/rtv/media/media_files/2026/01/31/sunetra-pawar-2026-01-31-15-39-20.jpg)
Sunetra Pawar
ఎన్సీపీ నేత అజిత్ పవార్ మరణం తర్వాత మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఆయన సతీమణి సునేత్ర పవార్ శనివారం సాయంత్రం డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇకనుంచి ఆమెనే ఎన్సీపీ అజిత్ పవార్ వర్గాన్ని ముందుకు నడిపించనున్నారు. శరద్ పవార్ వర్గంతో ఈ పార్టీ విలీనం అవుతుందా ? లేదా? అనేది ఇంకా ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది. మరికొన్నిరోజుల్లోనే దీనిపై క్లారిటీ రానుంది. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న సునేత్ర పవార్ పేరు మహారాష్ట్రవ్యాప్తంగా మారుమోగిపోతోంది. ఆమె గురించి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
రాజకీయ కుటుంబం నుంచి సునేత్ర
సునేత్ర పవార్ మహారాష్ట్రలోని ఒస్మానాబాద్ (ప్రస్తుతం దరాశివ్) జిల్లాలో 1963, అక్టోబర్ 18న జన్మించారు. ఆమె తండ్రి బాజీరావ్ పాటిల్ అప్పట్లో రాజకీయ నేతగా పనిచేశారు. ఆమె సోదరుడు పద్మసింగ్ పాటిల్.. మహారాష్ట్ర మాజీ మంత్రి, మాజీ లోక్‌సభ ఎంపీగా సేవలందించారు. సునేత్ర ఔరంగాబాద్‌లో ఓ కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ డిగ్రీని పూర్తి చేశారు. ఆమెకు 1985లో ఎన్సీపీ నేత అజిత్ పవార్‌తో వివాహం జరిగింది.ఈ దంపతులకు పార్థ్ పవార్, జయ్ పవార్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.
2010లో సునేత్ర ఎన్విరాన్‌మెంటల్ ఫోరమ్ ఆఫ్ ఇండియా(EFOI)ని స్థాపించారు. ఈ స్వచ్ఛంద సంస్థతో సేంద్రియ వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఆమె నాయకత్వంలో EFOI సంస్థ మహారాష్ట్రలో సుస్థిర గ్రామీణాభివృద్ధి పద్ధతులను అమలు చేయడంలో కీలక పాత్ర పోషించింది. పర్యావరణానికి హాని కలగకుండా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, వ్యర్థాల నిర్వహణ లాంటి పద్ధతులను ఆమె ప్రోత్సహించారు. పర్యావరణ పరిరక్షణ కోసం సునేత్ర చేసిన నిరంతర కృషికి గుర్తింపుగా ఆమెకు గ్రీన్ వారియర్ అవార్డు లభించింది.
Also Read: గ్రీన్ ల్యాండ్‌కు ముంచుకొస్తున్న కొత్త ముప్పు.. ఈ సారి ట్రంప్ కాదు.. మరి ఏంటో తెలుసా?
సామాజిక కార్యక్రమాలకు ప్రాధాన్యత
ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ స్థాపించిన విద్యా ప్రతిష్ఠాన్ అనే విద్యా సంస్థకు కూడా ఆమె ట్రస్టీగా సేవలు అందించారు. ఇందులో 25 వేల మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. అంతేకాదు 2017 నుంచి ఆమె సావిత్రిబాయి ఫూలే పూణే యూనివర్సిటీకి సెనేట్ మెంబర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సునేత్ర పవార్ రాజకీయాలు దూరంగా ఉన్నప్పటికీ సామాజిక సేవా కార్యక్రమాల్లో మాత్రం చురుగ్గా ఉండేవారు. ఇటీవలే రాజకీయ ప్రవేశం చేశారు. ఆమె తొలిసారిగా 2024 లోక్‌సభ ఎన్నికల్లో బారామతి లోక్‌సభ నియోజకవర్గం నుంచి NCP (అజిత్ పవార్ వర్గం) తరపున పోటీ చేశారు. కానీ తన మరదలు సుప్రియా సూలే చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత 2024 జూన్ 18న ఆమెను రాజ్యసభ సభ్యురాలిగా ఎంపిక చేశారు.
Also Read: మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనం.. రాజ్యసభకు పవార్ కొడుకు!
ఈ ఏడాది జనవరి 28న ఆమె భర్త, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. దీంతో శనివారం ఎన్సీపీ శాసనసభాపక్ష సమావేశంలో ఆమెను తమ నాయకురాలిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు సాయంత్రం సునేత్ర డిప్యూటీ సీఎంగా శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. మహారాష్ట్రలో తొలి మహిళా డిప్యూటీ సీఎంగా సునేత్ర నిలిచారు. డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రూల్స్ ప్రకారం రాష్ట్ర శాసనసభకు లేదా శాసనమండలికి ఎన్నిక కావాల్సి ఉంటుంది. దీంతో ఆమె తన రాజ్యసభ పదవికి రాజీనామా చేయనున్నారు. అజిత్ పవార్ స్థానమైన బారామతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచే ఆమె బరిలోకి దిగనున్నారు.
Follow Us