Sanskrit: సంస్కృతం 'జనని' అయితే గనక.. అది కుట్రే! 'సంస్కృతం అన్ని భాషలకు జనని' అని చెప్పడం కూడా ఓ కుట్రే అని వ్యాసకర్త డాక్టర్ దేవరాజు మహారాజు అన్నారు. ఎందుకంటే ఆ భాషతోనే అగ్రవర్ణాలు తమ ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకున్నాయని చెప్పారు. లిపి లేని సంస్కృతం ఒక 'బోలీ' అంటూ ఆసక్తికర చర్చకు దారితీశారు. By srinivas 28 Nov 2024 in Opinion హైదరాబాద్ New Update షేర్ చేయండి ఒకప్పుడు అక్షరాస్యులు, విద్యావంతులు, పండితులు అంటే వారు కేవలం అగ్రవర్ణం వారే - బ్రాహ్మణులే - నాలుగు శ్లోకాలు నేర్చుకుని, గుళ్ళమీద, మతం మీద పట్టు బిగించి రాజుల్ని, చక్రవర్తుల్ని సైతం తమ చెప్పుచేతల్లో ఉంచుకున్నారు. హిందూమతోద్థారకులుగా తోచిందేదో చెప్పి, జనాన్ని మూఢ నమ్మకాల్లో ముంచేశారు. వారిని ప్రశ్నించిన వారిని దుష్టులుగా, ధూర్తులుగా చిత్రించారు. ఆ మనువాదుల ప్రభావంలో పడి, ఒక్కోసారి పరాయీకరణ చెంది - సామాన్య ప్రజలు తరతరాలుగా అర్థం లేని ఆచారాలు పాటిస్తూ తమకు తాము సజ్జనులుగా భావించుకున్నారు. అదే పరిస్థితి ఇప్పటికీ కొనసాగుతోంది. శతాబ్దాలు గడిచినా జనం ఆ బంధనాల్ని తెంపుకుని స్వేచ్ఛగా ఆలోచించలేక పోతున్నారు. మనువాదులు అలవాటు చేసిన దేవీ దేవతల్ని కొలుస్తూ, వారి పండగలే జరుపుకుంటూ తాము కూడా తక్కువేమీ కాదు, అని పొంగి పోతున్నారు. 'తమది కూడా అగ్రవర్ణం వారి స్థాయే' అని అనుకుంటున్నారు. తప్పిస్తే, కులం, గోత్రం, మతం - అందులో శాఖలూ వదిలేసి మనుషుల్లా ప్రవర్తిద్దాం- అని అనుకోవడం లేదు. ఎప్పుడో శతాబ్దాల కింద జరిగిన కుట్రకు బలైపోయామన్న విషయం గ్రహించుకోవడం లేదు. అన్నిటినీ మించి మానవత్వం అనేది ఒకటి ఉందని దాన్ని అందరం కలిపి నిలుపుకోవాల్సి ఉందని అనుకోవడం లేదు. ఎన్నో పెద్ద పెద్ద కుట్రల్లో ''సంస్కృతం అన్ని భాషలకు జనని'' అని చెప్పడం కూడా ఓ కుట్రే - ఎందుకంటే ఆ భాషతోనే అగ్రవర్ణాలు తమ ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకున్నాయి. Also Read : వచ్చేసిన నరేష్ బచ్చల మల్లి టీజర్.. ఈసారి గట్టిగానే ప్లాన్ చేశాడుగా.. భాషకు ఒక స్వరూపం లేదు.. జీవ పరిణామం ఎలా జరుగుతూ వచ్చిందో, భాషా పరిణామాలు కూడా అలాగే క్రమ క్రమంగా కొనసాగాయి. ఉన్న ఫళంగా ఏదీ ఎక్కడి నుంచి ఊడిపడలేదు. భాషా పరిణామం గురించి మాట్లాడుకోవాలంటే, అంతకు ముందు కొన్ని పదాలు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మాటలు-లిపి-భాష అనే పదాల మధ్య గల వ్యత్యాసం అర్థం చేసుకోవాలి. రాతి యుగంలో సైగలు, ధ్వనులతోనే మనుషుల సంభాషణ సాగింది. క్రమంగా ధ్వనులు మాటలుగా రూపాంతరం చెందుతూ వచ్చాయి. మానవ పరిణామ దశలో మొదట ఒకరి నుండి ఒకరు కొన్ని విషయాలు తెలియజేసుకోవడానికి మాటలు అవసరమయ్యాయి. ఒక దశలో అక్షరాలు లేవు. లిపిలేదు. భాషకు ఒక స్వరూపం లేదు. తర్వాత కాలంలో మాటల్ని అక్షరాల ద్వారా వ్యక్తీకరించడం కోసం అక్షరాలకు రూపకల్పన జరిగింది. దాన్ని 'లిపి' అని అన్నాం. మాటల్లో చెప్పగలిగే దాన్ని అక్షరాల్లో కూడా పొందుపరచగలిగితే దాన్నే 'భాష' అన్నాం. ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా కొన్ని ఆదివాసీ జాతుల మాటలకు లిపి లేదు. అందుకే అవి భాషలుగా గుర్తించబడలేదు. Also Read : ఆస్ట్రేలియా ప్రధానికి పంచ్ ఇచ్చిన కోహ్లీ.. మసాలా బ్యాచ్ అంటూ భాషలకు 'జనని' ఎలా అవుతుంది? ఒక వేయ్యేండ్ల క్రితం సంస్కృతం భారత దేశానికి వచ్చినప్పుడు దానికి లిపి లేదు. అప్పటికి ఇక్కడ వ్యాప్తిలో ఉన్న దేవనాగరి లిపి (మన హిందీలిపి)లో దాన్ని రాయడం ప్రారంభించారు. ఆ తర్వాత కాలంలో అన్ని భారతీయ భాషల్లో సంస్కృతాన్ని రాయడం మొదలుపెట్టారు. తనకై తాను ఒక లిపిని అభివృద్ధి చేసుకోని సంస్కృతం అన్ని భాషలకు 'జనని' ఎలా అవుతుంది? అది ఎదగని భాష! మాటలు భాషగా స్థిరపడాలంటే లిపిని రూపొందించుకోవడం అవసరం. లిపి లేని మాటల్ని (సంభాషణల్ని) హిందీలో 'బోలీ' అని అంటారు. ఆ రకంగా సంస్కృతం ఒక బోలీ. అది మన దేశం వచ్చాక ఇక్కడి దేవనాగరి లిపి మీద ఆధారపడింది. ఇంతకూ దేవనాగరి లిపి ఎప్పుడు అభివృద్ధి చెందిందీ... అంటే చారిత్రక ఆధారాల ప్రకారం దేవనాగరి లిపి తొమ్మిదో శతాబ్దం తర్వాత మాత్రమే కనిపిస్తోంది. ఆ విధంగా సంస్కృత భాషా వికాసం తొమ్మిదో శతాబ్దం తర్వాతనే జరిగిందని చెప్పాలి. అందువల్ల సంస్కృతం ఆది భాష, సర్వ భాషలకు 'జనని' అనేది శుద్ధ అబద్ధం! ఒక తప్పుడు ప్రచారం మాత్రమే. Also Read : జోరుగా వరంగల్ భద్రకాళి చెరువు పూడిక తీత పనులు-PHOTOS దేశంలో ఒక క్షేత్రమంటూ లేదు.. సంస్కృతం అంటేనే సంస్కరించబడింది అని అర్థం. ముందు ఒక భాష ఉంటేనే, అది సంస్కరించబడితేనే... అప్పుడది సంస్కృతమయ్యింది. పైగా ఈ భాషకు మన దేశంలో ఒక క్షేత్రమంటూ లేదు. తెలుగు, తమిళం, మళయాళం, బెంగాలీ వంటి భాషలకు నిర్దిష్టమైన క్షేత్రాలు ఉన్నాయి. ఇంగ్లీషు, అరబ్బీ, ఫారసీలకు దేశంలో ఒక నిర్దిష్టమైన భూమి అంటూ లేదు. ఆ భాషలు తెలిసిన వారు దేశంలో అక్కడక్కడా ఉండొచ్చు. భాషకు ఒక భూమి ఉన్నప్పుడు, ఆ భూమి మీద పుట్టిపెరిగిన వారికి అది మాతృభాష అవుతుంది. అక్కడి జనమంతా ఆ భాషే మాట్లాడుతారు. ఆర్యులతో పాటు సంస్కృతం బయటి నుండి వచ్చిందే! ఇక్కడ కొన్ని విషయాలు గమనించుకోవాలి. 1. సంస్కృతం మాట్లాడే ప్రదేశం / రాష్ట్రం భారతదేశంలో ఎక్కడా లేదు. 2. మనువాదులు బలవంతంగా తమ హిందూ దేవీ దేవతల పూజల్లో, వ్రతాల్లో, కర్మకాండల్లో ఉపయోగించడం తప్ప, సంస్కృతం ఎక్కడా నిత్యజీవితంలోని సంభాషణల్లో భాగం కాలేదు. 3. సంస్కృతం ఎప్పుడూ ఎక్కడా ప్రజల భాషగా లేదు. ఒకవర్గం వారికే అది పరిమితమైంది. ఇకపోతే సాధారణ శకానికి ముందు (బిసిఈ) అసలు ఎక్కడా దేశంలో సంస్కృతం లేదు- అనేది రుజువయ్యింది. మనువాదుల అబద్ధపు ప్రచారాలు పక్కన పెట్టి మనం వాస్తవం లోంచి విషయం పరిశీలిద్దాం! బహుజన చక్రవర్తి అశోకుడి కాలం నాటికి (268-232 బీసీఈ) ఈ దేశంలో ఉన్నది ప్రాకృత భాష. దాని మరొక రూపమే పాలి భాష. ఆ భాషను ధమ్మలిపిలో రాసేవారు. సాధారణ శకానికి ముందు నాటి స్థూపాలు, శిలాఫలకాల మీద అంతటా ప్రాకృతమే ఉంది. ఎక్కడా దేశంలో సంస్కృత శిలాఫలకాలు లభించలేదు. కారణం ఆ భాషే అప్పటికి లేదు కాబట్టి! పైగా సంస్కృతం విస్తృతంగా జనంలోకి వెళ్ళకుండా మనువాదులే అడ్డుకట్ట వేసుకున్నారు. తమ జ్ఞానం ఇతరులకు అందగూడదని, కేవలం తమ వర్ణం వారికి మాత్రమే అందాలని కుత్సిత బుద్ధితో సంస్కృత పదం ఉచ్ఛరిస్తే వారి నాలుకలు తెగ్గోశారు. అదంతా మళ్ళీ వేరే విషయం. ఇప్పుడు ఆ విషయాలు అందరికీ తెలిసినవే. ఇది కూడా చదవండి: పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల్లో మార్పులు ప్రపంచ వ్యాప్తంగా నాగరికతలు ఏర్పడుతూ వచ్చాయి. ఒక్కో నాగరికత ఒక్కోరకమైన మాటల్ని, ఒక్కోరకమైన లిపిని, ఒక్కోరకమైన భాషని రూపొందించుకుంటూ వచ్చాయి. మనకు మన దేశంలో సింధూ నాగరికతలో 4500ఏండ్ల నాటి లిపి లభ్యమైంది. అయితే దాన్ని ఇప్పటి వరకు ఎవరూ చదవలేకపోయారు. అదే లిపికి దరిదాపులుగా ఉన్న మరికొన్ని లిపులు కూడా లభ్యమయ్యాయి. అవే ధమ్మలిపి, గోండ్ లిపి వంటివి. వాటిని కూడా పూర్తిగా అర్థం చేసుకునేవారు లేకపోవడం వల్ల అవి అంతర్జాతీయ భాషల జాబితాలో చేరలేదు. వేల సంవత్సరాల తర్వాత అప్పటి అక్షరాలు, అంకెలు, గుర్తులు తెలుసుకోవడం కష్టం. అక్షరమంటే ఒక రకమైన 'కోడ్'. దాన్ని ఎలా పలకాలి? ఎలా పలికితే ఏ అర్థం వస్తుంది? అనేది తెలియనంత వరకు ఏలిపి అయినా, ఏ భాష అయినా అర్థం కాదు. తర్వాత వచ్చిన చారిత్రక యుగంలోని లిపులు అధ్యయనం చేయడానికి వీలయ్యింది. సమ్యక్ సంస్కృతికి సంబంధించిన ఆధారాలు అనేకం దొరికాయి. అశోకుడి శిలాశాసనాలు అధికంగా లభించాయి. అవన్నీ ధమ్మలిపిలో ఉన్నాయి. బుద్ధుడి సమకాలికుడైన పసేన్‌జీత్ శిలాశాసనం ఒకటి మధ్య ప్రదేశ్‌లోని సత్నా జిల్లాలో దొరికింది. అది కూడా ధమ్మలిపిలోనే ఉంది. ఇదే ఇక్కడ చాలా కీలకమైన విషయం. మనువాదులు చెప్పుకుంటున్నట్టు సంస్కృతమే అతి ప్రాచీనమైన భాష అయితే మొదట ఆ భాషలోని శిలాశాసనాలు దొరకాలి కదా? దొరకలేదు. దొరకవు. ఎందుకంటే సంస్కృతానికి లిపేలేదు. లిపిలేని భాషలో ఎవరు మాత్రం ఏం రాస్తారూ? సృష్టి ప్రారంభం నుండే సంస్కృతం ఉంది. వేదాలు, పురాణాలు ఆ దేవదేవుడే స్వయంగా మానవులకు అందించాడు - వంటి కట్టు కథల్ని వివేకవంతులు విశ్వసించరు. పరిణామ క్రమం, చారిత్రక ఆధారం, వికాసం ఎలా ఎప్పుడు జరుగుతూ వచ్చాయో పరిశీలించి, పరిశోధించి నిగ్గుతేల్చిన తర్వాత మాత్రమే ఏ విషయాన్నైనా వారు గుర్తిస్తారు. జరిగిన తప్పిదం ఏమిటంటే ధమ్మలిపిలో దొరికిన పాలి శాసనాలు - సంస్కృతంవి అని అబద్దపు ప్రచారం చేశారు. అంతే కాదు ఒక్కోసారి ధమ్మలిపిని బ్రాహ్మి లిపిగా ప్రకటించారు. ఉదాహరణకు 22వ శతాబ్దంలో లభించిన జూనాఘడ్ శాసనం పాలి లిపిలో ఉంది. దాన్ని గుర్తించలేక అది సంస్కృతమని భ్రమపడ్డారు. అసలైతే అప్పటికి సంస్కృతం భారతదేశానికి రాలేదు. వచ్చాక అది దేవనాగరి లిపిలో నమోదయ్యింది. చెపితే గిబితే అది దేవనాగరి లిపి అని చెప్పాలి కాని, సంస్కృతం అని అనడం తప్పుకదా? మరొక ముఖ్య విషయమేమంటే ధమ్మలిపిలో సంస్కృతం రాయలేరు. క్రి కృ లాంటి శబ్దాలు దేవనాగరి లిపిలో రాసుకోవాల్సిందే గాని ధమ్మలిపిలో రాయడం అసలే కుదరదు. ఆ శబ్దాలే ఆ లిపిలో ఇమడవు. పదవ శతాబ్దం తర్వాత 'ధమ్మ'ను 'ధర్మ' అని రాయడం ప్రారంభించారు. పేర్లతో సహా అన్నింటినీ సంస్కృతీకరించడం అప్పటి నుండే ఆరంభమైంది. ఉదాహరణకు విక్‌మాదత్ (పాలిభాషలో)ను సంస్కృతీకరించి విక్రమాదిత్యగా మార్చారు. చద్ గుపత్ (పాలి)ని సముద్ర గుప్తుడుగా మార్చారు. వీరు హిందూ రాజులు కాకపోయినా హిందూ రాజులుగా ప్రచారం చేశారు. 9వ శతాబ్దం నాటి నలందా విశ్వవిద్యాలయం అధికార ముద్ర లభించింది. దాని మీద శ్రీ నలందా మహావిహార్ అని ఉంది. విహారాలు, ఆరామాలు బౌద్ధులకు సంబంధించిన పదాలు. దాని ముందు శ్రీ చెర్చడం హిందూ మనువాదుల దౌర్జన్యం. ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోదలచిన వారు సమ్యక్ ప్రకాశన్ వారు ప్రచురించిన 'భ్రమ్‌క పులిందా' చదవాలి. దీని రచయిత రాజీవ్ పటేల్. ఈయన సంజరు కుమార్‌తో కలిసి ఇంగ్లీషు వర్షన్ కూడా ప్రకటించారు. ఇది కూడా చదవండి: భయపడొద్దు పులి పారిపోయింది.. చిరుత సంచారంపై అటవిశాఖ క్లారిటీ! బ్రాహ్మణార్యుల మతం - వైదిక మతం; జాతి-ఆర్యజాతి; భాష- సంస్కృతం. మొదట సంస్కృతం ఆరియన్ లేక ఆరియక్ మాండలికానికి సంబంధించిన ఛండా భాష. అది సంస్కరించబడింది. తర్వాత కాలంలో బ్రాహ్మణార్యులు, ద్రావిడ జీవన విధానాల్లోకి తమ పురాతన ఆరియన్ సంస్కృతాన్ని (ఛండా మాండలికాన్ని) జొప్పించారు. అందువల్ల ఆరియన్ మూలాలున్న వైదిక ఛండా భాషగా మాత్రమే సంస్కృతాన్ని గుర్తించాలి! సంస్కృతం లిపి లేని భాషగా చాలా కాలం కొనసాగింది. అది ఈ దేశపు 'నాగరి' లిపిని ఆశ్రయించింది. దానికే దేవ శబ్దాన్ని జోడించి 'దేవనాగరి'గా ప్రచారం చేసుకున్నారు. పనిలో పనిగా సంస్కృతాన్ని ''దేవభాష''గా ఉన్నతీకరించు కున్నారు. అది ఎప్పుడూ వ్యవహార భాషగా లేదు. స్తుతి, స్తోత్రాలతో మాత్రమే కొనసాగింది. ఇప్పటికీ అది వాటికే కుంచించుకు పోయి ఉంది. పూర్తిగా ఇది ఇండో-యూరోపియన్ భాష కాదు. బ్రాహ్మణిజం - సంస్కృతం రెండూ పెనవేసుకుపోయి అర్చక, స్తోత్ర, పూజాది మత పరమైన విషయాలకు మాత్రమే పరిమితమైంది. అలౌకిక విషయాల ప్రచారంలో మునిగిపోయింది. దీన్ని మత ఫాసిజంగా ((Rightist Religious Fascism)) గా గుర్తించాలి! వ్యాసకర్త: కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు విజేత, జీవశాస్త్రవేత్త.డాక్టర్ దేవరాజు మహారాజు #sanskrit #hindi #telugu #languages మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి