/rtv/media/media_files/2025/10/28/suryakant-as-the-new-cji-2025-10-28-07-30-07.jpg)
Suryakant as the new CJI
Justice Suryakant : భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ నియమకం కానున్నారు. ఆయన పేరును ప్రస్తుత సీజేఐ జస్టిస్ బి.ఆర్.గవాయ్ ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. ఆయన నియామకాన్ని రాష్ట్రపతి ఆమోదించడమే తరువాయి. ఆయన నియామకానికి రాష్ట్రపతిగ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం లాంఛనమే. సూర్యకాంత్ వచ్చే నెల 24వ తేదీన దేశ 53వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు. దానికి ఒక రోజు ముందు అంటే 23వ తేదీన ప్రస్తుత సీజేఐ జస్టిస్ గవాయ్ పదవీ విరమణ చేస్తారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్న న్యాయమూర్తుల్లో సీనియారిటీలో తన తర్వాతి స్థానంలో ఉన్న జస్టిస్ సూర్యకాంత్‌ను తదుపరి సీజేఐగా నియమించాలని జస్టిస్ గవాయ్ కేంద్ర న్యాయశాఖకు సిఫార్సు చేస్తూ లేఖ పంపారు. దానికి సంబంధించిన ప్రతిని సోమవారం రోజున జస్టిస్ సూర్యకాంత్‌కు అందజేశారు. ఈ మేరకు ‘సుప్రీం కోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తి పదవికి సీనియర్ జడ్జి అయిన జస్టిస్ సూర్యకాంత్ పేరును సీజేఐ జస్టిస్ బి.ఆర్.గవాయ్ సిఫార్సు చేశారు’ అని సుప్రీం కోర్టు విడుదల చేసిన ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.
కేవలం ఏడాది రెండునెలలే పదవీకాలం..
కాగా నవంబరు 24వ తేదీన సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ సూర్యకాంత్ కేవలం 14 నెలలు మాత్రమే సీజేఐగా బాధ్యతల నిర్వర్తించనున్నారు. 2027 ఫిబ్రవరి 9న పదవీ విరమణ చేస్తారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టబోతున్న తొలి హరియాణా వాసి జస్టిస్ సూర్యకాంత్ కావడం గమనార్హం. ఇది ఆయనకు సరికొత్త రికార్డుగా మిగిలిపోనుంది.
ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే..
దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ సూర్యకాంత్1962 ఫిబ్రవరి 10న హరియాణా రాష్ర్టంలోని హిస్సార్ జిల్లాలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. అక్కడే 1981లో డిగ్రీ పూర్తి చేశారు. 1984లో రోహ్‌తక్‌లోని మహర్షి దయానంద్ యూనివర్సిటీ నుంచి న్యాయ శాస్త్రం పూర్తి చేసి పట్టా పొందారు. అదే సంవత్సరం హిస్సార్ జిల్లా కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. ఆ తర్వాత 1985లో పంజాబ్ హరియాణా హైకోర్టుకు మారారు. 2001లో సీనియర్ న్యాయవాదిగా హోదా లభించింది. ఆయన హరియాణా అడ్వకేట్ జనరల్‌గా కూడా పని చేశారు. అనంతరం 2004 జనవరి 9న పంజాబ్ హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2018 అక్టోబరు 5న హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన ఆయన ఆ తర్వాతి ఏడాది 2019 మే 24వ తేదీన సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. మరోవైపు 2011లో ఆయన కురుక్షేత్ర విశ్వవిద్యాలయం నుంచి న్యాయ శాస్త్రంలో పీజీ పూర్తి చేశారు.
పలు తీర్పుల్లో కీలక భాగస్వామి..
రెండు దశాబ్దాలకు పైగా న్యాయమూర్తిగా వివిధ ధర్మాసనాల్లో పని చేసిన జస్టిస్ సూర్యకాంత్ పలు కీలక తీర్పుల్లో భాగస్వామిగా ఉండటం విశేషం. ఆర్టికల్ 370 రద్దుపై తీర్పు ఇచ్చిన ధర్మాసనంలో ఆయన భాగస్వామి. దీంతోపాటు వాక్‌స్వాతంత్య్రం, అవినీతి, బిహార్ ఓటర్ల జాబితా, పర్యావరణం, లింగసమానత్వం వంటి అనేక అంశాల్లో ఆయన కీలక తీర్పులను వెలువరించారు.
దేశంలో బ్రిటీష్ కాలం నాటి దేశద్రోహ చట్టాన్ని నిలిపివేస్తూ ఇచ్చిన తీర్పులో జస్టిస్ సూర్యకాంత్‌ది ప్రధాన పాత్ర. ఈ చట్టం కింద కొత్తగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయవద్దని ఆయన సంచలన తీర్పు వెలువరించారు. బిహార్‌లో ప్రత్యేక ముమ్మర సవరణలో (సర్) భాగంగా ఎన్నికల సంఘం 65 లక్షల మంది ఓటర్లను తొలగిస్తూ తీసుకున్న నిర్ణయంపై ఆయన ధర్మాసనం తీర్పు చెప్పింది. తీసేసిన వారందరి పేర్లను బహిరంగపరచాలని ఆదేశించడం గమనార్హం. సుప్రీంకోర్టుతోపాటు అన్ని కోర్టుల బార్ అసోసియేషన్లలో మూడో వంతు సీట్లను మహిళలకు కేటాయించేలా ఆయన ఆదేశించారు.
సైనిక దళాల్లో ఒకే ర్యాంకు.. ఒకే పెన్షన్ విధానాన్ని సమర్థిస్తూ తీర్పు చెప్పారు. పెగాసస్‌పై విచారణ, ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్ ప్రాజెక్టు పర్యావరణ మదింపు కేసు, ఢీల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు మద్యం కేసులో బెయిలు మంజూరు తదితర కీలక తీర్పులు వెలువరించిన కేసుల్లో సూర్యకాంత్ భాగస్వామిగా ఉన్నారు.
Follow Us