Nobel-Winner Yunus : షేక్ హసీనా (Sheikh Hasina) రాజీనామా చేసిన తర్వాత బంగ్లాదేశ్ అధ్యక్షుడు మొహమ్మద్ షహబుద్దీన్ పార్లమెంట్‌ను రద్దు చేశారు. దీని తర్వాత నోబెల్ శాంతి బహుమతి గ్రహత యూనస్ (Yunus) కు తాత్కాలికంగా ప్రభుత్వాన్ని అప్పగించారు. దీనికి సంబంధించి నిన్న అర్ధరాత్రి ప్రకటన చేశారు షహబుద్దీన్. త్వరలోనే ఎన్నికలను కూడా నిర్వహించనున్నారు. దాంతో పాటూ బంగ్లాదేశ్ సైన్యంలో మేజర్ జనరల్‌గా ఉన్న జియావుల్ అహ్‌సాన్ మీద కూడా వేటు పడింది. అలాగే లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ సైఫుల్ అలాంను విదేశాంగ మంత్రిత్వశాఖకు కేటాయించారు. మరికొందరు లెఫ్టినెంట్ జనరళ్లనూ వారి స్థానాల నుంచి తప్పించారు.
ఇక బంగ్లాదేశ్‌ను వదిలి వెళ్ళడానికి ప్రయత్నించిన ఐటీశాఖ మాజీ మంత్రి జునైద్ అహ్మద్ పలక్‌ను, విదేశాంగ మాజీ మంత్రి హసన్ మహమూద్‌ను అధికారులు ఢాకా విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు హసీనాను, ఆమె సోదరిని అరెస్టు చేసి బంగ్లాదేశ్‌కు తిరిగి పంపాలని బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మహబూబ్ ఉద్దీన్ ఖొఖోన్ భారత్‌ను కోరారు.
నోబెల్ శాంతి బహుమతి గ్రహీత యూనస్..
యూనస్ 2012 నుంచి 2018 వరకు స్కాట్లాండ్‌లోని గ్లాస్గో కాలెడోనియన్ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్‌గా పని చేశారు. ఆయన మొదట చిట్టగాంగ్ యూనివర్శిటీలో ఎకానమిక్స్ ప్రోఫెసర్‌గా చేశారు. ఆ కాలంలోనే బంగ్లాదేశ్‌లోని పేదల అభ్యున్నతి కోసం యూనస్ కృషిచేశారు. చిట్టగాంగ్‌లో 1940లో ఈయన పుట్టారు. ఆయన ఓ సామాజిక కార్యకర్త, బ్యాంకర్, ఆర్థిక వేత్త. మైక్రోఫైనాన్స్ బ్యాంక్ ద్వారా లక్షల మంది ప్రజలను పేదరికం నుంచి బయటపడేసిన ఘనత యూనస్‌ది. ఇందుకు గానూ ఈయన 2006లో నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. ఉద్యమాన్ని నడిపించిన విద్యార్ధులే బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని (Bangladesh Government) యూనస్‌కు అప్పగించాలని డిమాండ్ చేశారు.
Also Read: Bangladesh: ప్రభుత్వాన్ని కూల్చేసిన 26ఏళ్ళ కుర్రాడు