Operation Sindoor : పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కు దేశవ్యాప్తంగా ప్రజల మద్ధతు లభిస్తోంది. పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్ చేసిన మెరుపుదాడులతో పాకిస్థాన్ బెంబేలెత్తిపోయింది. పాక్‌తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని 9 స్థావరాలపై భారత్ ఏకకాలంతో బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో ఏకంగా ఉగ్ర సంస్థలకు చెందిన ముఖ్య నాయకులతో పాటు వందల సంఖ్యలో టెర్రరిస్టులు మరణించినట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా భారత్ ప్రతీకార చర్యలను రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా భారత్ దాడులపై భారత మాజీ ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుందే నరవణే స్పందించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్ వేదికగా "అబీతో పిక్చర్ బాకీ హై' అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఇప్పుడు ఆ ట్వీట్ వైరల్ అవుతోంది.
అంటే ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగిసిపోలేదని, ఇది ట్రైలర్ మాత్రమేనని అసలు సినిమా ఇంకా మిగిలే ఉంది అని అర్థం వచ్చేలా ఆయన పోస్ట్ చేశారు. ఆర్మీ చీఫ్ ట్వీట్‌తో ఇండియన్ ఆర్మీ తరవాత చేయబోయే దాడులు ఏ రేంజ్‌లో ఉండబోతున్నాయో అన్న ఆసక్తి భారత ప్రజల్లో నెలకొంది. గతంలో ఆయన ఆర్మీ చీఫ్ గా ఉన్న సమయంలో పాకిస్థాన్ ఉగ్రవాద చర్యలను సమర్థవంతంగా ఎదుర్కొవడంలో ఎంతో కృషి చేశారు.