/rtv/media/media_files/2025/10/07/kejri-2025-10-07-17-51-34.jpg)
Bihar Elections 2025: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ, పంజాబ్‌లలో తమ ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు. అదే ఊపులో దేశానికి కొత్త రాజకీయ భవిష్యత్తును తీసుకువస్తానని హామీ ఇచ్చారు. కానీ అనూహ్యంగా గత ఎన్నికల్లో ఢిల్లీలో ఓటమి పాలయ్యారు. కానీ పంజాబ్‌లో మాత్రం ఆయన ప్రజాదరణ చెక్కుచెదరకుండా ఉంది. గోవా, గుజరాత్‌లలో కూడా పార్టీ నెమ్మదిగా ఊపందుకుంది. అయితే ఇప్పుడు ఆయన బీహార్‌లోనూ రంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. ఈ ఎన్నికలను తేలికగా తీసుకోమని, తమ సత్తా చాటుతామని ఇప్పటికే కేజ్రీవాల్ ప్రకటించడం బీహార్ రాజకీయాలను హీటెక్కించింది.
కేజ్రీవాల్ వ్యూహాత్మక ప్రణాళిక..
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అన్ని స్థానాల్లో అభ్యర్థులను పోటీకి నిలబెడతామని ప్రకటించింది. 11 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితా ఇప్పటికే విడుదల చేసింది. అయితే బీహార్‌లో పాతుకుపోయిన కుల రాజకీయాలు, స్థానిక పార్టీల బలమైన ఓటు బ్యాంకుల ముందు AAP నిలబడుతుందా? అనవసరంగా సమయాన్ని వృధా చేస్తోందని పలువురు వాదిస్తున్నారు. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. ఆయన ప్రతి కదలిక బహుముఖ ప్రజ్ఞతో కూడుకున్నది. జూలైలో కేజ్రీవాల్ తన పార్టీ బీహార్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తుందని, ఇండియా బ్లాక్‌తో పొత్తు పెట్టుకోదని స్పష్టం చేశారు. ఇందుకు అనుగుణంగానే ఆయన వ్యూహాత్మక ప్రణాళికతో బరిలోకి దిగుతున్నారు.
హిందీ బెల్ట్‌లో పట్టు కోసమే..
ఆమ్ ఆద్మీ పార్టీని జాతీయ స్థాయిలో విస్తరించడమే అరవింద్ కేజ్రీవాల్ ఆశయం. బీహార్ ఎన్నికలు దీనికి చాలా కీలకం. ఢిల్లీ, పంజాబ్‌లలో విజయం సాధించిన తర్వాత ఆప్ జాతీయ ప్రత్యామ్నాయంగా తనను తాను స్థాపించుకోవాలనుకుంటోంది. బీహార్‌లో 243 సీట్లలో స్వతంత్రంగా పోటీ చేయడం ఈ దిశలో కీలకమైన అడుగు. దీనికి మరొక కారణం ఏమిటంటే.. హిందీ బెల్ట్‌ను నిలబెట్టుకోవాలంటే బీహార్‌లో పట్టు సాధించడం చాలా ముఖ్యం. బీహార్‌లో కనీసం ఒక స్థానంలోనైనా గెలిస్తే ఆ తర్వాత పార్టీని విస్తరించడం సులభం అవుతుందని కేజ్రీవాల్ భావిస్తున్నారట. ఈ విజయంతో భవిష్యత్తులో ఇతర హిందీ రాష్ట్రాలలో తమ ప్రభావాన్ని విస్తరించవచ్చని పార్టీ విశ్వసిస్తుంది.
బీహారీ వలసదారుల మద్ధతు..
విద్య, ఆరోగ్యం, ఉచిత విద్యుత్, నీరు, అవినీతి రహిత పాలన వంటి హమీలను బీహార్‌లో ప్రకటించాలని ఆప్ భావిస్తోంది. ఇప్పటికే బహిరంగ ర్యాలీలో ఢిల్లీ పాఠశాల -ఆసుపత్రి నమూనాను బీహార్‌లో అమలు చేస్తామని అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. ఈ నమూనా ముఖ్యంగా ఢిల్లీలో ఆప్ పని గురించి తెలిసిన పట్టణ, సెమీ-అర్బన్ ఓటర్లు, యువత, వలస బిహారీలను ఆకర్షించడం లక్ష్యంగా పెట్టుకుంది. బీహార్‌లో నిరుద్యోగం, విద్య లేకపోవడం, వలసలు ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. యువత, మధ్యతరగతి ప్రజలను ఆకర్షించడానికి ఆప్ ఈ అంశాలను లేవనెత్తుతోంది. పూర్వాంచల్ నుండి వచ్చిన బిహారీ వలసదారులు ఢిల్లీలో ఆప్‌కు మద్దతు ఇచ్చారని, ఇప్పుడు బీహార్‌లో కూడా అదే మద్దతును కోరుకుంటున్నారని పార్టీ పేర్కొంది.
బలమైన పునాది వేయాలనే..
ఢిల్లీ, పంజాబ్ విజయాల తర్వాత ఆప్ తనకు తాను జాతీయ ప్రత్యామ్నాయంగా ఎదగాలని కోరుకుంటోంది. అలా చేయడానికి బీహార్ వంటి రాష్ట్రాలలో ముందుగా అడుగు పెట్టాలి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఆశించిన విజయాన్ని సాధించలేకపోయినా.. రాబోయే పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు అది ఖచ్చితంగా పునాది వేస్తుంది. బీహార్‌లో 243 స్థానాల్లో స్వతంత్రంగా పోటీ చేయడం ప్రణాళికలో ఒక అడుగు వేయడమే. గుజరాత్‌లో మాదిరిగానే ఆమ్ ఆద్మీ పార్టీ మొదట బీహార్‌లోని పట్టణ స్థానిక సంస్థల్లో కొన్ని సీట్లను గెలుచుకోవడం ద్వారా ప్రజలను ఆకట్టుకోవచ్చు. ఈ ఎన్నికల్లో అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలనే ఆప్ లక్ష్యం కూడా బీహార్‌లో దాని సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడంలో భాగమే.
ఇది కూడా చదవండి: చిన్న పిల్లల దగ్గుకు సిరప్ అవసరమే లేదు.. అసలు నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా?
ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఆప్ సంస్థాగతంగా బలహీనంగా ఉంది. కానీ పాట్నా, ముజఫర్‌పూర్, బెగుసరాయ్ వంటి ప్రాంతాల్లో ఆప్ 2-4% ఓట్లను సాధించే అవకాశం ఉందని పలు సర్వేలు అంచనా వేస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇక్కడ అనేక సంవత్సరాలుగా సామాజిక, రాజకీయ రంగాలలో చురుగ్గా పనిచేస్తున్న అభ్యర్థులను నిలబెడుతోంది. ఈ వ్యక్తులకు వారి స్వంత బలమైన ఓటు బ్యాంకు ఉందని పలు సర్వేలు వెల్లడించాయి. అయితే ఆప్ దెబ్బ మాత్రం బీహార్ ప్రధాన పార్టీ JD(U)పై ఎఫెక్టు చూపించబోతుందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. ఆప్ వల్ల ఓట్లు చీలితే ఫలితాలు తారుమారు అయ్యే అవకాశం ఉందంటున్నారు.