Andhra Pradesh: అమరావతికి రూ.15,000 కోట్లు.. కేంద్రానికి ఆర్థిక మంత్రి పయ్యావుల రిక్వెస్ట్

విభజన వల్ల వచ్చిన ఆర్థిక సవాళ్లను అధిగమించడానికి,గడిచిన 5 ఏళ్లలో ఆర్ధిక పరమైన తప్పులను సరిదిద్దాడానికి కేంద్ర సహకారం ఇవ్వాలని ఏపీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు.ఢిల్లీలో జరిగిన ప్రీ బడ్జెట్‌, జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశాల్లో మంత్రి పాల్గొన్నారు.

New Update
Andhra Pradesh: అమరావతికి రూ.15,000 కోట్లు.. కేంద్రానికి ఆర్థిక మంత్రి పయ్యావుల రిక్వెస్ట్

Minister Payyavula Kesav: 2024 -2025 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌పై వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రుల నుంచి సలహాలు, సూచనల స్వీకరణకు ప్రీ-బడ్జెట్ సమావేశం నిర్వహించారని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పునర్నిర్మాణానికి రాష్ట్రాభివృద్ధి సహాయం (స్టేట్ డెవలప్‌మెంట్ అసిస్టెన్స్) కోరామని చెప్పారు మంత్రి పయ్యావుల కేశవ్. అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా పునర్నిర్మించి, పునరుజ్జీవింపజేసే బృహత్‌ లక్ష్య సాధనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, వచ్చే కేంద్ర బడ్జెట్‌లో రూ. 15,000 కోట్లును అందుకు కేటాయించాల్సిందిగా కోరడం జరిగిందన్నారు.

రాష్ట్ర వ్యవసాయార్థిక జీవనాడి పోలవరం జాతీయ బహుళార్థసాధక ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేసేందుకు సహాయ సహకారాలు అందించాల్సిందిగా కోరామన్నారు. వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం జిల్లాల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమంలో (స్పెషల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్) భాగంగా నిధులు కేటాయించాలని అడిగామని తెలిపారు. రాష్ట్రంలో పారిశ్రామిక కారిడార్లు, పార్క్‌లకు ముఖ్యంగా 2 నోడ్‌లు విశాఖ-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ లకు నిధులు కేటాయించాలని వివరించామన్నారు. మెగా టెక్స్‌టైల్‌ పార్క్, ఇంటిగ్రేటెడ్ అక్వా పార్క్‌లకు నిధులు, రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని కోరామని పేర్కొన్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కేంద్రం చేయూత అత్యవసరమనే విషయాన్ని వివరించామని తెలియజేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సుస్థిర, సుధృడ నాయకత్వంలో రాష్ట్ర పునర్నిర్మాణం, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని వ్యాఖ్యానించారు. 2047 కల్లా వికసిత్ భారత్ సాధనలో త్వరితగతిన దేశ ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ మార్క్‌ను చేరడంలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించబోతోందని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని అంచనా వేయడానికి సమయం పడుతుందన్నారు. ప్రజలు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి తెలుసుకోవడానికి ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఇచ్చిన హామీలు అన్ని అమలు చేస్తామని... అందులో ఎలాంటి అనుమానం అవసరం లేదని పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.

Also Read:Hyderabad: ప్రేమ జంటలే టార్గెట్‌..రెచ్చిపోతున్న పోకీరీలు

Advertisment
తాజా కథనాలు