Pawan Kalyan Comments On AP Early Elections: ముందస్తు వచ్చే అవకాశం..
ఏపీలో ముందస్తు ఎన్నికలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలోని(Mangalagiri) పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ క్రియాశీలక నేతలతో జరిగిన సమావేశంలో మాట్లాడిన ఆయన.. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. డబ్బు తీసుకుని సీట్లు ఇచ్చే సంస్కృతి జనసేనలో లేదన్నారు. జనాల్ని దోచుకునే నేతలు కాదు.. తమ సొమ్మును పంచే నేతలు కావాలన్నారు. డబ్బుతో ఓట్లు కొనమని చెప్పడం లేదు కానీ నాయకులు కావాలంటే ఖర్చుపెట్టి తీరాలని పేర్కొన్నారు. రూపాయి ఖర్చు చేయకుండా ఎవరూ నాయకులు కాలేరని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
మంచి వారినే పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం..
సామాన్యుడిని రాజకీయాల్లోకి రానివ్వకూడదని వైసీపీ(YCP) ప్రభుత్వం భావిస్తోంది. వైసీపీ దృష్టిలో రాజకీయం అంటే భయపెట్టడం, బెదిరించడమేనని ఆరోపించారు. జనసేన నేతలకు త్యాగం, బాధ్యత జవాబుదారీతనం ఉండాలని ఆయన సూచించారు. వచ్చే 25ఏళ్ల గురించి ఆలోచించే నేతలు కావాలని.. భావితరం గురించి ఆలోచించే నాయకులు వేరే పార్టీ నుంచి వస్తే ఆహ్వానిస్తామన్నారు. మంచి వారినే పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని.. అలాంటి వారిని అడ్డుకునే ప్రయత్నం చేయవద్దు అని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.
ఈనెల 10 నుంచి మూడో దశ యాత్ర..
ఇప్పటికే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మూడో విడత వారాహి (Varahi) విజయ యాత్ర షెడ్యూల్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 10వ తేదీన విశాఖపట్టణం(Vishakapatnam) నుంచి వారాహి విజయ యాత్ర ప్రారంభం కానుందని తెలిపింది. అదే రోజు విశాఖపట్నంలో బహిరంగ సభ ఉంటుందని పేర్కొంది. ఈ నెల 19 వ తేదీ వరకూ యాత్ర సాగేలా ప్రణాళికలు రూపొందించారు. క్షేత్ర స్థాయి సమస్యలు, విశాఖలో చోటు చేసుకుంటున్న భూకబ్జాలకు సంబంధించి పవన్ పరిశీలనలు చేయనున్నారని వెల్లడించింది. విశాఖలో యాత్రతో పాటు జనవాణి కార్యక్రమం కూడా ఉంటుందని వివరించింది. మరోవైపు వారాహి యాత్ర ప్రారంభమయ్యే లోపు విశాఖలో భూకబ్జాలు ఆగిపోవాలని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. వైసీపీ అధికారంలోకి వస్తే కొండలు మింగేస్తారన్న విషయం గత ఎన్నికల ప్రచారంలో చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. మరోవైపు ఇక నుంచి మంగళగిరిలో ఉండనున్నటన్లు పవన్ తెలిపారు.
జూన్ 14న కత్తిపూడిలో ప్రారంభించిన వారాహి యాత్ర తొలి దశ అదే నెల 30న భీమవరం సభతో ముగిసింది. తర్వాత జులై నెలలో రెండో దశ యాత్ర చేపట్టారు. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో మొత్తం పది నియోజకవర్గాలను ఈ యాత్రలో కవర్ చేశారు. ఈ సందర్భంగా కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడిపై ఆయన చేసిన విమర్శలు కలకలం రేపాయి. అనంతరం వాలంటీర్లు మహిళల అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని.. డేటా చౌర్యం చేస్తున్నారని పవన్ ఆరోపణలు చేయడం పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే.
Also Read: వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలిస్తే గుండు కొట్టించుకుంటా: రాప్తాడు ఎమ్మెల్యే!