్తులకు గుర్తు చేసుకుంటున్నారు. ఆదివారం ప్రపంచవ్యాప్తంగా పూరి జగన్నాథుని 9వ రోజు వేడుకలు జరుగుతున్నాయి. ఈ సమయంలోనే పెన్సిల్వేనియాలో ట్రంప్‌పై దాడి జరిగింది. అయితే 1976 జులైలో పెన్సీల్వేనియాలో జగన్నాథుని రథయాత్ర కోసం ట్రంప్ సాయం చేయడం వల్లే.. ఇప్పుడు అదే ప్రదేశంలో ఆయని దాడి జరిగింది. అయితే ఆ దేవుని అనుగ్రహంతోనే ట్రంప్ సురక్షితంగా బయటపడ్డారని ఇస్కాన్ భక్తులు చెప్పుకుంటున్నారు.