/rtv/media/media_files/2025/01/28/s1UuSuJHkj8pJZaFDAsZ.jpg)
Pm Narendra Modi, President Trump
రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటూ ఉక్రెయిన్ తో యుద్ధానికి సహాయం చేస్తున్నారని భారత్ పై 50 శాతం సుంకాలు విధించారు ట్రంప్. కానీ భారత్ దీనిని ఖండించింది. అమెరికా పాల ఉత్పత్తులు దిగుమతి చేసుకోవాలని వత్తిడి చేసిందని..దానిని తాము నిరాకరించినందు వల్లనే సుంకాలు విధించిందని చెప్పింది. అమెరికా కోరినట్టు చేస్తే ఇక్కడ రైతులు, పశువుల పెంపంకందారులు ప్రమాదంలో పడతారని చెబుతోంది. ఈ విషయంపై రెండు దేశాల మధ్యనా ఇప్పటికే ఐదు సార్లు చర్చలు జరిగాయి. ఆరవ రౌండ్ ఆగస్టు 25 నుంచి 29 వరకు జరగాల్సి ఉంది. దీని కోసం అమెరికా ప్రతినిధి బృందం భారత్ రాజధాని ఢిల్లీ రావాల్సి ఉంది. కానీ ఇప్పుడు వారి పర్యటన వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది.
చర్చలు ఉండవు..
భారత్ పై అమెరికా ముందు 25 శాతం సుంకాలను విధించింది. తరువాత రష్యాను నెపంగా చూపెడుతూ మరో 25 శాతం పెంచింది. మొదటి దఫా సుంకాలు ఆగస్టు 7 నుంచి మొదలవుతాయని...రెండో దఫా సుంకాలు ఆగస్టు 27 నుంచి అమలు అవుతాయని అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. అందువల్లనే భారత్, అమెరికా ప్రతినిధుల మధ్య జరగాల్సిన చర్చలు వాయిదా పడనున్నాయని తెలుస్తోంది. అంతే కాదు నిన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ తో సమావేశం జరిగిన నేపథ్యంలో కూడా చర్చలు వాయిదా పడనున్నాయని చెబుతున్నారు. ఈ భేటీ తర్వాత తాను ఇప్పుడు సుంకాల గురించి ఆలోచించడం లేదని...రెండు, మూడు వారాల తర్వాత పున: సమీక్షిస్తానని ట్రంప్ స్వయంగా చెప్పారు. అప్పటి వరకు భారత్ తో చర్చలు ఉండవని కూడా స్పష్టం చేశారు. అంతకు ముందు కూడా భారత్ మొండి వైఖరి వల్ల తాము ఆ దేశంతో చర్చలకు సిద్ధంగా లేమని ట్రంప్ అన్నారు.
రైతులే ముఖ్యం..
మరోవైపు ఆగస్టు 15 వేడుకల సందేశంలో భారత ప్రధాని సుంకాల విషయంపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. నాణ్యమైన ఉత్పత్తులతో ప్రపంచ మార్కెట్లో మన సామర్థ్యం నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. భారతదేశం చరిత్ర లిఖించాల్సిన అవసరం వచ్చిందని అన్నారు. మనం ప్రపంచ మార్కెట్ ను పాలించాలి. తక్కువ ధర, అధిక నాణ్యతతో వస్తువులను ఉత్పత్తి చేయాలి. దాని ద్వారా ఆర్థిక సామర్థ్యం పెంచుకోవాలని మోదీ అన్నారు. మనల్ని ఎవరూ తక్కువ చేసి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకూడదని చెప్పారు. దేశంలో వ్యాపారులు, వర్తకులు స్వదేశీ ఉత్పత్తుల అమ్మకాలపై దృష్టి పెట్టాలని ప్రధాని సూచించారు. భారతదేశం పురోగతిని సాధిస్తోందని...దీన్ని ప్రపంచం గమనిస్తోందని తెలిపారు. రైతు వ్యతిరేక విధానాలను సహించమని...దాని కోసం దేనికైనా వెనుకాడమని ప్రధాని మోదీ మరోసారి స్పష్టం చేశారు.
Also Read: Putin: యుద్ధం ముగించాలంటే అది మాకు కావాలి..పుతిన్ కీలక డిమాండ్