BREAKING: కార్గో షిప్‌‌లో భారీ అగ్నిప్రమాదం.. కాలిబూడిదైన వందల టన్నుల బియ్యం

గుజరాత్‌ పోర్‌బందర్ సుభాష్‌నగర్ జెట్టీ వద్ద సోమాలియాకు బయలుదేరాల్సిన ఓ కార్గో షిప్‌లో  సోమవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నౌకలో ఉన్న బియ్యం, చక్కెర సరకులకు మంటలు అంటుకోవడంతో మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి.

New Update
ship fire accident

గుజరాత్‌ పోర్‌బందర్ సుభాష్‌నగర్ జెట్టీ వద్ద సోమాలియాకు బయలుదేరాల్సిన ఓ కార్గో షిప్‌లో  సోమవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నౌకలో ఉన్న బియ్యం, చక్కెర సరకులకు మంటలు అంటుకోవడంతో మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. జామ్‌నగర్‌కు చెందిన 'హరిదర్శన్' అనే ఈ కార్గో నౌక సుమారు 950 టన్నుల బియ్యం, 78 టన్నుల చక్కెరతో సోమాలియాలోని బొసాసోకు వెళ్లాల్సి ఉంది.

అగ్నిప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైరింజన్లతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, నౌకలో చెక్కర, ఇతర సరకుల కారణంగా మంటలు భారీగా  వ్యాపించాయి. ప్రమాద తీవ్రతను తగ్గించేందుకు, సమీపంలోని ఇతర నౌకలు, జెట్టీలకు మంటలు అంటుకోకుండా ఉండేందుకు అధికారులు ఆ నౌకను జెట్టీ నుంచి సముద్రంలోకి మధ్యలోకి లాగారు.

ప్రస్తుతం మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం సంభవించినప్పటికీ, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. నౌకలో ఉన్న 14 మంది సిబ్బందిని సురక్షితంగా రక్షించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనతో పోర్బందర్ జెట్టీ వద్ద కొంత ఆందోళన నెలకొంది. ఈ నౌక యజమాని జామ్‌నగర్‌కు చెందిన హెచ్‌ఆర్‌ఎం అండ్ సన్స్ సంస్థకు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లిందని భావిస్తున్నారు. మంటల నుంచి దట్టమైన పొగలు వెలువడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisment
తాజా కథనాలు