Amit Shah Telangana Tour : పార్లమెంట్ ఎన్నికల కసరత్తు చేస్తోంది బీజేపీ(BJP) అధిష్టానం. ఈ నేపథ్యంలో ఈ రోజు తెలంగాణ(Telangana)కు రానున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మధ్యాహ్నం రాష్ట్ర బీజేపీ నేతలతో అమిత్ షా సమావేశం కానున్నారు. మరికొన్ని నెలల్లో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలపై వారికి దిశానిర్దేశం చేయనున్నారు అమిత్ షా. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి అత్యధిక సీట్లను గెలవాలని బీజేపీ పావులు కదుపుతుంది. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఎంపీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు రాకుండా చేసేందుకు వ్యూహాలు రచిస్తోంది.
ALSO READ: రూ.500లకే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తులు షురూ!
అమిత్ షా తెలంగాణ టూర్ షెడ్యూల్ ఇదే..
అమిత్ షా(Amit Shah) తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. గంటన్నర ఆలస్యంగా అమిత్ షా తెలంగాణకు రానున్నారు. ముందుగా మధ్యాహ్నం 12 గంటలకు వస్తారని అమిత్ షా కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. తాజాగా ఈరోజు మధ్యాహ్నం 1:25 గంటలకు ఆయన వస్తున్నట్లు పేర్కొంది. 1:25 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం ఆయన మధ్యాహ్నం 1:40 నుంచి 2:40 వరకు నోవాటెల్ లో బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతలతో లంచ్ మీట్ ఏర్పాటు చేయనున్నారు. పలు అంశాలపై చర్చించనున్నారు. అక్కడి నుంచి నేరుగా మధ్యాహ్నం 3:05 గంటలకు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్తారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం 3:50 గంటలకు కొంగర కలాన్ లోని శ్లోక కన్వెన్షకు చేరుకుంటారు. 3:50 నుంచి 5:20 వరకు బీజేపీ నేతలతో సమావేశం కానున్నారు. ఈ మీటింగ్ లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై విశ్లేషణ చేయనున్నారు. అలాగే 2024 లోక్ సభ ఎన్నికలకు సన్నద్ధతపై దిశానిర్దేశం చేయనున్నారు. కొంగరకలాన్ శ్లోక కన్వెన్షన్ లో నిర్వహిస్తున్న బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశం ముగిసిన అనంతరం అమిత్ షా ఢిల్లీకి తిరిగి వెళ్లనున్నారు.
ALSO READ: ఓటుకు రూ.3,000.. మహిళలకు పట్టు చీర!