తెలంగాణలో మరో నెలరొజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఎన్నికల రణంలోకి దిగాయి. ముఖ్యంత్రి కేసీఆర్ 115 నియోజకవర్గాలకు తమ అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవలే మొదటి అభ్యర్థుల జాబితా ప్రకటించిన కాంగ్రెస్ త్వరలోనే రెండో జాబితాను ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. ఇక తాజాగా బీజేపీ 52 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూడు ప్రధాన పార్టీలు ప్రచారాల్లో మునిగిపోయాయి. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, కీలక నేతలు పార్టీలు మారిపోవడం లాంటి ఘటనలు జరగడంతో రాష్ట్రంలో ఎన్నికల వేడి నెలకొంది. ఇదిలా ఉండగా.. ఏపీ రాజకీయాల్లో దూకుడు చూపిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తెలంగాణలో కూడా తమ పార్టీ అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు సిద్ధమవుతున్నారు.
ఇప్పటికే రాష్ట్ర బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్‌లు పవన్ కళ్యాణ్‌ను కలిసి తమకు మద్ధతివ్వాలంటూ కోరిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై పవన్ కళ్యాణ్ తమ నిర్ణయం చెబుతామని చెప్పారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తాజాగా.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో బీజేపీ-జనసేన కూటమిపై చర్చలు జరిపారు. దాదాపు 45 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, జనసేన పోలిటికల్ అఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌లు కూడా పాల్గొన్నారు. తెలంగాణలో కనీసం 30 స్థానాల్లో పోటీ చేయాలని తమ పార్టీ కేడర్ నుంచి ఒత్తిడి ఉందని ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ బీజేపీ నేతలకు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సీట్ల విషయంపై స్పష్టమైన నిర్ణయం తీసుకునేందుకు మరో రెండు రోజుల పాటు పవన్ కళ్యాణ్ మరికొంతమంది బీజేపీ కీలక నేతలతో సమావేశం కానున్నట్లు సమాచారం.