బంగ్లాదేశ్ అల్లర్ల నేపథ్యంలో ప్రధానమంత్రి మోదీ కీలక భేటీ నిర్వహించారు. రక్షణ, హోం, ఆర్థిక, విదేశాంగ శాఖ మంత్రలతో సమావేశం జరిపారు. బంగ్లాదేశ్ పరిస్థితులపై చర్చించారు. భారత్ - బంగ్లాదేశ్ సరిహద్దుల్లో భద్రతపై ప్రధాని ఆరా తీశారు. ప్రస్తుతం షేక్ హసీనా ఉత్తరప్రదేశ్‌లోని హిండన్ ఎయిర్‌బేస్‌లోనే ఉన్నారు. ఆమెను జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, మిలిటరీకి చెందిన పలువురు ఉన్నతాధికారులు కలిశారు. హసీనాకు భారత వైమానిక దళంతో సహా ఇతర బలగాలు రక్షణ కల్పించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో పరిస్థితి, హసీనా భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలకు సంబంధించి చర్చలు జరిపారు.
Also Read: ఇది ఇజ్రాయెల్ సృష్టించిన నరమేధం.. 5 దేశాల్లో ఏరులై పారుతున్న నెత్తురు!
ఇప్పటికే భారత్ - బంగ్లాదేశ్ సరిహద్దులో భద్రత కట్టుదిట్టం చేశారు. మేఘాలయాలో కూడా నైట్ కర్ఫ్యూను అమలు చేశారు. ప్రస్తుత పరిస్థితిపై విదేశాంగ మంత్రి జైశంకర్‌ను విపక్ష నేత రాహుల్ గాంధీ ఆరా తీశారు. బంగ్లాదేశ్‌లో ఈరోజు జరిగిన అల్లర్లలో దాదాపు 56 మంది మృతి చెందారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అక్కడ హింసాత్మక ఘటనలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ ఘర్షణల్లో 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.