Russia-Ukraine War: ఇటీవల ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతంలో రష్యా సైనిక రవాణా విమానం కూలిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనపై తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ (Russia President Vladimir Putin) స్పందించారు. సైనిక రవాణా విమానాన్ని ఉక్రెయిన్ బలగాలే కూల్చివేశారన్నారు. 'వాళ్లు పొరపాటున చేశారా లేదా ఉద్దేశపూర్వకంగానే విమానాన్ని కూల్చేశారా అనే విషయం నాకు తెలియదు. కానీ ఉక్రెయిన్ బలగాల చేతిలో ఆ విమానం కూలింది. ఇది నేరం అంటూ' పుతిన్ తొలిసారిగా ఓ టీవీ ప్రసంగంలో అన్నారు.
Also Read: రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్.. యువతులకు ఫ్రీగా స్కూటీస్..!
74 మంది మృతి
ఉక్రెయిన్ సరిహద్దులో బెల్గోరాడ్ ప్రాంతం మీదుగా వెళ్తున్న రష్యా సైనిక రవాణా విమానం కూలింది. ఈ దుర్ఘటనలో మొత్తం 74 మంది మృతి చెందారు. ఇందులో 65 మంది ఉక్రెయిన్ (Ukraine) యుద్ధ ఖైదీలు, ఆరుగురు విమాన సిబ్బంది, ముగ్గురు సహాయకులు ఉన్నారు. ఉక్రెయిన్‌కు సమీపంలో బెల్గోరాడ్‌లో ఈ ఘటన జరిగిందని.. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఉక్రెయిన్ బలగాలే ఈ ప్రమాదానికి కారణం అంటూ ఆరోపణలు చేసింది.
మా బాధ్యత కాదు
యుద్ధ ఖైదీలతో ఉన్న విమానం బెల్గోరాడ్ ప్రాంతం మీదుగా వస్తోందని ముందుగానే ఉక్రెయిన్‌కు చెప్పామని రష్యా చెప్పినట్లు తెలిపింది. అయితే ఆ మాటల్ని ఉక్రెయిన్ ఖండించింది. యుద్ధ ఖైదీల భద్రత రష్యాదేనని.. వాళ్లని విమానంలో తరలించే సమయంలో బెల్గోరాడ్ గగనతలంలో ఎలాంటి దాడులకు దిగొద్దని రష్యా (Russia) తమను కోరలేదని చెప్పింది. ఈ ప్రమాదానికి తమ బాధ్యత లేదంటూ ఉక్రెయిన్ పేర్కొంది.
Also Read: మూడో ప్రపంచ యుద్ధంపై హెచ్చరించిన చాట్ జీపీటీ..