Karur stampede : కరూర్‌ తొక్కిసలాటలో సంచలన విషయాలు.. పగిలిన మృతుల ఊపిరితిత్తులు

తమిళనాడు కరూర్‌లో సినీనటుడు విజయ్‌ తన రాజకీయ పార్టీ టీవీకే ప్రచార కార్యక్రమంలో తీవ్ర తొక్కిసలాట జరిగి 41మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ తొక్కిసలాట ఎంతఘోరంగా జరిగిందనే విషయంలో సాగుతున్న దర్యాప్తులో హృదయ విదారక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

New Update
Karur stampede

 Karur stampede

Karur stampede: తమిళనాడు కరూర్‌లో సినీనటుడు విజయ్‌ తన రాజకీయ పార్టీ టీవీకే ప్రచార కార్యక్రమంలో తీవ్ర తొక్కిసలాట జరిగి 41మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ తొక్కిసలాట ఎంతఘోరంగా జరిగిందనే విషయంలో సాగుతున్న దర్యాప్తులో హృదయ విదారక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తొక్కిసలాట, తోపులాట చాలా తీవ్రంగా జరిగినట్లుగా వైద్య నివేదికలు చెబుతున్నాయి. పెద్ద ఎత్తున తొక్కిసలాట జరగడం వల్లే మరణాలు పెరిగాయని వైద్యులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. తమిళనాడు వైద్యవిద్య, పరిశోధన విభాగ డైరెక్టర్‌ ఆర్‌.సుగంధి రాజకుమారి నేతృత్వంలో ఏర్పాటైన ప్రత్యేక బృందం ప్రమాదం జరిగిన కరూర్‌ను సందర్శించింది. మృతులు, చికిత్స పొందుతున్న రోగులకు అందిన వైద్యం, వారి పరిస్థితి దగ్గరుండి గమనించింది. కేస్‌షీట్లు, వైద్యుల నివేదికలు క్షుణ్ణంగా పరిశీలించగా అందులో పలు సంచలన విషయాలు వెలుగు చూశాయి.

చాలామంది కంప్రెస్సివ్‌ అస్ఫిక్సియాతో ఇబ్బందిపడి చనిపోయారని వైద్యులు బృందానికి తెలిపారు. అంటే ‘తొక్కిసలాట, తోపులాట తీవ్రంగా జరిగిందని ఫలితంగా ఛాతీభాగం బలంగా ఒత్తిడికి గురవడంతో ఊపిరితిత్తులు సంకోచ, వ్యాకోచాలకు కష్టమైందని వివరించారు. ఊపిరితిత్తులపై ఒత్తిడి కారణంగా గాలి లోపలికి ప్రవేశించలేకపోయింది. మెదడుకు ఆక్సిజన్‌ సరఫరా నిలిచిపోయింది.ఇలాంటి పరిస్థితుల్లో ఎంతటి క్లిష్టపరిస్థితుల్లోనైనా 2, 3 నిమిషాలకు మించి బతికే అవకాశం లేదు. చిన్న పిల్లలైతే 30సెకన్లలోనే ప్రభావానికి గురవుతారు’ అని వైద్యులు తెలిపారు. చనిపోయిన కొందరి ఊపరితిత్తుల్ని స్కాన్‌ చేసినపుడు పగుళ్లు(ఫ్రాక్చర్స్‌) కనిపించాయని, తద్వారా తొక్కిసలాట ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చని వైద్యులు వివరించారు. ఆ సమయంలో మృతులు  ఊపిరి పీల్చుకోవడానికి చాలారకాలుగా ప్రయత్నించినట్లు అర్థమవుతోందని, కానీ, శ్వాస తీసుకునేందుకు ఊపిరితిత్తులు సహకరించలేదని తెలుస్తోందన్నారు. ఆ  ప్రయత్నంతో తీవ్ర ఒత్తిడి కారణంగా.. గుండె చుట్టూ రక్తస్రావం ఏర్పడింది. ఊపిరితిత్తులు పనిచేయడం ఆగిపోవడంతో మరణం సంభవించింది. అని వైద్యులు నిర్ధారించారు.

చనిపోయిన వారితో పాటు ఇంకా ఆసుపత్రుల్లో చికిత్స పొందిన, పొందుతున్న వారికి ఎక్స్‌రే, స్కానింగ్‌లు తీశారు. వాటిని కూడా వైద్యబృందం పరిశీలించింది. అత్యధికుల్లో పక్కటెముకలు, వెన్నెముకలు విరిగినట్లు గుర్తించారు. అంత తీవ్రంగా తొక్కిసలాట జరిగి ఉంటుందని, తీవ్రమైన నొప్పిని వారు భరించి ఉంటారని చెబుతున్నారు. ఇప్పటిదాకా 41మంది మృతి చెందినట్లుప్రకటించారు. ఘటన జరిగిన 27వ తేదీ రాత్రి కరూర్‌ ప్రభుత్వ మెడికల్‌ కళాశాల ఆసుపత్రికి తీసుకువచ్చిన వారిలో 39మంది మార్గమధ్యంలోనే మృతిచెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు.అందులో నలుగురిని ఇతరత్రా ఆసుపత్రుల నుంచి రిఫరల్‌ కింద తీసుకొచ్చారు. పరీక్షల అనంతరం ఈ మృతదేహాల్ని పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు. మృతుల్లో అతిచిన్న వయస్కుడైన 2ఏళ్ల బాలుడు ఉన్నాడన, అతన్ని ఘటన జరిగినరోజు రాత్రి 8 గంటలకు ఆసుపత్రికి తీసుకువచ్చారన్నారు.  వైద్యులు  గుర్తించిన తొలి మృతుడు కూడా ఇతడేనని వైద్యులు తెలిపారు. ఇప్పటికీ ఇంకా 59 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా మరో ఇద్దరు ఐసీయూలో ఉన్నారని వైద్య బృందం వెల్లడించింది.

ఇది కూడా చూడండి: Raipur Steel Plant Collapses: కుప్పకూలిన స్టీల్ ప్లాంట్.. ఐదుగురు కార్మికుల దుర్మరణం!

Advertisment
తాజా కథనాలు