No entry on ORR:న్యూ ఇయర్ వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జీహెచ్ఎంసీ పరిధిలోని కమిషనరేట్లు కీలక చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుపైకి డిసెంబర్ 31 వ తేదీన రాత్రి నుంచి జనవరి 1 వ తేదీన తెల్లవారుజాము వరకు కార్లకు అనుమతి లేదని పోలీసులు ప్రకటించారు. భారీ వాహనాలు, ట్రక్కులు, లారీలు, బస్సులు, ఇతర మీడియం వాహనాలకు మాత్రం ఎప్పటిలానే ఎంట్రీ ఉంటుందని తెలిపారు. అయితే ఎయిర్‌పోర్టుకు వెళ్ళే కార్లను మాత్రం ఓఆర్ఆర్‌పైకి అనుమతి ఇస్తామని సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల సీపీలు స్పష్టం చేశారు. ఈ కార్ల వాళ్ళు వారికి సంబంధించిన విమాన టికెట్ వివరాలు చూపించిన తర్వాతనే ఓఆర్‌ఆర్‌పైకి ఎంట్రీ ఉంటుందని తెలిపారు. అయితే ఎయిర్‌పోర్ట్ నుంచి తిరిగి వచ్చే కార్లు మాత్రం సాధారణ రోడ్డుపై నుంచే రావాల్సి ఉంటుందని స్పస్టం చేశారు. ఎయిర్‌పోర్టుకు వెళ్ళే వారికి ఆలస్యం జరగకుండా ఉండేందుకు మాత్రమే ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read:కర్ణాటక రొమాంటిక్ హైస్కూల్ ప్రిన్సిపల్ సస్పెండ్
అలాగే ఓఆర్ఆర్‌తో పాటూ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి వచ్చే పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వే పై కూడా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కేవలం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే వాహనాలకు తప్ప ఇతర వాహనాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. దీంతో పాటూ డిసెంబర్ 31 వ తేదీ రాత్రి 10 నుంచి జనవరి 1 వ తేదీన ఉదయం 6 గంటల వరకు నాగోల్ ఫ్లై ఓవర్, కామినేని, ఎల్‌బీ నగర్, బైరామల్‌గూడ ఫ్లై ఓవర్‌లు, ఎల్‌బీ నగర్ అండర్‌పాస్, చింతలకుంట అండర్‌పాస్‌లను మూసివేస్తామని రాచకొండ సీపీ సుధీర్‌బాబు తెలిపారు. ఇక న్యూ ఇయర్ సందర్భంగా క్యాబ్‌లు, టాక్సీలు, ఆటో డ్రైవర్లు కచ్చితంగా అందుబాటులో ఉండాలని తెలిపారు. డ్రైవర్లు యూనిఫామ్ ధరించడంతో పాటు అన్ని ధ్రువపత్రాలను తమ వెంట సిద్ధంగా ఉంచుకోవాలని పోలీసులు సూచించారు.