TN: కరూర్ ఘటన తర్వాత విజయ్ కు వరుస బాంబు బెదిరింపులు..రోడ్ షోలు వద్దంటూ వార్నింగ్

కరూర్ రోడ్ షో తొక్కిసలాట టీవీకే పార్టీ అధిపతి విజయ్ కు పీడకలగా మారింది. దీని తరువాత ఆయనకు వరుసపెట్టి బెదిరింపు కాల్స్ వస్తూనే ఉన్నాయి. తాజాగా విజయ్ మరోసారి రోడ్ షో చేస్తే ఇంటిని పేల్చేస్తానంటూ కన్యాకుమారి నుంచి ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి బెదిరించాడు. 

New Update
tvk

టీవీకే పార్టీ అధినేత విజయ్ పూర్తిగా రాజకీయాల్లోకి దిగక ముందే ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కొన్ని రోజుల క్రితం ఆయన చేసిన రోడ్ షో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అప్పటి నుంచి ఆయనకు ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి. ఇప్పటికే మిగతా పార్టీల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. దానికి తోడు వరుసపెట్టి బెదిరింపు కాల్ప్ కూడా వస్తున్నాయి. తాజాగా చెన్నైలోని నీలంకరై లో ఉన్న విజయ్ ఇంటిని బాంబుతో పేల్చేస్తానంటూ బెదిరింపులు వచ్చాయి. చెన్నై పోలీసులకు అజ్ఞాత వ్యక్తి డైరెక్ట్ గా కాల్ చేసి మరీ బెదిరించాడు. విజయ్ మళ్ళీ భవిష్యత్తులో ర్యాలీలు చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించాడు. ఈ బెదిరింపు కాల్‌ అందిన వెంటనే అప్రమత్తమైన చెన్నై పోలీసులు.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు విజయ్ ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఎక్కువవుతున్న బెదిరింపు కాల్స్..

దాంతో పాటూ బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని పట్టుకోవడానికి వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. ఫోన్ కాల్ తమిళనాడులోని కన్యాకుమారి నుంచి వచ్చిందని గుర్తించారు. త్వరలోనే నిందితుడిని కూడా పట్టుకుంటామని పోలీసులు చెప్పారు. అయితే విజయ్ కు ఇలాంటి బెదిరింపు కాల్స్ రావడం ఇది మూడోసారి. అది కూడా కరూర్ ఘటన జరిగిన తర్వాతనే. ఇది కొంత ఆందోళనకరమైన విషయమని చెన్నై పోలీసులు అంటున్నారు. దాంతో పాటూ రీసెంట్ గా ప్రముఖులకు బాంబు బెదిరింపులు రావడం ఎక్కువైంది. విజయ్‌తో పాటు ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌, సినీ తారలు త్రిష, నయనతార నివాసాలకు కూడా ఇలాంటి బెదిరింపు కాల్స్ వచ్చాయి.

తమిళనాడులోని కరూర్ లో సినీ నటుడు, టీవీకే అధినేత విజయ్ నిర్వహించిన రోడ్ షో లో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 41 మంది చనిపోయారు. చాలా మంది తీవ్ర గాయాలపాలయ్యరు. మృతి చెందిన వారిలో మహిళలతో పాటు చిన్నారులు ఉన్నారు. విజయ్ సభకు ఊహించిన దాని కంటే ఎక్కువ మంది రావడం వల్లనే ఈ తొక్కిసలాట జరిగిందని అధికారులు చెబుతున్నారు.  పదివేల మంది పట్టే చోట లక్ష మంది జనం వచ్చారని...దీని కారణంగానే తొక్కిసలాట జరిగిందని అధికారులు ధృవీకరించారు. అయితే  పరిస్థితి గమనించిన విజయ్ ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి వారికి నీళ్ల బాటిళ్లను అందించారు. చాలా మంది స్పృహ తప్పి పడిపోయారు. భారీ సమూహంలో అంబులెన్సులు అక్కడకు చేరుకోవడం ఇబ్బందిగా మారడంతో మృతుల సంఖ్య పెరిగింది. మరణించిన వారిలో పార్టీ కార్యకర్తలతో పాటూ ఆరుగురు చిన్నారులు కూడా ఉన్నారు.

Also Read: Illinois: నేషనల్ గార్డ్స్ రావడానికి వీల్లేదు..అడ్డుకున్న ఇల్లినాయిస్ కోర్టు

Advertisment
తాజా కథనాలు