/rtv/media/media_files/2025/02/08/rkYd65BZqYpq1cZwuhOu.jpg)
Parvesh Verma, vijendar gupta and Arvind Singh Lovely
మొత్తానికి 27 ఏళ్ల తర్వాత బీజేపీ ఢిల్లీలో అధికారాన్ని దక్కించుకుంది. రెండుసార్లు వరుసగా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఆప్‌ను ఈసారి ఢిల్లీ ప్రజలు తిరస్కరించారు. ఇందుకు ప్రత్యమ్నాయంగా బీజేపీకే అధికార బాధ్యతలు అప్పగించారు. మరీ ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరూ అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలోనే పలువురి నేతల పేర్లు ముందుకొస్తున్నాయి. మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేశ్ వర్మ పేరు ప్రధానంగా వినిపిస్తుండగా.. ఈ రేసులో మరికొందరు కూడా ఉన్నారు.
పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ
న్యూఢిల్లీ స్థానంలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై పోటీ చేసిన.. బీజేపీ నేత పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ 4 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గత ఆరు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ స్థానం ఆప్ గెలుస్తూ వస్తుంది. 1998, 2003, 2008లో మాజీ సీఎం షీలా దీక్షిత్ గెలవగా.. 2013, 2015, 2020లో అరవింద్ కేజ్రీవాల్ గెలిచారు. గత 27 ఏళ్లుగా ఆప్‌కు కంచుకోటగా ఉన్న న్యూఢిల్లీ స్థానంలో మొదటిసారి బీజేపీ గెలవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ స్థానంలో బీజేపీ నుంచి పోటీ చేసి అరవింద్ కేజ్రీవాల్ లాంటి బడా నేతను ఓడించిన పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ ఇప్పుడు చర్చ నడుస్తోంది.
ఢిల్లీ మాజీ సీఎం సాహిబ్ సింగ్ వర్మ కొడుకైన పర్వేశ్ వర్మ 2014 నుంచి 2014 వరకు వెస్ట్ ఢిల్లీ నుంచి ఎంపీగా ఉన్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 5.78 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచారు. అయితే 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో బీజేపీ పర్వేశ్‌కు ఎంపీ టికెట్ ఇవ్వలేదు. చివరికి అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్‌కు పోటీగా రంగంలోకి దింపింది. ఇప్పుడు పర్వేశ్ ఏకంగా అరవింద్ కేజ్రీవాల్‌నే ఓడించి దేశం ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నారు. దీంతో ముఖ్యమంత్రి రేసులో ఈయనే ప్రధానంగా ఉన్నట్లు తెలుస్తోంది.
విజేందర్ గుప్తా
విజేందర్ గుప్తా ఢిల్లీ అసెంబ్లీలో విపక్ష నేతగా కొనసాగుతున్నారు. ఈసారి జరిగిన ఎన్నికల్లో రోహిణి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన.. ఆప్ నేత ప్రదీప్ మిట్టల్‌పై ఏకంగా 37 వేల ఓట్ల తేడాతో గెలిచారు. విజేందర్ గుప్తా వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. బీజేపీ సీనియర్ నేతగా ఈయనకు పార్టీలో మంచి గుర్తింపు ఉంది. ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకునే రోజుల నుంచే విజేందర్ బీజేపీలో ఉన్నారు. 2013లో న్యూఢిల్లీ స్థానం నుంచి పోటీ చేశారు. కానీ ఆ స్థానంలో అరవింద్ కేజ్రీవాల్ గెలిచారు. కేజ్రీవాల్, షీలా దీక్షిత్ తర్వాత విజేందర్ మూడో స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత వేరే స్థానం నుంచి పోటీ చేసి 2015,2020లో గెలిచారు. ఇప్పుడు మళ్లీ మూడోసారి కూడా గెలిచారు. దీంతో ఈయన కూడా సీఎం రేసులో ఉన్నారు.
కైలాశ్ గెహ్లాట్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందుగానే కైలాశ్ గెహ్లాట్ ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. జాట్ సామాజిక వర్గానికి చెందిన కైలాశ్ గెహ్లాట్ గతంలో ఆప్ ప్రభుత్వంలో రవాణాశాఖ మంత్రిగా పనిచేశారు. ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజ్వాసన్ స్థానం నుంచి పోటీ చేసి గెలుపు దిశగా దూసుకెళ్తున్నారు. ఈయన కూడా సీఎం రేసులో ఉన్నట్లు సమాచారం.
అర్విందర్ సింగ్ లవ్లీ
మాజీ ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అయిన అర్విందర్ సింగ్ లవ్లీ బీజేపీలో చేరారు. గాంధీనగర్ స్థానం నుంచి పోటీ చేసిన ఈయన.. ఆప్ నేత నవీన్ చౌదరీపై 12,748 ఓట్ల తేడాతో గెలిచారు. ఢిల్లీ రాజకీయాల్లో అర్విందర్ సింగ్ కీలక నేతగా ఉన్నారు. ఈయన కూడా ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకునేటప్పుడే తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. గాంధీనగర్ స్థానం నుంచి 1998లో మొదటిసారిగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత 2013 వరకు అదే స్థానంలో గెలుస్తూ వచ్చారు. అంతేకాదు షీలా దీక్షిత్ ప్రభుత్వంలో పలు శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2024 మే నెలలో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో కూడా గెలిచారు. దీంతో ఈయన కూడా ఇప్పుడు సీఎం రేసులో కొనసాగుతున్నారు.
ఇతరులు
నార్త్ ఈస్ట్ ఎంపీ మనోజ్ తివారీ కూడా ఢీల్లీ సీఎం అయ్యే అవకాశం ఉంది. ఈసారి ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. కానీ భవిష్యత్తులో బీజేపీకి ఆయన సేవలు ఉపయోగపడవచ్చు. అంతేకాదు ఈసారి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన విస్తృతంగా పర్యటించారు. మరోవైపు బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ, పార్టీ జాతీయ కార్యదర్శి దుశ్యంత్ గౌతమ్, అలాగే కపిల్ మిశ్రా వంటి పేర్లు కూడా సీఎం రేసులో వినిపిస్తున్నాయి. అయితే బీజేపీ ఎప్పటిలాగే అనేక అంశాలు, సమీకరణలు పరిగణలోకి తీసుకొని సీఎం అభ్యర్థిని ప్రకటిస్తుంది. మరీ ఈసారి ఢిల్లీ ముఖ్యమంత్రి బాధ్యతలు ఎవరి చేతుల్లోకి వెళ్తాయనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.