ప్రముఖ రాజకీయ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ త్వరలోనే జన్ సురాజ్ అభియాన్‌ను రాజకీయ పార్టీగా మార్చనున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 2న జన్ సురాజ్‌ను పార్టీగా మారుస్తామని ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే ప్రకటన చేశారు. దీనికి సంబంధించిన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. అయితే తాజాగా పీకే సంచలన ప్రకటన చేశారు. 2025లో జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 243 స్థానాల్లో జన్ సరాజ్ పోటీ చేస్తోందని వెల్లడించారు. ఇందులో కనీసం 40 మంది మహిళా అభ్యర్థులే ఉంటారని పేర్కొన్నారు. ఇక 2030లో కనీసం 70 నుంచి 80 మంది మహిళా అభ్యర్థులను ఎన్నికల బరిలోకి దింపుతామని స్పష్టం చేశారు.
Also Read: మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడేవారిని వదిలిపెట్టం: మోదీ
మహిళలు ఆర్థికంగా స్వతంత్రులు అయ్యేవరకు సమానత్వాన్ని పొందలేరని వ్యాఖ్యానించారు. అలాగే మహిళలు తమ జీవనోపాధి కోసం 4 శాతం రుణం పొందాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం కూడా గ్యారెంటీ ఇవ్వాలన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక బీహార్ ప్రజలు.. తక్కువ జీతం కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. ఈసారి ఎన్నికల్లో ప్రజలు నాయకులు కొడుకులు, కూతుర్లను చూసి కాకుండా.. మీ కొడుకులు, కూతుర్లను చూసి ఓటు వేయాలని కోరుతున్నానని ప్రశాంత్ కిషోర్ అన్నారు.
ఇదిలాఉండగా.. ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహకర్తగా తనకంటూ దేశవ్యాప్తంగా ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. వివిధ రాష్ట్రాల్లో పలు పార్టీలు అధికారంలోకి తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. బీజేపీ, కాంగ్రెస్, ఆప్, వైఎస్సార్సీపీ, డీఎంకే, టీఎంసీ పార్టీలకు పీకే రాజకీయ వ్యూహకర్తగా పనిచేశారు. 2014లో పీకే బీజేపీకి వ్యూహకర్తగా పనిచేశారు. మోదీ ప్రభుత్వాన్ని కేంద్రంలో అధికారంలోకి తీసుకురావడంలో ఆయన హస్తం ఉంది. 2013లో ప్రశాంత్ కిషోర్ స్థాపించిన సిటీజెన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెర్స్ (CAG)ని.. 2014 తర్వాత ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (I-PAC)గా మార్చారు.
2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి రాజకీయ వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్.. జగన్‌ను అధికారంలోకి తీసుకురావడంలో సక్సె్స్ అయ్యారు. అలాగే ఢిల్లీలో ఆప్ అధికారంలోకి రావడం, తమిళనాడులో డీఎంకే, పశ్చిమ బెంగాల్‌లో టీంఎసీ పార్టీ అధికారంలోకి రావడం వెనుక పీకే ఉన్నారు. ఈ పార్టీలకు రాజకీయ వ్యూహకర్తగా ఆయన అనేక సలహాలు, సూచనలు ఇచ్చారు. ఇలా రాజకీయ పార్టీల కోసం వ్యూహాలు రచించి.. వాటిని అధికారంలోకి తీసుకురాగలగిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు సొంతంగా పార్టీని ఏర్పాటు చేయడం చర్చనీయాంశమవుతోంది. మరీ తన పార్టీని బీహార్‌లో అధికారంలోకి తీసుకెచ్చేందుకు పీకే ఎలాంటి వ్యూహాత్మక చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.